ఈడీ కస్టడీ నుంచి సీఎం కేజ్రీవాల్ డ్యూటీ

ఈడీ కస్టడీ నుంచి సీఎం కేజ్రీవాల్ డ్యూటీ
  • ఢిల్లీలో నీటి కొరత లేకుండా చూడాలని చెప్పారన్న ఆతిశీ
  • కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా 31న ఇండియా కూటమి మెగా ర్యాలీ

న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్​లో అరెస్టయిన ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ నుంచే పాలన కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న ఆయన.. అక్కడి నుంచే ఢిల్లీ పాలన వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఢిల్లీలో నీటి సమస్యకు సంబంధించి ఆదివారం కస్టడీ నుంచే తొలి ఆర్డర్ జారీ చేశారు. ప్రజలకు నీటి కొరత లేకుండా చూడాలని తనకు సీఎం లేఖ రాశారని జల వనరులశాఖ మంత్రి ఆతిశీ వెల్లడించారు. ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత, డ్రైనేజీ సమస్యలు ఉన్నట్టు నా దృష్టికి వచ్చింది.

 దానిపై నేను ఆందోళన చెందుతున్నాను. నేను జైలులో ఉన్నప్పటికీ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా సప్లై చేయండి. ఈమేరకు చీఫ్ సెక్రటరీ, ఇతర అధికారులకు ఆదేశాలు ఇవ్వండి. అవసరమైతే లెఫ్టినెంట్ గవర్నర్ సాయం తీసుకోండి’ అని లేఖలో కేజ్రీవాల్ పేర్కొన్నారని చెప్పారు. ‘‘కేజ్రీవాల్ రాసిన లెటర్ చదువుతుంటే నాకు కన్నీళ్లు ఆగలేదు. జైలులో ఉన్నప్పటికీ ఆయన ఢిల్లీ ప్రజల గురించే ఆలోచిస్తున్నారు. కేవలం కేజ్రీవాల్ మాత్రమే ఇలా చేయగలరు.. ఎందుకంటే ఆయన ఢిల్లీలోని 2 కోట్ల మంది ప్రజలను తన కుటుంబసభ్యులుగా భావిస్తున్నారు. బీజేపీ కేజ్రీవాల్ ను అరెస్టు చేసి జైల్లో పెట్టగలదు.. కానీ ఢిల్లీ ప్రజలకు సేవ చేయకుండా అడ్డుకోలేదు” అని అన్నారు.

ఆప్, బీజేపీ నిరసనలు.. 

కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఆప్ కార్యకర్తలు ఆదివారం నిరసన తెలిపారు. ఐదారుగురు కార్యకర్తలు ఓ ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఎక్కి ఆందోళన చేశారు. ప్లకార్డులు పట్టుకుని కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని, వారిని పంపించివేశారు. మరోవైపు, కేజ్రీవాల్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఢిల్లీ ప్రెసిడెంట్ వీరేంద్ర సచ్ దేవా ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు ఆందోళన చేశారు. కేజ్రీవాల్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కాగా, కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా మెగా ర్యాలీ నిర్వహించాలని ప్రతిపక్ష ఇండియా కూటమి నిర్ణయించింది. ఈ నెల 31న ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో మెగా ర్యాలీ నిర్వహించనున్నట్టు ప్రకటించింది.

కంప్యూటరే ఇవ్వలే లెటర్ ఎక్కడిది?: ఈడీ

ఈడీ కస్టడీలో ఉన్న సీఎం కేజ్రీవాల్ పంపించాడంటూ ఢిల్లీ మంత్రి ఆతిశీ మీడియాకు చూపించిన లెటర్​ తాజాగా వివాదాస్పదంగా మారింది. కస్టడీలో ఉన్న కేజ్రీవాల్​కు తాము కంప్యూటర్ కానీ, ప్రింటర్ కానీ.. కనీసం పేపర్ కూడా ఇవ్వలేదని ఈడీ అధికారులు చెప్పారు. మరి ఆతిశీకి పంపిన లెటర్ ఎలా వచ్చిందనే దానిపై విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు. శనివారం సాయంత్రం కేజ్రీవాల్​ను ఆయన భార్య సునీత కలిసిందని, ఆమె వద్ద పలు పేపర్లు చూశామని అధికారులు చెబుతున్నారు. కాగా, ఈడీ కస్టడీ నుంచి కేజ్రీవాల్​తొలి ఆదేశాలు అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నాటకం ఆడిందని బీజేపీ ఢిల్లీ నేతలు విమర్శించారు.