పంట నష్టపోయిన రైతులకు CM రేవంత్ గుడ్ న్యూస్.. ఎకరాకు రూ.10 వేల సాయం

పంట నష్టపోయిన రైతులకు CM రేవంత్ గుడ్ న్యూస్.. ఎకరాకు రూ.10 వేల సాయం

హైదరాబాద్: మోంథా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల ఆర్ధిక సహయం అందజేస్తామని ప్రకటించారు. మోంథా తుఫాన్ దెబ్బకు అతలాకుతలమైన వరంగల్ జిల్లాలో శుక్రవారం (అక్టోబర్ 31) సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. 

ముందుగా విమానంలో ఏరియల్ సర్వే ద్వారా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన సీఎం రేవంత్.. ఆ తర్వాత ముంపు ప్రాంతాల్లో పర్యటించి బాధితులతో మాట్లాడి సాధకబాధకాలు తెలుసుకున్నారు. అనంతరం వరంగల్ కలెక్టరేట్లో భారీ వర్షాలు, వరద నష్టంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. వీలైనంత తొందరగా పంట నష్టం అంచనా వేయాలని అధికారులకు సూచించారు.

పంట నష్టం అంచనాకు ప్రజా ప్రతినిధులను కూడా తీసుకెళ్లాలని చెప్పారు. రోడ్లపై పేరుకుపోయిన చెత్తనంతా త్వరగా క్లియర్ చేయాలని.. ఓరుగల్లును త్వరగా పునరుద్ధరించాలని ఆదేశించారు. పొలాల్లో మేట తీసేందుకు ఉపాధి హామీ కింద లక్ష రూపాయల వరకు ఖర్చు చేస్తామని చెప్పారు. 

వరద మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా అందించనున్నట్లు ప్రకటించారు. వరద బాధితులకు తక్షణ సాయం కింద రూ. 15 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన తెలంగాణను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని.. తెలంగాణకు కేంద్రం మొండిచేయి చూపితే ఊరుకోమన్నారు.