గంజాయిని నిరోధించడానికి ప్రత్యేక సెల్

గంజాయిని నిరోధించడానికి ప్రత్యేక సెల్
  • రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దాలి

రాష్ట్రంలో గంజాయి అక్రమ సాగు, వినియోగాన్ని అరికట్టాలని పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. గంజాయి మాఫియాను అణిచివేయాలని, నేరస్థులు ఎంతటివారైనా శిక్షించాలన్నారు. గంజాయిని నిరోధించడానికి డిజీ స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించి ఒక ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేయాలన్నారు. ఇవాళ(బుధవారం) క్యాంప్ ఆఫీస్ లో పోలీస్,ఎక్సైజ్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు సీఎం కేసీఆర్. గంజాయి ఉత్పత్తిని సమూలంగా నిర్మూలించడానికి సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్, ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌ను బలోపేతం చేయాలన్నారు సీఎం కేసీఆర్. మన విజయాలపై గంజాయి ప్రభావం చూపే ప్రమాదముందన్నారు. ఎంతో ఆవేదనతో ఉన్నతస్థాయి భేటీ ఏర్పాటు చేశామన్నారు. గంజాయి కోసం వాట్సాప్‌ మెసేజ్ లు పంపుకొంటున్నారని... గంజాయి మెసేజ్ ల దృష్ట్యా పరిస్థితి తీవ్రత అర్థమవుతోందన్నారు. అమాయక యువత గంజాయి బారిన పడుతున్నారని... గంజాయి ప్రభావంతో ఆత్మహత్యకు పాల్పడే ప్రమాదం ఉందన్నారు. గంజాయి మాఫియాను అణచివేయాలని... గంజాయి నేరస్థులు ఎంతటివారైనా ఉపేక్షించొద్దన్నారు. అంతేకాదు.. విద్యా సంస్థల దగ్గర ప్రత్యేక నిఘా పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సరిహద్దుల్లో చెక్‌పోస్టుల సంఖ్య పెంచాలని... నిఘావిభాగంలో మాదకద్రవ్యాలపై ప్రత్యేక విభాగం పెట్టాలన్నాఉ. గంజాయి కట్టడి చేసిన అధికారులకు ప్రోత్సాహకాలు ఇస్తామని... అధికారులకు నగదు బహుమతులు, ప్రత్యేక పదోన్నతులు కల్పిస్తామన్నారు. గుడుంబా, గ్యాంబ్లింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని... రాష్ట్రంలో పేకాటదందా ఆగిపోయేలా చర్యలు తీసుకోవాలని  సీఎం కేసీఆర్‌ అధికారులకు సూచించారు.