హైదరాబాద్ సిటీలో రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరంలో మరో ఫ్లైఓవర్ నిర్మించాలని నిర్ణయించింది. రూ.530 కోట్లతో మియాపూర్ చౌరస్తా నుంచి ఆల్విన్ చౌరస్తా వరకు ఆరు లేన్లతో 1.8 కిలోమీటర్ల మేర ఈ కొత్త ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. 2026, జూన్ 8న సీఎం రేవంత్ రెడ్డి ఈ కొత్త ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, నవీన్ యాదవ్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
మియాపూర్ ఫ్లైఓవర్ డీటెయిల్స్ ఇవే
మియాపూర్ చౌరస్తా నుంచి ఆల్విన్ చౌరస్తా వరకు నిర్మించనున్న ఈ కొత్త ఫ్లైఓవర్ అంజయ్య నగర్ మీదుగా 1.8 కిలోమీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పుతో ఆరు లేన్లతో నిర్మాణం జరగనుంది. రూ.530 కోట్లలో నిర్మాణానికి సంబంధించి రూ.330 కోట్లు, నిర్మాణానికి అవసరమైన భూసేకరణ (ల్యాండ్ అక్విజిషన్) కోసం మరో రూ.200 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. పరిపాలన అనుమతులు మంజూరు కావడంతో అధికారులు త్వరలోనే భూసేకరణ ప్రక్రియను ప్రారంభించనున్నారు అధికారులు.
వీరికి ఇక ట్రాఫిక్ కష్టాలుండవ్
ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే గాజులరామారం, షాపూర్ నగర్, జీడిమెట్ల, చింతల్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగుతాయి. ఈ ప్రాంతాల నుంచి వచ్చేవారు బాలానగర్, వై జంక్షన్, కూకట్పల్లి, జేఎన్ టీయూ, నిజాంపేట్, హైదర్ నగర్ మీదుగా ట్రాఫిక్లో చిక్కుకుంటూ మియాపూర్, లింగంపల్లి, పటాన్చెరు వైపు వెళ్లాల్సి వస్తోంది.
ఫ్లైఓవర్ పూర్తయితే ఎలాంటి సిగ్నల్స్, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా జగద్గిరిగుట్ట మీదుగా ఆల్విన్ కాలనీ చేరుకొని అక్కడి నుంచి నేరుగా గమ్యస్థానాలకు సాఫీగా చేరుకోవచ్చు. దీనివల్ల బాలానగర్, కూకట్పల్లి, జేఎన్టీయూ, నిజాంపేట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ తగ్గే అవకాశముంది.
- 161 కోట్లతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) ప్రధాన కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన
- 530 కోట్లతో మియాపూర్ చౌరస్తా లో ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన
- 308 కోట్లతో శేరిలింగంపల్లి ROB నిర్మాణ పనులకు శంకుస్థాపన
- 65.53 కోట్లతో నిర్మించిన బాచుపల్లి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం
- 229 కోట్లతో ORRకు ఇరువైపులా ఉన్న సర్వీస్ రోడ్డు కోసం ప్రధాన వంతెన నిర్మాణం, ORR నుండి కొత్త సర్వీస్ రోడ్డు ఏర్పాటుకు శంకుస్థాపన
- 110 కోట్లతో శంకర్ పల్లి రోడ్ MGIT నుంచి మణికొండ వరకు పైప్ లైన్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
- 29.25 కోట్లతో కొల్లూరు ఇంటర్‌చేంజ్ సమీపంలోని రెండు రైల్వే ఓవర్ హెడ్స్ (RoBs) వరకు 4 లేన్ల అప్రోచ్ ర్యాంపుల నిర్మాణానికి శంకుస్థాపన.
- 26.50 కోట్లతో నానక్‌రామ్‌గూడ నుంచి గచ్చిబౌలి వరకు ORR ఎడమ వైపు ఉన్న ప్రధాన క్యారేజ్ వే విస్తరణకు శంకుస్థాపన.
- 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన.
- 14.40 కోట్లతో మాదాపూర్, నానక్ రామ్ గూడలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ నిర్మాణానికి శంకుస్థాపన
