సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయ సందర్శన

సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయ సందర్శన

సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన కొనసాగుతోంది. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో యాదాద్రి చేరుకున్న కేసీఆర్ కు స్థానిక నేతలు, ఆయల అధికారులు ఘన స్వాగతం పలికారు. బాలాలయంలో సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎంతో పాటు మంత్రులు, స్థానిక నేతలను శాలువా కప్పి అశీర్వదించారు పండితులు, స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు ఆలయ ఈవో. ఆ తర్వాత లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పనులను పరిశీలిస్తున్నారు కేసీఆర్. ఇప్పటి వరకు పూర్తయిన పనుల వివరాలను సీఎంకు తెలియజేస్తున్నారు అధికారులు.  సీఎం పర్యటనలో ఆయన వెంట  మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, సీనియర్ నేతలు గుత్తా సుఖేందర్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు తదితరులు ఉన్నారు.

త్వరలో ఆలయ పున : ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. ఈ టూర్లోనే ఆలయ ప్రారంభ తేదీని ఖరారు చేయనున్నారు సీఎం కేసీఆర్. ప్రధాన ఆలయ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. మిగతా పనుల పురోగతిని పరిశీలించనున్నారు. త్వరలో ప్రధానాలయంలో భక్తులను దర్శనానికి అనుమతించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ లేదా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆలయ పున: ప్రారంభమయ్యే అవకాశముంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మిస్తోంది. ఆలయ పనులన్నీ ఇప్పటికే పూర్తి కాగా, మిగిలిన అభివృద్ధి పనులు చేస్తున్నారు.  అన్నింటినీ ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు సీఎం. 

ఇవాల్టి పర్యటనలో ఆలయ అర్చకులు, ప్రముఖులతో మాట్లాడనున్నారు సీఎం. సుదర్శన యాగం నిర్వహణపై చర్చించనున్నారు. ఆ తర్వాత.. అక్కడే యాదాద్రి పున: ప్రారంభ తేదీలు, మహా సుదర్శన యాగం వివరాలను సీఎం కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరి 18నే ఆలయ పున: ప్రారంభానికి తేదీ ఖరారైనట్టు ప్రచారం జరిగింది. చివరికి అది వాయిదా పడింది.  బ్రహ్మోత్సవాల కంటే ముందుగానే భక్తులకు దర్శనం కల్పిస్తే ఆ టైమ్ కు అన్నీ సర్దుకుంటాయనే భావనలో యాదాద్రి డెవలప్మెంట్ అథారిటీ అధికారులు భావించారు. మే నెలలో ఆలయ పున:ప్రారంభం ఉండొచ్చని అంతా భావించారు. అది కూడా వాయిదా పడింది. కరోనా కూడా యాదాద్రి ఆలయ పునః ప్రారంభానికి కొంతవరకు ఆటంకం కలిగించింది. 

యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నలుదిక్కులా విశాలమైన మాఢవీధులు, సప్త గోపురాలు, అంతర్ బాహ్య ప్రాకారాలు, ఆల్వార్ల విగ్రహాలతో కాకతీయ సంప్రదాయ పద్దతిలో.. కృష్ణశిలా శిల్ప సౌరభం ఉట్టిపడేలా పనులు జరిగాయి. శివాలయం కూడా సిద్ధమైంది. కొండపైన పుష్కరిణి కూడా పూర్తి స్థాయిలో తయారైంది. కొండ కింద భక్తుల సౌకర్యార్థం మరో పుష్కరిణి పనులు దాదాపు పూర్తి అయ్యాయి. మెట్లు, ఇతర నిర్మాణల పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రెసిడెన్షియల్ కాటేజీ సహా వీఐపీ కాటేజీల నిర్మాణం కూడా పూర్తైంది. సామాన్యులకు 15 కాటేజీల అన్ని పనులు పూర్తయ్యాయి. మరో వారం రోజుల్లో అంతా రెడీ అవుతుందని యాదాద్రి డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కిషన్ రావు చెబుతున్నారు. కళ్యాణకట్ట కొద్దిరోజుల్లో సిద్ధం అవుతుందని.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒకే దగ్గర 2 వేల వాహనాలకు పార్కింగ్ ఏర్పాటు చేశారు.   

యాదాద్రిలో నిర్వహించే మహాసుదర్శన యాగానికి ప్రధాని మోడీతో పాటు.. పలు రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లను ఆహ్వానించాలని ఇప్పటికే నిర్ణయించారు సీఎం కేసీఆర్. ఇటీవల ఢిల్లీ పర్యటనలో.. ఆలయ ప్రారంభానికి రావాలని ప్రధాని మోడీని పిలిచారు ముఖ్యమంత్రి.