లాలూతో సీఎం కేసీఆర్ భేటీ

లాలూతో సీఎం కేసీఆర్ భేటీ

పాట్నా: బీహార్ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ పాట్నా సాహిబ్ గురుద్వారాను సందర్శించారు. గురు గోవింద్ సింగ్ జన్మస్థలమైన గురుద్వారాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ గురుద్వారాకు వెళ్లిన సందర్భంగా సిక్కులు ధరించే తలపాగా ధరించారు. ముఖ్యమంత్రి తలపాగా ధరించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. 

అంతకు ముందు అనారోగ్యంతో బాధపడుతున్న బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ ను సీఎం కేసీఆర్ పరామర్శించారు. బీహార్ పర్యటనలో ఉన్న కేసీఆర్... అక్కడి డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ నివాసానికి చేరుకున్నారు. తేజస్వి యాదవ్ తండ్రియైన లాలూ ప్రసాద్ యాదవ్ ను పలకరించిన కేసీఆర్... ఆయన యోగ క్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. సమకాలీన రాజకీయాలపై ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. 

బీహార్ పర్యటనలో భాగంగా కేసీఆర్.. సీఎం  నితీష్ కుమార్ తో సమావేశమై దేశ రాజకీయాలపై చర్చించారు. అనంతరం మాట్లాడుతూ... ప్రధాని మోడీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ నెరవేరలేదన్నారు. డాలర్ తో పోలిస్తే రోజు రోజుకి రూపాయి విలువ పడిపోతుందని...  ప్రధాని మోడీ పాలనలో ప్రజలు ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దేశ రాజధాని ఢిల్లీలోనే కరెంట్ కోతలున్నాయని.. మంచినీళ్లు లేని పరిస్థితి ఉందన్నారు. బీజేపీ ప్రజాస్వామ్య వ్యవస్థను కూనీ చేస్తుందన్న కేసీఆర్.. ధరలు పెరగడంతో దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.