కంటి వెలుగుకూ పంచాయతీ నిధులే

కంటి వెలుగుకూ పంచాయతీ నిధులే

ఫండ్స్​ అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సర్పంచులకు.. కంటి వెలుగు రూపంలో మరో  సమస్య వచ్చి పడింది. క్యాంపుల ఏర్పాటుకు అయ్యే ఖర్చును జీపీలే భరించాలని చెబుతోంది.

జీవోలో పీఆర్ శాఖ మెలిక

హైదరాబాద్​, వెలుగు: అభివృద్ధి పనులకు ఫండ్స్​రాక, చేసిన వాటికి బిల్లులు విడుదల కాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సర్పంచులకు.. కంటి వెలుగు రూపంలో మరో సమస్య వచ్చి పడింది. జనవరి 18 నుంచి రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్​ మొదలుపెట్టనున్నారు. ఆ కార్యక్రమ ఏర్పాట్లకు సంబంధించిన బాధ్యతలను డీపీవోలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు అప్పగిస్తూ శుక్రవారం పంచాయతీరాజ్​శాఖ ఉత్తర్వులిచ్చింది. వాటికయ్యే ఖర్చు జీపీ నిధుల నుంచే వాడాలని జీవోలో మెలిక పెట్టింది. 

ఇప్పటికే అప్పుల పాలై ఆత్మహత్యలు

సీఎం కేసీఆర్​పిలుపు మేరకు చాలా మంది సర్పంచులు అప్పులు తెచ్చి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వం మాత్రం ఆ నిధులను ఇచ్చిందీ లేదు. దీంతో కొంత మంది సర్పంచులు ఆ అప్పులు తీర్చలేక సూసైడ్​ చేసుకున్నారు. పంచాయతీ నిధులు కార్మికుల జీతాలకే చాలడం లేదు. చెత్తను తీసుకెళ్లే ట్రాక్టర్లలో డీజిల్​కు సర్పంచులే డబ్బులు పెట్టి పోయించాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కంటి వెలుగు ఏర్పాట్లకు ఖర్చులు తామే పెట్టాలంటే మరింత అప్పులపాలవుతామని  సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

కంటి వెలుగుకు ఏర్పాట్లు చేయాల్సిందే..

కంటి వెలుగు కార్యక్రమం కోసం అన్ని గ్రామాల్లో ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారులను పంచాయతీ రాజ్​ శాఖ ఇన్​చార్జి కార్యదర్శి ఎం. రఘునందన్​రావు శుక్రవారం ఆదేశించారు. డీఎంహెచ్​వో, పీహెచ్​సీ మెడికల్​ఆఫీసర్లు సమన్వయం చేసుకొని క్యాంపుల ఏర్పాటు, సౌలతులు కల్పించేలా పంచాయతీ సెక్రటరీలకు డీపీవోలు సూచనలివ్వాలన్నారు.