
హైదరాబాద్: తెలంగాణలో గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రతిపాదిత పాలసీపై సీఎం రేవంత్ రెడ్డి సోమవారం (జూలై 21) ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. గిగ్ వర్కర్లకు ప్రత్యేకంగా ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని, వారికి ప్రమాద బీమా, ఆరోగ్య బీమా సౌకర్యాలను కల్పించే విధంగా పాలసీ ఉండాలని అధికారులకు సూచించారు.
ప్రతిపాదిత పాలసీపై సీఎం రేవంత్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. పాలసీ గురించి అధికారులు సీఎంకు వివరించగా.. అనంతరం రేవంత్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. గిగ్ వర్కర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు ఆ బోర్డుకు ప్రభుత్వ ప్రాతినిథ్యం వహించేలా ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. గిగ్ కార్మికులకు సంబంధించిన పూర్తి డేటా ఆన్ లైన్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.