హైదరాబాద్లో GMR ఎయిర్పార్క్ సెజ్ను వర్చువల్గా ప్రారంభించారు ప్రధాని మోదీ. బుధవారం (నవంబర్ 26) GMR ఎయిర్ పార్క్ సెజ్ లో సఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ను ప్రారంభించారు. ఏవియేషన్ ఇంజిన్స్ మెయింటెనెన్స్, రిపైర్ (MRO) చేసే ఈ కంపెనీ ప్రారంభంతో.. దేశంలో తొలిసారి హైదరాబాద్ లో MRO ఫెసిలిటీ ఏర్పాటు చేయడం శుభపరిణామం అని ఈ సందర్భంగా అన్నారు మోదీ. విదేశాలపై ఆధారపడకుండా, స్థానికంగా ఏర్పాటు చేసుకోవడం వలన ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్ మోహన్ నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్.. హైదరాబాద్ - బెంగళూరును డిఫెన్స్ కారిడార్గా ప్రకటించాలని అన్నారు. సెజ్లో రాఫెల్ విమాన విడి భాగాలు తయారు చేసే యూనిట్ ప్రారంభించడం శుభపరిణామం అని అన్నారు. కొత్త ఎంఆర్ఓ యూనిట్లో ఎం88 ఇంజిన్ తయారీ చేసే ఫెసిలిటీ ఉంటుంది. నేవీ, ఎయిర్ఫోర్స్కు ఈ యూనిట్ ఉపయోగపడుతుందని అన్నారు సీఎం.
హైదరాబాద్ లో 25 డిఫెన్స్ కంపెనీలు ఉన్నాయన్న సీఎం.. హైదరాబాద్ లో భారీగా MRO సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏవియేషన్ రంగానికి కావాల్సిన నిపుణులు హైదరాబాద్ లో ఉన్నారని అన్నారు. హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టిన సఫ్రాన్ కంపెనీకి కృతజ్ఞతలు తెలిపారు. డిసెంబర్ 8,9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ డాక్యుమెట్ రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.
