అమిత్ షాను నమ్మకండి.. ఆయన డేంజర్: ప్రధాని మోడీకి మమతా బెనర్జీ హెచ్చరిక

అమిత్ షాను నమ్మకండి.. ఆయన డేంజర్: ప్రధాని మోడీకి మమతా బెనర్జీ హెచ్చరిక

కోల్‎కతా: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా యాక్టింగ్ ప్రధానిలా వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా ప్రమాదకరమైన వ్యక్తి అని.. ప్రధాని మోడీ ఆయనను నమ్మొద్దని సూచించారు. ప్లాసీ యుద్ధంలో బెంగాల్ నవాబ్ సిరాజ్ ఉద్-దౌలాను వెన్నుపోటు పొడిచిన బెంగాల్ సైనిక జనరల్ మీర్ జాఫర్‌ లాంటి వ్యక్తి అమిత్ షా అని అభివర్ణించారు. మోడీ ఇప్పటికైనా మేల్కొవాలని.. లేదంటే ఏదో రోజు ఆయన అమిత్ షా చేతిలో మోసపోవడం ఖాయమని హెచ్చరించారు.

ఎన్నికల సంఘం బీజేపీ చేతిలో కీలు బొమ్మలా మారిపోయిందని.. ఆ పార్టీ ఆదేశాల మేరకు ఈసీ పని చేస్తోందని ఆరోపించారు. అమిత్ షా ఆదేశాల మేరకే ఈసీ బెంగాల్‎లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ చేపట్టిందని ఆరోపించారు. బెంగాల్ ఓటర్ల జాబితా నుంచి లక్షలాది పేర్లను తొలగిస్తానని చెప్పడానికే అమిత్ షా బెంగాల్ వస్తున్నారని అన్నారు. వరద సహయం విషయంలో కేంద్ర ప్రభుత్వం బెంగాల్‎పై పక్షపాతం చూపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రమే సహయం చేస్తుందని.. మిగిలిన రాష్ట్రాలను విస్మరిస్తోందని మండిపడ్డారు.