దసరా రోజే చార్టర్డ్‌‌ ఫ్లైట్‌‌కు కేసీఆర్‌‌ పూజలు..!

దసరా రోజే చార్టర్డ్‌‌ ఫ్లైట్‌‌కు కేసీఆర్‌‌ పూజలు..!

హైదరాబాద్‌, వెలుగు:  జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తున్న సీఎం కేసీఆర్‌.. దేశమంతటా తిరిగేందుకు ఫ్లైట్‌, రాష్ట్రంలో పర్యటనలకు హెలికాప్టర్ కొనుగోలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజాప్రతినిధులుగా ఉన్న వ్యాపారవేత్తలు ఇచ్చిన విరాళాలతో వీటిని కొనుగోలు చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఫ్లైట్‌ కొనుగోలుకు సంబంధించిన ప్రక్రియ పూర్తయిందని, ఒకటి రెండు రోజుల్లో సంబంధిత సంస్థ దాన్ని డెలివరీ చేస్తుందని సమాచారం. 

దసరా రోజే చార్టర్డ్‌‌ ఫ్లైట్‌‌కు కేసీఆర్‌‌ పూజలు చేస్తారని టీఆర్‌‌ఎస్‌‌ వర్గాలు చెప్తున్నాయి. టీఆర్‌‌ఎస్‌‌ పార్టీ ఖాతాలో రూ.845 కోట్ల నిధులు ఉన్నాయి. అందులోంచి కొంత ఖర్చు చేసి చార్టర్డ్‌‌ ఫ్లైట్‌‌ కొనాలని కేసీఆర్ మొదట్లో భావించారని, ఈ విషయాన్ని తనకు సన్నిహితంగా ఉండే నేతల దగ్గర ప్రస్తావించడంతో తమ వ్యాపార సంస్థల నుంచి పార్టీకి విరాళంగా రూ.10 కోట్ల చొప్పున ఇచ్చేందుకు వాళ్లు ముందుకు వచ్చారని తెలిసింది. ఫ్లైట్‌‌ కొనుగోలు కోసం ముగ్గురు రాజ్యసభ సభ్యులు, ఇద్దరు లోక్‌‌సభ ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక మంత్రి, ఒక ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యుడు భాగస్వామిగా ఉన్న వ్యాపార అసోసియేషన్‌‌, పార్లమెంట్‌‌ ఎన్నికల్లో ఓడిన టీఆర్‌‌ఎస్‌‌ నేత ఒకరు విరాళాలు ఇచ్చినట్టు తెలిసింది. 

ఇందులోంచి రూ.82 కోట్లు ఖర్చు చేసి 12 సీట్ల కెపాసిటీ ఉన్న చార్టర్డ్‌‌ ఫ్లైట్‌‌ను కొనుగోలు చేసినట్టు సమాచారం. మిగిలిన మొత్తానికి మరిన్ని  విరాళాలు ఇచ్చేందుకు పలువురు లీడర్లు ముందుకు రావడంతో వాటితో హెలికాప్టర్ కొనుగోలు చేయబోతున్నట్టు తెలిసింది. ప్రభుత్వ ఖర్చులతో అద్దెకు తీసుకున్న ప్రైవేట్‌‌ విమానంలోనే రాష్ట్రాల పర్యటనలకు కేసీఆర్ వెళ్తున్నారు. రాష్ట్రంలోనూ ప్రభుత్వ నిధులతో అద్దెకు తీసుకున్న హెలికాప్టర్‌‌లో పర్యటిస్తున్నారు. ప్రభుత్వ నిధులతో రాజకీయాలు చేస్తున్నారనే విమర్శల నుంచి తప్పించుకోవడానికే కేసీఆర్‌‌ విమానం, హెలికాప్టర్ కొనుగోలు చేస్తున్నట్టు టీఆర్‌‌ఎస్‌‌ నేతలు చెప్తున్నారు.