తెలంగాణ బీజేపీ అడ్డా అని చాటి చెబుదాం : ​బండి సంజయ్​

తెలంగాణ బీజేపీ అడ్డా అని చాటి చెబుదాం :  ​బండి సంజయ్​
  • తెలంగాణలో ముందస్తు ఎన్నికలొచ్చే చాన్స్​
  • 15న లక్షలాది మందితో కరీంనగర్ సభను సక్సెస్​చేద్దాం
  • తెలంగాణ బీజేపీ అడ్డా అని చాటి చెబుదాం : బీజేపీ చీఫ్ ​బండి సంజయ్​

మెట్ పల్లి, వెలుగు: తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళతారనే సంకేతాలొస్తున్నాయని, ఈ క్రమంలో 5 వ విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. శుక్రవారం ఉదయం జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం వేంపేట  సమీపంలోని ప్రజా సంగ్రామ యాత్ర శిబిరం వద్ద కరీంనగర్ జిల్లా ముఖ్య నేతలతో బండి సంజయ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత బలోపేతం, పోలింగ్ బూత్ ల ఏర్పాటుతోపాటు ఈనెల 15 న కరీంనగర్ లో నిర్వహించబోయే బహిరంగ సభ ఏర్పాట్లు, జన సమీరణ, సభ సక్సెస్ కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.

అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణలో అధికారమే లక్ష్యంగా గతేడాది ఆగస్టు నుంచి ఇప్పటి వరకు 14 భారీ బహిరంగ సభలు నిర్వహించామన్నారు. దేశంలోని  బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇన్ని బహిరంగ సభలు నిర్వహించలేదన్నారు. ఈ నెల 15న జరిగే బహిరంగ సభను లక్షలాది మందిని సమీకరించి సభను సక్సెస్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సభకు చీఫ్​గెస్ట్​గా  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారని ఈ సభ సక్సెస్ ద్వారా తెలంగాణ బీజేపీకి అడ్డా అని నిరూపించుకుందామన్నారు. ఈ సభ ద్వారా తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కారు అనే సంకేతాలను ప్రజల్లోకి  తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో పాదయాత్ర ప్రముఖ్ జి.మనోహర్ రెడ్డి, జిల్లా ఇన్​చార్జి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, జిల్లా అధ్యక్షుడు జి.కృష్ణారెడ్డి  మండలాధ్యక్షులు, జిల్లా పదాధికారులు పాల్గొన్నారు.

బీజేపీలోకి ఎన్ఆర్ఐ స్మితారెడ్డి

మెట్ పల్లి, వెలుగు:  రంగారెడ్డి జిల్లా తుక్కుగూడకు చెందిన ఎన్ఆర్ఐ, అరోహ్ లిమిటెడ్ ఐటీ, సూపర్ మార్కెట్ వ్యాపార నిర్వాహకురాలు బోదనపల్లి స్మితారెడ్డి బీజేపీలో చేరారు. శుక్రవారం స్మితారెడ్డి  బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి, అధికార ప్రతినిధి టి.వీరేందర్ గౌడ్ లతో కలిసి మెట్​పల్లిలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బండి సంజయ్  స్మితారెడ్డికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.  

సమస్యలపై బండికి వినతులు 

కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ త్వరగా చేపట్టేలా కృషి చేయాలని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ కు దళిత సమైక్య ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షుడుఎ డాక్టర్ పులింటి స్వామి కుమార్ కోరారు. శుక్రవారం ప్రజా సంగ్రామ యాత్ర లో పాల్గొన్న బండి సంజయ్ ను కలిసి మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ తో కలిసి వినతిప్రత్రం అందజేశారు. అనంతరం మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని, పసుపునకు రూ.15 వేలు మద్దతు ధర కల్పించేలా కృషి చేయాలని రైతు జేఏసీ నాయకులు బద్దం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బండి సంజయ్ కు వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన బండి సంజయ్ రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు రైతు సంఘ నాయకులు పాల్గొన్నారు.