
- కేటీఆర్ మా ఇంటికొచ్చి కాళ్లావేళ్లా పడ్డడు.. సీసీ ఫుటేజీ ఉంది
- బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ సంచలన వ్యాఖ్యలు
- అవినీతి బయటకు రానీయొద్దని, కవితను జైలు నుంచి బయటకు తేవాలని రిక్వెస్ట్ చేసిండు
- విలీనం కోసం అమిత్ షాతో మాట్లాడాలని వేడుకున్నడు
- బీఆర్ఎస్ పతనమైన పార్టీ అని, విలీనం వద్దని మా అగ్రనేతలు చెప్పారు
- విలీనం కుదరకపోవడంతో నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నడు
- బీఆర్ఎస్ హయాంలో లక్షల కోట్ల కాంట్రాక్టులు ఎవరికి ఇచ్చారో బయటపెడ్త
- నాపై చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమా?
- తెలంగాణ భవన్, ప్రెస్‌క్లబ్ ఎక్కడికైనా వస్తానని సవాల్
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ అవినీతి బయటకు రాకుండా చూస్తే, కవితను లిక్కర్ కేసు నుంచి బయటకు తెస్తే బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేస్తామని కేటీఆర్ తన ఇంటికి వచ్చి వేడుకున్నారని బీజేపీ ఎంపీ
సీఎం రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సాక్ష్యంగా తన ఇంటి సీసీ కెమెరాల్లో ఫుటేజీ ఉందని వెల్లడించారు. ‘‘కేటీఆర్..! మీ చెల్లె జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీలో మా ఇంటికి వచ్చింది నిజం కాదా? వచ్చి ఏం చెప్పినవో మరిచిపోయావా? మీ(బీఆర్ఎస్) ప్రభుత్వ హయాంలోని అవినీతి బయటకు రాకుండా చూడాలని.. సీబీఐ, ఈడీ దాడులు చేయొద్దని.. కవితను జైలు నుంచి బయటకు తేవాలని.. ఇందుకోసం బీజేపీలో చేరుతామని కాళ్లా వేళ్లా పడ్డది వాస్తవం కాదా? అదంతా మా ఇంట్లో సీసీటీవీ ఫుటేజీ లో రికార్డయింది.
అది ఇప్పటికీ నా దగ్గర ఉంది. బయటకు తీయమంటావా? ’’ అని ప్రశ్నించారు. ‘‘బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసేందుకు అమిత్ షా సహా పార్టీ పెద్దలతో మాట్లాడాలని నాతో కేటీఆర్ రిక్వెస్ట్ చేశాడు. నేను బీజేపీ పెద్దలతో మాట్లాడాను.. కానీ, బీఆర్ఎస్ పతనమైన పార్టీ అని, అదో అవినీతి పార్టీ అని, దానితో కలిసేదేలేదని వాళ్లు తెగేసి చెప్పారు. ఇదే విషయం కేటీఆర్‌కు చెప్పాను. అది మనసులో పెట్టుకొని ఇప్పుడు నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఏపీ అనకాపల్లిలోని తన ఆఫీసులో రమేశ్ మీడియాతో మాట్లాడారు. హెచ్‌సీయూ భూముల విషయంలో రూ.10 వేల కోట్ల లోన్‌ను రేవంత్ సర్కారుకు ఎంపీ సీఎం రమేశ్ ఇప్పించారని, ఇందుకు ప్రతిఫలంగా రమేశ్‌కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్కు ఫ్యూచర్‌సిటీలో రూ.1,660 కోట్ల విలువైన రోడ్ వర్క్‌ను రేవంత్ ఇచ్చారంటూ శుక్రవారం కేటీఆర్ ఆరోపణలు చేశారు. దీనికి ఎంపీ సీఎం రమేశ్ కౌంటర్ ఇచ్చారు.
మంత్రిగా చేశావు కదా.. నామ్స్ తెలియని అజ్ఞానివా?
‘‘తెలంగాణకు లోన్ ఇప్పిస్తే దానికి ప్రతిఫలంగా హైదరాబాద్‌లో మా కంపెనీకి రూ.1,660 కోట్ల వర్క్ ఇచ్చినట్లు కేటీఆర్ ఆరోపణలు చేశాడు. ఆయనను నేను అడుగుతున్న! పదేండ్లు ప్రభుత్వంలోనే ఉన్నావు కదా.. మంత్రిగా కూడా చేశావు కదా!! రూ.5 లక్షలకు మించిన వర్క్‌ను నామినేషన్ లో ఇస్తారా? ఇవ్వరా? ఈ నామ్స్ కూడా తెలియని అజ్ఞానివా?’’ అని ఎంపీ సీఎం రమేశ్ ఫైర్ అయ్యారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డిపై, నాపై కేటీఆర్ ఎందుకు బురదజల్లాలని చూస్తున్నారని ఆలోచిస్తే ఒక్కటే కారణం కనిపిస్తున్నది. కేటీఆర్ ఇంట్లో కుంపటి తయారైంది. ఏపీలో జగన్మోహన్ రెడ్డికి వాళ్ల సిస్టర్‌తో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో కేటీఆర్‌కు కూడా అలాంటి ఇబ్బందులే ఉన్నాయి. ఈ ఇష్యూను డైవర్ట్ చేయడానికి నాపై, రేవంత్‌రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నాడు’’ అని మండిపడ్డారు.
‘‘సీఎం రమేశ్‌కు రూ.1,660 కోట్లు వర్క్స్ ఇచ్చారని కేటీఆర్ ఆరోపణ చేయగానే నేను ఆ కాంట్రాక్ట్ డీటెయిల్స్ అన్నీ తెప్పించా. రోడ్ల టెండర్ జరిగితే దాదాపు ఐదారు ఏజెన్సీలు కోట్ చేశాయి. ఇందులో రిత్విక్ ప్రాజెక్ట్స్, మేఘా ఇంజినీరింగ్, ఎల్అండ్ టీ, రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇంకా ఒకటీ రెండు కంపెనీలు ఉన్నాయి. రెండు కాంట్రాక్టుల్లో ఒకటి ఎల్అండ్ టీకి, ఒకటి రిత్విక్కి ఎల్‌వన్ అయ్యాయి. ఇది పూర్తయి కూడా దాదాపు మూడు నెలలు అయింది’’ అని చెప్పారు. కాగా, రిత్విక్ ప్రాజెక్ట్స్‌లో తాను డైరెక్టర్‌ను కూడా కాదని, మేనేజ్మెంట్లో కూడా లేనని ఆయన చెప్పారు. ‘‘ఫ్యూచర్ సిటీలో రోడ్డు కాంట్రాక్ట్‌ను ఆంధ్రా బీజేపీ ఎంపీకి ఇచ్చారని, తెలంగాణ తెచ్చుకున్నది ఇందుకేనా అని కేటీఆర్ మాట్లాడాడు. ఆయన నేను అడిగే దానికి సమాధానం చెప్పాలి.
పదేండ్లు మీరు(కేటీఆర్) ప్రభుత్వంలో ఉన్నారు. అప్పట్లో అన్ని డిపా ర్ట్మెంట్లలో కలిపి ఆరేడు లక్షల కోట్ల వర్క్స్జరిగాయి. ఒక్క కాళేశ్వరానికే రూ. లక్ష కోట్లు ఖర్చు చేశారు. అలాంటివి ఎన్నో వర్క్స్ చేశారు. ప్రభుత్వం నామినేషన్ పై రూ.5 లక్షలకు మించి వర్క్ ఇవ్వడానికి లేదు. మరి మీ(బీఆర్ఎస్) ప్రభుత్వం ఆ వర్క్స్ అన్నీ ఎవరికి ఇచ్చింది? నాకు సీఎం రేవంత్ రెడ్డి స్నేహితుడని, అందుకే వర్క్ ఇచ్చారని కేటీఆర్ చెబుతున్నాడు. సీఎం ఒక కంపెనీకి రూ.1,660 కోట్ల విలువైన వర్క్ నామినేషన్పైఇవ్వగలరా ?
పదేండ్లు ప్రభుత్వంలో ఉన్న మీకు(కేటీఆర్) ఈ విషయం తెలియదా? మీ ప్రభుత్వంలో మీరు ఇలాగే చేశారా? లిస్ట్ తీద్దామా? ’’ అని కేటీఆర్‌ను నిలదీశారు. ‘‘బీఆర్ఎస్ హయాంలో ఆరేడు లక్షల కోట్ల వర్క్స్ జరిగినందున ఆ పనులు ఎవరికి ఇచ్చారు? తెలంగాణవారికి ఇచ్చారా? ఆం ధ్రా వాళ్లకు ఇచ్చారా? చర్చించేందుకు నేను సిద్ధం. హైదరాబాద్‌లో ప్రెస్‌క్లబ్‌లోనైనా, తెలంగాణ భవన్కైనా.. ఎక్కడికి పిలిచినా వస్తా. కేటీఆర్ నువ్వు సిద్ధ మా?’’ అని ఎంపీ సీఎం రమేశ్ సవాల్‌విసిరారు.
ఎట్ల ఎమ్మెల్యే అయినవో మరిచిపోయినవా?
తెలంగాణలో మళ్లీ ఎక్కడ బీజేపీ, టీడీపీ అలయన్స్ పెట్టుకుంటాయోనన్న ఆలోచనతో బీఆర్ఎస్కు పుట్టగతులుండవన్న భయంతో కేటీఆర్ తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ ఏపీ ఎంపీ సీఎం రమేశ్ ఫైర్అయ్యారు. ‘‘కేటీఆర్‌కు భయం పట్టుకుంది. అందుకే కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యాయంటున్నారు. కాంగ్రెస్ , బీజేపీ ఏకమయ్యాయంటే దేశంలో ఎవరైనా నమ్ముతారా? కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా పుట్టిన పార్టీనే బీజేపీ. బీజేపీని గద్దె దించాలనే రాహుల్ గాంధీ ఇండియా కూటమిని ఏర్పాటు చేశారు.
అలాంటి బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటై బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు వర్క్ ఇచ్చారని కేటీఆర్ మాట్లాడడం ఆయన అజ్ఞానానికి నిదర్శనం’’ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ గర్నమెంట్ లోన్ తెచ్చుకుంటే తనకేం సంబంధమని ప్రశ్నించారు. ‘‘రాజకీయంగా నువ్వు ఏ విధంగా ఎమ్మెల్యే అయ్యావో తెలుసా? అప్పుడు ఉమ్మడి ఏపీలో టీడీపీతో మీ పార్టీ పొత్తు పెట్టుకున్నప్పుడు నువ్వు 300 ఓట్ల మెజార్టీతో ఎట్ల గెలిచావో తెలుసా? నేను నీకు చేసిన మేలు మరిచిపోయావా?” అని కేటీఆర్‌ను ఎంపీ సీఎం రమేశ్ ప్రశ్నించారు.
కమ్మ, రెడ్డీలను నోటికొచ్చినట్లు తిట్టాడు
కమ్మ, రెడ్డి సామాజికవర్గంపై కేటీఆర్ ఇష్టమున్నట్లు మాట్లాడారని ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. ‘‘తుమ్మల నాగేశ్వరరావు లాంటి నాయకుడిని మీ పార్టీ ఎందుకు వదిలేసుకుందని నేను అడిగితే.. చంద్రబాబు నాయుడు కమ్మ అని, మా పార్టీకి ఇక కమ్మోళ్లు అవసరం లేదని తిట్టావ్. రెడ్లను నమ్మితే గవర్నమెంట్ పోయిన మరుసటి రోజే పోయారని వారినీ తిట్టావ్. కొంచెం నోరు అదుపులో పెట్టుకోమని ఆరోజే నీకు నేను చెప్పాను. కానీ నువ్వు వినలేదు.
రేవంత్ రెడ్డిని చూసి రెడ్లు పోయారు.. చంద్రబాబు నాయుడిని చూసి కమ్మలు పోయారు.. మాకు మిగిలింది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అని నువ్వు నాతో అన్నది నిజం కాదా? ఏపీలో జగన్మోహన్ రెడ్డితోనే కలిసి ప్రయాణం చేస్తున్నట్లు నువ్వు నాతో చెప్పావా, లేదా?” అని కేటీఆర్‌ను నిలదీశారు. ‘‘అసలు కేటీఆర్ నువ్వు మాట్లాడే లాంగ్వేజ్ ఏంటి? నీ బిహేవియర్ ఏంటి?’’ అని మండిపడ్డారు. రాజకీయాల్లో లాంగ్ టర్మ్ ఉండాలకుంటే ఇకనైనా మాటతీరు మార్చుకోవాలన్నారు.