అన్ని డిపార్ట్​మెంట్​లలో అవినీతిని వెలికితీయండి : సీఎం రేవంత్​రెడ్డి

అన్ని డిపార్ట్​మెంట్​లలో అవినీతిని వెలికితీయండి : సీఎం రేవంత్​రెడ్డి
  • గత ప్రభుత్వ అవినీతిపై సీఎం రేవంత్​ ఫోకస్
  • బాధ్యులపై చర్యలకూ సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆర్డర్స్​
  • ఇప్పటికే కాళేశ్వరం, ఓఆర్ఆర్, ధరణి, భగీరథ, టానిక్​ గ్రూప్​లిక్కర్​పై ఎంక్వైరీలు

హైదరాబాద్, వెలుగు: ఒకవైపు గత ప్రభుత్వ అక్రమాలను బయటకు తీస్తూనే.. మరోవైపు ఆరు గ్యారంటీలను అమలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. అందులో భాగంగానే బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని డిపార్ట్​మెంట్ల వారీగా బయటకు తీయాల్సిందేనని సీఎం రేవంత్​రెడ్డి డిసైడ్​ అయ్యారు. ప్రతి శాఖలో నిధుల దుర్వినియోగంతో పాటు నిధుల మేత ఎలా జరిగిందో గుర్తించి.. పూర్తి రిపోర్ట్​అందించాలని ఉన్నతాధికారులకు ఆదేశించినట్లు తెలిసింది. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణకు సీఎం ఆదేశించారు.

ప్రభుత్వ ఖజానాకు నష్టం తెచ్చేలా టెండర్లు కట్టబెట్టడంపై ఎంక్వైరీ జరుగుతోంది. మరోవైపు ఇష్టారీతిన అక్రమ కట్టడాలకు అనుమతులు ఇవ్వడం, ఆన్​లైన్​లో ఇవ్వాల్సిన పర్మిషన్లు ఆఫ్​లైన్​లో ఇవ్వడం.. భూముల వ్యవహారాలు, ఇతరత్రా వంటివాటిపై హెచ్ఎండీఏలో విజిలెన్స్ విచారణ జరుగుతోంది. ఇప్పటికే పలు కీలక ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు. హెచ్​ఎండీఏ డైరెక్టర్​ బాలకృష్ణపై ఏసీబీ దాడులు చేయడంతో అక్రమాల పుట్ట కదులుతోంది. ఇంకోవైపు గొర్రెల పంపిణీ, చేప పిల్లల పెంపకం పథకాలపై విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్​మెంట్ విచారణ కొనసాగుతోంది.

గొర్రెల పంపిణీలో నిధుల గోల్​మాల్​పై కొందరు అధికారులను కూడా ఏసీబీ అరెస్ట్​ చేసింది. ధరణి పోర్టల్ ఏజెన్సీ, మిషన్ భగీరథ విలేజ్ లెవల్ ఇంట్రా పైపులైన్లు, గ్రామాల్లో పనులపై విచారణ,  ఫోన్ ట్యాపింగ్ కేసు, దుగ్యాల ప్రవీణ్ రావు సస్పెన్షన్, ఎస్ఐబీ అధికారుల పాత్రపై విచారణకు ఆదేశాలు ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగిన మేడిగడ్డ బ్యారేజీపై ఇరిగేషన్ విభాగంలో విజిలెన్స్ ప్రాథమిక రిపోర్ట్​ రాగా ప్రభుత్వం రాసిన లేఖతో నేషనల్​ డ్యామ్​ సేఫ్టీ అథారిటీ ఎక్స్​పర్ట్​ కమిటీని వేసింది.

తాజాగా టానిక్ లిక్కర్ మార్ట్ లో వాణిజ్య పన్నుల శాఖ తనిఖీలు చేసి.. రూ.100 కోట్లకుపైగా వ్యాట్ ఎగవేతపై ప్రభుత్వం లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఇలా గత సర్కార్​ హయాంలో ప్రతి దాంట్లోనూ ఏదో ఒక రకంగా దోపిడీ జరిగిందని.. అందుకు సంబంధించిన వివరాలు బయటకు తీసి బాధ్యులపై చర్యలకు సిద్ధంగాఉండాలని స్పష్టం చేశారు. 

గ్యారంటీలతో ప్రజల్లోకి

ఓవైపు గత ప్రభుత్వ అవినీతి, అక్రమాలను తవ్వుతూనే ఆరు గ్యారంటీల అమలుపైనా ప్రజలు ఏమనుకుంటున్నారనే దానిపై సీఎం రేవంత్​ ఆరా తీసినట్లు తెలిసింది. ఇచ్చిన హామీ మేరకు ప్రజా సంక్షేమ గ్యారంటీలు ప్రజలకు చేరవేసేందుకు అధికారులు కట్టుబడి పనిచేయాలని సీఎం ఆదేశించారు. లోక్​సభ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వ పాలనే రెఫరెండం అని చెప్పడంతో పాటు.. ప్రభుత్వం అమలు చేసే గ్యారంటీల్లో అర్హులకు పూర్తిస్థాయిలో లబ్ధి జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇప్పటికే గృహజ్యోతి జీరో కరెంట్​ బిల్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ రూ.10 లక్షలకు పెంపు, రూ.500లకు గ్యాస్​ సిలిండర్ గ్యారంటీలను​అమల్లోకి తీసుకువచ్చారు. ఈనెల 11న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కూడా పట్టాలు ఎక్కించనున్నట్లు ఇప్పటికే సీఎం రేవంత్​ ప్రకటించారు.