హైదరాబాద్ టు బెంగళూరు వెళ్తూ ఘోర ప్రమాదానికి గురైన బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. తెలంగాణకు చెందిన మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అదే విధంగా ప్రమాదంలో గాయపడిన వారికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు.
ప్రమాదంలో గాయపడిన వారికి పూర్తిగా చికిత్స అందించే బాధ్యత తీసుకుంటామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ తెలిపారు. బస్సు ప్రమాదంలో మొత్తం 19 మంది మృతి చెందగా వారిలో ఆరు మంది తెలంగాణ వాసులుగా గుర్తించారు.
ప్రమాదంపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన సీఎం.. ఘటనా స్థలానికి వెళ్లి సమీక్షించాల్సిందిగా గద్వాల జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బాధిత కుటుంబాలకు సహాయం అందించేందుకు హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది ప్రభుత్వం.
రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన పీఎం మోదీ:
బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అదే విధంగా గాయపడిన వారికి రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. మరోవైపు మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
హెల్ప్ లైన్ నెంబర్లు, సంప్రదించాల్సిన అధికారుల వివరాలు:
9912919545 ఎం.శ్రీ రామచంద్ర, అసిస్టెంట్ సెక్రటరీ
9440854433 ఈ.చిట్టి బాబు,సెక్షన్ ఆఫీసర్
బాధితుల కోసం రెండు హెల్ప్ లైన్ నెంబర్లు
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు ఏపీ కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. శుక్రవారం (అక్టోబర్ 24) తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో బస్సు మంటల్లో దగ్ధమైపోయింది. కల్లూరు మండలం చిన్న టేకూరు సమీపంలో ప్రమాదానికి గురైంది.
తెల్లవారు జామున 3.30 గంటల ప్రాంతంలో ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 41 మంది ప్రయాణికులు ఉన్నారు. 21 మందికి పైగా మృతి చెందగా మరో మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు , అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
