సీఎం రేవంత్ మార్గదర్శనమే గెలుపునకు బాట!..బీఆర్ఎస్ ది దొరహంకారం..బీజేపీ దిగజారింది

సీఎం  రేవంత్ మార్గదర్శనమే గెలుపునకు  బాట!..బీఆర్ఎస్ ది దొరహంకారం..బీజేపీ  దిగజారింది

విజయనాదంలోనూ వినయం చూపగలవాడే నిజమైన ధీరుడు, స్థితప్రజ్ణుడు.  గెలుపును బాధ్యతగా గుర్తించగలిగినవాడే నిజమైన నాయకుడు.  అలా నిలిచి  గెలిచాడు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.   జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక  గెలుపు ఫలితాన్ని  ముందే అంచనా వేసినా... పోరాటమంటే ప్రయత్నం అని నమ్మినవాడు గనకనే తన పని తాను చేసుకుంటూ పోయాడు.  కేవలం ఉప ఎన్నికే అని ఏమరుపాటు చూపలేదు, కాంగ్రెస్  కార్యకర్త మొదలు మంత్రివర్గం వరకూ ఎన్నికల ప్రచార వ్యూహాలపై  స్వయంగా దిశానిర్దేశం చేశాడు.  తానే  ముందుండి  నడిపించాడు. అంతిమంగా చిరస్మరణీయ విజయాన్ని తాను చెప్పినట్టుగానే సాధించాడు, దటీజ్ రేవంత్ రెడ్డి. 

సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత  ఛిన్నాభిన్నమైన రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు మొదటిరోజు నుండే కార్యాచరణ ప్రారంభించాడు.  బేషజాలు లేకుండా అనుభవంతో కూడిన ప్రతి మంచి సలహాను పాటిస్తాను అని తెలిపాడు, అందుకోసం మాజీ ముఖ్యమంత్రిని సైతం అసెంబ్లీకి వచ్చి  విధుల్ని నిర్వహించమని కోరాడు.  నాడే  తనేంటో ప్రతిపక్షానికి తెలిసుంటుంది. 

అప్పుడే వాళ్లు గ్రహించి ఉంటారు రాబోయే పదేళ్లు ఇక తెలంగాణలో ప్రజల మనసుల్ని చూరగొనలేమని, అందుకే  గోబెల్స్ ప్రచారాలకు తెరలేపారు, అడ్డంగా దోపిడీ చేసిన ప్రజాధనంతో  ఇష్టారీతిన  సొంత సోషల్ మీడియాలను పెంచి పోషించి ఎంతచేసినా... ప్రజలు నమ్మడం లేదనేది నాడు కంటోన్మెంట్ ఉపఎన్నికలో , ఇపుడు  జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తేలిపోయింది.

బీఆర్ఎస్​ దొరహంకారం

కేవలం రేవంతన్నపై  అసూయతో,  దొరలమనే అహంకారంతో  రెచ్చిపోతున్న బీఆర్ఎస్  నేతలు  ఏంచేయాలో ప్రజలు  స్పష్టంగా చెప్పారు.  రాష్ట్రాభివృద్ది కోసం  గత  పదేళ్ల విధ్వంసంలో చేసిన తప్పుల్ని ఒప్పుకొని, రాష్ట్రాభివృద్దికి  కలిసి రమ్మని సూచించారు.  అయితే,  ఈ  దొరహంకార బీఆర్ఎస్  నేతలు జూబ్లీహిల్స్ ఎన్నికలో  గెలుపు కోసం చేయని ప్రయత్నాలు లేవు,  తమ  సోషల్ మీడియాలో ఇష్టారీతిన అడ్డగోలుగా విమర్శలు చేశారు.   

 సానుభూతి  ఓట్లకోసం ఆడబిడ్డను  తీసుకొచ్చి నిలబెట్టి నట్టేట ముంచారు.   తప్పుమీద తప్పు చేస్తూనే ఉన్నారు. అయినా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఏమాత్రం స్థైర్యం కోల్పోలేదు.  దీనికి ప్రధాన కారణం రేవంతన్న చతురత, ఆయనకు ప్రజలపై గల నమ్మకం.  మంత్రులు మొదలు సామాన్య కాంగ్రెస్ కార్యకర్త వరకూ కార్యక్షేత్రంలో ఏం చేయాలో,  ఏ ప్రచారం నిర్వహించాలో దిశానిర్దేశం చేశాడు, అభ్యర్థి నిర్ణయం మొదలు ప్రచార వ్యూహాల వరకూ అన్నీ తానై నిలిచాడు. 

దిగజారిన బీజేపీ

  రెండేళ్లలో  సీఎంగా రేవంతన్న సారథ్యంలోని కాంగ్రెస్​ పాలనపై ప్రజల్లో అభిమానం పెరిగింది.  ఉప ఎన్నికలో పోలైన ఓట్లలో 51శాతం ఓట్లను సాధించి  జూబ్లీహిల్స్ చరిత్రలోనే 24,279 ఓట్లతో ఘనమైన విజయాన్ని నమోదు చేసింది కాంగ్రెస్ పార్టీ.   మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో 36 శాతం సాధించిన బీజేపీ  8.76 శాతానికి దిగజారి ఏకంగా  కేంద్రమంత్రి  ప్రాతినిధ్యంలోనే  డిపాజిట్ కోల్పోయింది.    ఈ జూబ్లీహిల్స్ నుంచే  నాడు 60 వేల మెజార్టీతో  కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని ప్రజలు స్ఫష్టంగా ధిక్కరించారు.

 ఇకనైనా ప్రజలకోసం కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన హక్కుల్ని సాధించండి, రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్రం నుండి రావాల్సిన అనుమతులు, నిధులు తీసుకురండి అని గెలుపు తర్వాత రేవంతన్న చెప్పిన తీరుతో తన మది నిండా రాష్ట్రాభివృద్ధి మాత్రమే ఉందని చాటిచెప్పారు. 

సీఎం రేవంత్​కు అండగా తెలంగాణ సమాజం

ప్రజలు రేవంతన్న చేసేపనిలో చిత్తశుద్ధిని గమనించారు, బీసీ రిజర్వేషన్ల విషయంలో ఆయన పోరాడుతున్న తీరును అర్థం చేసుకున్నారు. ముస్లింలకు సరైన  సమయంలో  తగిన ప్రాతినిధ్యం కల్పించాడు.  మిగిలిన హామీల అమలుకు సైతం ప్రణాళికలను వివరించాడు.

  అందుకే సీఎంకు అండగా యావత్ తెలంగాణ సమాజం నిలబడింది.  ఈ స్థాయి నిబద్ధత,  నిక్కచ్చితనం రేవంతన్న రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిననాడే ఉన్నాయి.   అందుకే  తన  భవిష్యత్తేంటో నాడే స్పష్టంగా తెలిసినా... ప్రస్థానాన్ని మాత్రం కార్యకర్తగానే ప్రారంభించాడు.  ఈనాడు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉంటూ ప్రజల జీవితాల్లో గణనీయమైన మంచిమార్పుల్ని తేవడానికి నిరంతరం కృషి చేస్తున్నాడు. 

- పున్నా  కైలాస్ నేత,జనరల్ సెక్రటరీ, టీపీసీసీ-