తెలుగు రాష్ట్రాల నుంచి పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన వారికి సీఎం రేవంత్ అభినందనలు తెలిపారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి పర్యటన ముగించుకుని రాష్ట్రానికి తిరిగివచ్చిన అనంతరం పద్మ పురస్కారాలకు ఎంపికైన ప్రముఖులను ఘనంగా సన్మానించనున్నట్లు తెలిపారు.
రిపబ్లిక్ డే సందర్భంగా ఒక రోజు ముందు జనవరి 25న కేంద్రం పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఎంపికైన వారిలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణులు నోరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్ పురస్కారం లభించింది. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగం నుంచి గడ్డమణుగు చంద్ర మౌళి, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్ , కుమారస్వామి తంగరాజ్ , వైద్య రంగంలో గూడూరు వెంకట్ రావు , పాల్కొండ విజయానంద్ రెడ్డి , పశుసంవర్ధక రంగంలో మామిడి రామా రెడ్డి , విద్యా–సాహిత్య రంగాల నుంచి మామిడాల జగదీశ్ కుమార్ , వెంపటి శశిశేఖర్ , వెంపటి కుటుంబ శాస్త్రి , కళా రంగం నుంచి దీపికా రెడ్డి , మురళీ మోహన్ , రాజేంద్ర ప్రసాద్ , గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ లకు పద్మశ్రీ పురస్కారాలు దక్కినందుకు ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు.
సేవా, కళా తదితర రంగాల్లో వారు అందించిన విశిష్ట సేవలు, అంకితభావాన్ని గుర్తించి ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలకు ఎంపిక చేశారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అమెరికా పర్యటన నుంచి తిరిగివచ్చిన తర్వాత పద్మ అవార్డు గ్రహీతలను సన్మానించనున్నట్లు ప్రకటించారు.
గతంలో పద్మ పురస్కారాలకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, ప్రముఖ నటుడు చిరంజీవి తో పాటు ఇతరులను సీఎం రేవంత్ ఆధ్వర్యంలో శిల్పకళా వేదికలో ఘనంగా సన్మానించిన విషయం గుర్తు చేశారు. అదే విధంగా ఈ ఏడాది కూడా పద్మ పురస్కారాలకు ఎంపికైన వారిని ఘనంగా సన్మానించనున్నట్లు తెలిపారు.
