జూన్ నాటికి రెండు టీఎంసీలు ఎత్తిపోయాల్సిందే: కేసీఆర్

జూన్ నాటికి రెండు టీఎంసీలు ఎత్తిపోయాల్సిందే: కేసీఆర్

మేడిగడ్డ బ్యారేజీ నుంచి ఈ ఏడాదే రోజూ రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని, పనులన్నీ వేగంగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్​ ఆదేశించారు. అవసరమైనంత సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జూన్​లో కన్నెపల్లి పంపుహౌజ్​ ట్రయల్​ రన్​ చేయాలని, దానికి తాను స్వయంగా వస్తానని చెప్పారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రోజుకు మూడు టీఎంసీల నీళ్లను ఎత్తిపోస్తే నది ఎగబాకినట్టు ఉంటది. వచ్చే యేడు వానాకాలంలో ఆ దృశ్యం సాక్షాత్కరిస్తది. నది తరలిపోతే ఎట్లా ఉంటదో ఇప్పుడే కండ్లళ్ల కదలాడుతున్నది. ఆ నీళ్లతో 45 లక్షల ఎకరాల్లో రెండు పంటలు పండినపుడు రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తది’’అని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్‌లను కేసీఆర్​ సందర్శించారు. బ్యారేజీ నిర్మాణంతో పాటు గేట్ల ఏర్పాటు, కరకట్టలు, బ్యారేజీకి ఎగువన గోదావరిలో ప్రవాహాన్ని ఆపేందుకు ఏర్పాటు చేసిన కాఫర్‌ డ్యాం, ఇతర పనులను పరిశీలించారు. పంపుహౌస్‌ లోపలికి దిగి మోటార్ల ఏర్పాటును చూశారు. అక్కడ అధికారులు, కార్మికులతో మాట్లాడారు. తర్వాత ప్రాజెక్టు గెస్ట్​ హౌజ్​కు చేరుకుని ఇంజనీర్లు, అధికారులతో మాట్లాడారు. పనులన్నీ వీలైనంత త్వరగా పూర్తి కావాలని, తనకు ఎలాంటి సాకులూ చెప్పవద్దని స్పష్టం చేశారు. గోదావరిలో వరద వచ్చే లోపే ప్రాజెక్టు పూర్తి కావాలన్నారు. అవసరమైతే దేశంలో ఎక్కడి నుంచైనా వెల్డర్లు, ఫిట్టర్లను పిలిపించి ప్రాజెక్టు గేట్లు, ఇతర పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతిగేటును లిఫ్ట్‌ చేసి పరిశీలించాలన్నారు. ఒక్కో గేటు వద్ద ఎంత మంది సిబ్బంది అవసరమో అంత మందిని ఏర్పాటు చేసి, మూడు షిఫ్టుల్లో పని చేయించాలని ఇంజనీర్లకు సూచించారు.

సమస్యల్ని వెంటనే పరిష్కరించండి

ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే 170 కిలోమీటర్ల పొడవునా గోదావరిలో నీరు నిలిచి ఉంటుందని, ధర్మపురి లక్ష్మీనరసింహుడి పాదాలను గోదావరి నీళ్లు తాకుతాయని సీఎం కేసీఆర్​ పేర్కొన్నారు. వచ్చే యేడాది నుంచి ప్రాజెక్టు నీళ్లతో 45 లక్షల ఎకరాల్లో రెండు పంటలు పండుతాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడం ఎంత ముఖ్యమో.. ప్రాజెక్టు ఆపరేషన్‌, మెయింటెనెన్స్‌ అంతే ముఖ్యమని చెప్పారు. జూలైలో రెండు టీఎంసీల చొప్పున నీళ్లు తరలించి రైతుల పొలాలకు అందించాలన్నారు. నీటిని తరలిస్తున్నప్పుడు సమస్యలు ఎదురవుతాయని, వాటిని పకడ్బందీగా పరిష్కరించాలని సూచించారు.

జాగ్రత్తగా ఉండాలి

పనుల్లో క్వాలిటీ విషయంలో పక్కాగా ఉండాలని కేసీఆర్​ స్పష్టం చేశారు. పనులు కాస్త ఆలస్యమైనా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. విద్యుత్‌ సరఫరాపరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తపడాలని, అన్ని విభాగాల్లో చెక్‌లిస్ట్‌ పూర్తయిన తర్వాతే కన్నెపల్లిలో మోటార్లను ట్రయల్‌ రన్‌ చేయాలని సూచించారు. ట్రయల్‌ రన్‌కు తాను, సీఎస్‌ కలిసి వస్తామన్నారు.

టార్గెట్ల వారీగా పనులు చేయాలె

కాళేశ్వరం నుంచి మిడ్‌మానేరు వరకు ఫేజ్‌–1గా, మిడ్‌ మానేరు నుంచి మిగతా పనులను ఫేజ్‌–2గా పరిగణించి టార్గెట్ల వారీగా పనులు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. పంపుహౌజ్‌లు, ఇతర ప్రాజెక్టు ఆపరేషన్‌ విషయంలో ఇండిపెండెంట్‌ వైర్‌లెస్‌ సిస్టం ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రవాహంలో కొట్టుకొచ్చే కట్టెలు, ఇతర వ్యర్థాలు పంపుల్లోకి రాకుండా జాలీ తరహాలో ట్రాష్‌ ట్రాక్‌ ఏర్పాటు చేయాలన్నారు. రెండు టీఎంసీల నీళ్లను ఎత్తిపోయడమే మొదటి ప్రయారిటీ అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. తక్కువ వ్యవధిలో పనులు పూర్తిచేశారంటూ ఇంజనీర్లు, సిబ్బందిని అభినందించారు.