V6 News

ఫలక్‌నుమా ప్యాలెస్‌లో మెస్సీకి CM రేవంత్‌ ఘన స్వాగతం.. ఆటపాటతో స్టేడియంలో అలరించిన రాహుల్

ఫలక్‌నుమా ప్యాలెస్‌లో మెస్సీకి CM రేవంత్‌ ఘన స్వాగతం.. ఆటపాటతో స్టేడియంలో అలరించిన రాహుల్

హైదరాబాద్: ఫుట్‏బాల్ సంచలనం, అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీకి ఫలక్ నుమా ప్యాలెస్‎లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. మెస్సీకి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి ఆప్యాయంగా స్వాగతించారు. గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా శనివారం (డిసెంబర్ 13) మెస్సీ హైదరాబాద్‎కు వచ్చారు. కోల్‎కతా నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న మెస్సీ భారీ బందోబస్తు నడుమ అక్కడి నుంచి నేరుగా ఫలక్ నుమా ప్యాలెస్‏కు వెళ్లారు. ఫలక్ నుమా ప్యాలెస్‎లో మెస్సీకి సీఎం రేవంత్ రెడ్డి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. 

ఆ తర్వాత గోట్ ఇండియా టూ‎ర్లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక మీట్-అండ్-గ్రీట్ కార్యక్రమంలో మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఉప్పల్ స్టేడియంలో మెస్సీ మ్యాచ్ చూసేందుకు హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఫలక్ నుమా ప్యాలెస్‎లో జరిగిన మీట్ అండ్ గ్రీట్‎లో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మెస్సీని కలిశారు. ఈ కార్యక్రమం తర్వాత మెస్సీ, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఉప్పల్ స్టేడియానికి వెళ్లనున్నారు.

అనంతరం సీఎం రేవంత్, మెస్సీ జట్లు ఫ్రెండ్లీ మ్యాచులో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కల్చరల్ ఈవెంట్లో ఆసార్క్ అవార్డ్ విన్నర్, తెలంగాణ ఫేమస్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అలరించారు. నాటు నాటు సాంగ్‎తో ఆడి పాడి స్టేడియంలోని ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఫోక్ సింగర్ మంగ్లీ కూడా ఆట, పాటతో హోరెత్తించింది. 

రాహుల్, మంగ్లీ మ్యూజికల్ ఫెర్ఫామెన్స్‎తో స్టేడియం దద్దరిల్లింది. లేజర్ షో కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మరోవైపు మెస్సీ మ్యాచ్‎ను కళ్లారా చూసేందుకు అభిమానులు భారీగా స్టేడియానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ఉప్పల్ స్టేడియం దగ్గర భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. కోల్ కతా ఘటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు.