
హైదరాబాద్: కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తోన్న వారికి సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. 2025, జూలై 25 నుంచి రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. సోమవారం (జూలై 21) వర్షాలు, వైరల్ ఫీవర్స్, పంటల సాగు, ఎరువులు, రేషన్ కార్డుల పంపిణీ పురోగతిపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2025, జూలై 25 నుంచి ఆగస్ట్ 10 వరకు అన్ని మండల కేంద్రాల్లో రేషన్ కార్డుల పంపిణీ చేయాలని.. ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, కలెక్టర్లు కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని.. ఈ సారి రేషన్ కార్డు రాని వారు ఆందోళన చెందొద్దని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో 96 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని, మూడు కోట్ల 10 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం అందిస్తున్నామని తెలిపారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా రేషన్ ద్వారా సన్న బియ్యం అందిస్తున్నామని.. సన్న బియ్యం ఇవ్వడం ద్వారా రేషన్ కార్డు విలువ పెరిగిందన్నారు.
రైతులను మోసం చేస్తే ఎంతటివారైనా వదలం:
రైతులకు ఎలాంటి కొరత లేకుండా ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైతులకు ఎరువులు దొరకడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం రేవంత్.. రాష్ట్రంలో ఎరువుల కోసం రైతులు ఎక్కడా క్యూలైన్లో లేరని క్లారిటీ ఇచ్చారు. ఎరువుల స్టాక్‌పై ఎప్పటికప్పుడు నోటీస్ బోర్డులు ఉండాలని అధికారులను ఆదేశించారు. జిల్లాల్లో ఎన్ని ఎరువుల దుకాణాలు ఉన్నయనేది కలెక్టర్ దగ్గర లిస్ట్ ఉండాలన్నారు.
20 నుంచి 25 శాతం ఎరువులు వ్యవసాయానికి కాకుండా ఇతర అవసరాలకు డైవర్ట్ అవుతున్నాయని.. ఎరువుల అక్రమ రవాణాపై అధికారులు ఉక్కుపాదం మోపాలన్నారు. వ్యవసాయానికి చెందిన యూరియా దారి మళ్లకుండా చూడాలన్నరు. తెలంగాణలో 25 శాతం యూరియా దారి మళ్లినట్లు కేంద్రం చెప్పిందని.. ఎరువులను పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులను మోసం చేస్తే ఎంతటివారినైనా కఠినంగా శిక్షిస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎరువుల కొరత ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై యాక్షన్ తీసుకోవాలని ఆదేశించారు.