ఏటీసీల్లో చదువుకునేటోళ్లకు వచ్చే ఏడాది నుంచి ప్రతి నెల రూ.2 వేల స్కాలర్‌‌‌‌‌‌‌‌షిప్: సీఎం రేవంత్

ఏటీసీల్లో చదువుకునేటోళ్లకు వచ్చే ఏడాది నుంచి  ప్రతి నెల రూ.2 వేల స్కాలర్‌‌‌‌‌‌‌‌షిప్: సీఎం రేవంత్
  • నైపుణ్యాల అభివృద్ధికే స్కిల్ వర్సిటీ, ఏటీసీల ఏర్పాటు 
  • టామ్‌‌‌‌కామ్‌‌‌‌ ద్వారా విదేశాల్లో మనోళ్లకు ఉద్యోగాలు 
  • జర్మనీ, జపాన్, రష్యాలో మస్తు అవకాశాలున్నయ్ 
  • ఫారిన్ వెళ్లేందుకు పాస్‌‌‌‌పోర్టు, వీసా మేమే ఇప్పిస్తాం 
  • ఏటీసీల్లో చదువుకునేటోళ్లకు వచ్చే ఏడాది నుంచి  ప్రతినెల రూ.2 వేల స్కాలర్‌‌‌‌‌‌‌‌షిప్  
  • రాష్ట్రవ్యాప్తంగా 65 ఏటీసీలను ప్రారంభించిన సీఎం
  • ఏడాదిలోగా మరో 51 ఏటీసీలను నిర్మిస్తామని ప్రకటన 
  • గత పదేండ్లలో ఐటీఐలను పట్టించుకోలేదు: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • తాము వచ్చాక వాటిని ఏటీసీలుగా మార్చుతున్నామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: స్కిల్స్ ఉంటేనే జాబ్స్ వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘చదువుతో పాటు స్కిల్స్ కూడా అవసరమే. అప్పుడే ఉద్యోగాలు వస్తాయి. లేదంటే సర్టిఫికెట్లు ఎందుకూ ఉపయోగపడవు. స్కిల్స్ పెంచుకోవడంపై యువత ఫోకస్ పెట్టాలి. ఇందుకు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. యువతకు స్కిల్స్ నేర్పించి, ఉపాధి చూపాలనే ఉద్దేశంతోనే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని నెలకొల్పుతున్నం. ఐటీఐలను ఏటీసీలుగా మార్చాం. మన దేశ యువత స్కిల్స్ పెంచుకుంటే జర్మనీ, జపాన్ లాంటి దేశాలు సైతం మన ముందు మోకరిల్లే రోజు వస్తుంది” అని పేర్కొన్నారు.

శనివారం హైదరాబాద్‌‌‌‌లోని మల్లేపల్లి, శాంతినగర్, విజయ్ నగర్ కాలనీల్లో నిర్మించిన  అడ్వాన్స్‌‌‌‌డ్​ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)లను సీఎం రేవంత్ ప్రారంభించారు. ఆయా సెంటర్లలోని మెషినరీని పరిశీలించి స్టూడెంట్లతో మాట్లాడారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన మరో 62 ఏటీసీలను సీఎం వర్చువల్‌‌‌‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పునర్నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దాలన్నారు. ‘‘చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది. డ్రగ్స్, గంజాయికి బానిస కాకండి.. మీ తల్లిదండ్రులకు బాధను మిగిల్చకండి” అని యువతకు సూచించారు.

ఐటీఐలను పునరుద్ధరిస్తున్నం.. 
గత ప్రభుత్వాలు ఐటీఐలను పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో 1956లో ఐటీఐలను ప్రారంభించారు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా వాటిని అప్‌‌‌‌గ్రేడ్ చేయలేదు. దీంతో కాలక్రమంలో ఐటీఐలు నిర్వీర్యమయ్యాయి. మేం అధికారంలోకి వచ్చాక ఐటీఐలను పునరుద్ధరించాలని నిర్ణయించాం. పోయినేడాది టాటా టెక్నాలజీస్ ​సహకారంతో ఏటీసీల నిర్మాణం ప్రారంభించాం. ఇవి పునాదులుగానే మిగిలిపోతాయని అప్పట్లో కొంతమంది విమర్శించారు. కానీ సంకల్పం ఉంటే సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ఈరోజు ప్రారంభించుకున్న 65 ఏటీసీలే మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం” అని పేర్కొన్నారు. మరో 51 ఏటీసీలను మంజూరు చేస్తున్నామని, ఏడాదిలోగా వాటిని నిర్మిస్తామని ప్రకటించారు. ఏటీసీల్లో చదువుకునే విద్యార్థులకు ఆర్టీసీలో అప్రెంటిషిప్‌‌‌‌ ఇవ్వాలని, వచ్చే ఏడాది నుంచి ప్రతినెల రూ.2 వేల స్కాలర్‌‌‌‌‌‌‌‌షిప్ ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ మల్లు రవి తదితరులు పాల్గొన్నారు. 

ఏడాదిలోనే నిర్మించాం: మంత్రి శ్రీధర్ బాబు
ఏడాదిలోనే ఏటీసీలను నిర్మించి ప్రారంభించడం తమ ప్రభుత్వ విజయమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. “మనం చదువుకునే చదువులకు, కంపెనీలకు అవసరమైన స్కిల్స్ కు మధ్య చాలా గ్యాప్ ఉంది. ఈ గ్యాప్‌‌‌‌ను ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. వీటితో పాటు ఏటీసీలను సైతం అప్ గ్రేడ్ చేసి కొత్త టెక్నాలజీతో కోర్సులు ప్రవేశపెట్టాం. టాటా టెక్నాలజిస్ సహకారంతో ఏటీసీల్లో మెషిన్స్ ఏర్పాటు చేశాం. స్కిల్స్ లేవన్న కారణంతో తెలంగాణ యువత జాబ్స్ కు దూరమయ్యే పరిస్ధితి రావొద్దనే ఈ నిర్ణయం తీసుకున్నాం” అని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన యువతకు గత పదేండ్లు ఉద్యోగాలు ఇవ్వలేదని, అందుకే యువత తమకు అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం యువతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు.

ఇక ఏటీసీలదే కీలక పాత్ర: మంత్రి పొన్నం 
నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఏటీసీలు ఏర్పాటు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వీటి నిర్మాణంలో టాటా టెక్నాలజిస్ సహకారం మరువలేనిదన్నారు. “ప్రస్తుతం ఇంజనీరింగ్, ఇతర ఉన్నత చదువులు చదివినా.. స్కిల్స్ లేకపోతే జాబ్స్ రావడం కష్టంగా  ఉంది. యువతలో నైపుణ్యాలు పెంపొందించడంలో ఏటీసీలు కీలక పాత్ర పోషిస్తాయి. వీటి ఏర్పాటుకు కృషి చేసిన కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి నా శుభాకాంక్షలు” అని పేర్కొన్నారు.

అడ్మిషన్లు ఫుల్: దాన కిశోర్
గ్రామీణ యువతకు సీఎం రేవంత్ రెడ్డి ఇస్తున్న కానుకలే ఏటీసీలు అని కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ అన్నారు. ‘‘గతంలో ఐటీఐలు అంటే చిన్నచూపు ఉండేది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఆ పరిస్థితి మారింది. ఏటీసీలు, ఐటీఐల్లో అడ్మిషన్లు ఫుల్ అయ్యాయి. విదేశాల్లో ఉద్యోగాలు పొందేందుకు అక్కడి భాషలు  నేర్చుకునేలా యువతకు ట్రైనింగ్ ఇచ్చేందుకు సీఎం నిధులు మంజూరు చేశారు. ప్రతి క్యాంపస్ లో సోలార్ పవర్ వినియోగించాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. అందుకు అనుగుణంగా ప్లాన్ రెడీ చేస్తున్నాం” అని తెలిపారు.
    
ఏటీసీలతో ఉద్యోగాలు: మంత్రి వివేక్
ఏటీసీలతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయని కార్మిక, మైనింగ్ శాఖల మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వర్చువల్​గా మాట్లాడారు. “గత పదేండ్లలో ఐటీఐలను పట్టించుకోలేదు. నాటి పాలకులు మెగా ప్రాజెక్టు అని చెప్పి నిధులు వృథా చేశారు. టాటా టెక్నాలజీస్​సహకారంతో 65 ఏటీసీలను ఏర్పాటు చేశాం. వీటిలో సిబ్బంది కావాలని సీఎంను కోరాం. మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా స్కిల్స్​నేర్చుకుంటేనే ఉద్యోగాలు వస్తాయి. ఏటీసీల్లో అందుబాటులోకి తెచ్చిన కొత్త కోర్సులతో ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడుతాయి. గత ప్రభుత్వం వేలంలో పాల్గొనేందుకు సింగరేణికి అనుమతి ఇవ్వలేదు. సింగరేణి కూడా కొత్త గనుల వేలంలో పాల్గొనాలని సీఎం ఆదేశించారు. ఈ నిర్ణయంతోనూ ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడుతాయి” అని వివేక్​ పేర్కొన్నారు.

విదేశాల్లో 30 వేల జాబ్స్ రెడీగా ఉన్నయ్..  
టామ్‌‌‌‌కామ్‌‌‌‌తో పలువురు విదేశాల్లో ఉద్యోగాలు సాధించారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘జపాన్ పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ పని చేస్తున్న తెలంగాణ వాసులు కలిశారు. నెలకు రూ.3 లక్షల జీతం వస్తున్నదని వాళ్లు చెప్పినప్పుడు సంతోషంగా అనిపించింది” అని అన్నారు. ‘‘మీకు ఇచ్చేందుకు ప్రభుత్వం దగ్గర భూములు లేవు. మీకు మంచి చదువు, సాంకేతిక నైపుణ్యాలు అందిస్తాం. అవే మీ తలరాతను మారుస్తాయి. స్కిల్స్​పెంచుకొని ఉద్యోగాలు సాధించాలి” అని యువతకు సూచించారు.

‘‘జపాన్, జర్మనీ, రష్యాలో 30 వేల జాబ్స్ రెడీగా ఉన్నాయి. జపాన్‌‌‌‌లో 70 ఏండ్లు పైబడిన వృద్ధులే ఎక్కువగా ఉన్నారు. పనిచేసే యువత కావాలని జపాన్, జర్మనీ దేశాల ప్రతినిధులు అడుగుతున్నారు. ఇతర దేశాలకు వెళ్లేందుకు పాస్‌‌‌‌పోర్ట్, వీసా మేమే ఇప్పిస్తాం. ఇందుకు ఒక వింగ్ ఏర్పాటు చేస్తాం” అని వెల్లడించారు. ఇంగ్లిష్ వస్తేనే పెద్ద మేధావి అన్నట్టు కొంతమంది ఫోజులు కొడుతున్నారని.. ఇంగ్లిష్‌‌‌‌ లేకున్నా జపాన్,  జర్మనీ ఎంతో అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు.

అలా ఆలోచన పుట్టింది..
మార్కెట్‌‌‌‌లో ఉద్యోగావకాశాలు ఉన్నప్పటికీ, వాటికి అవసరమైన స్కిల్డ్ ఎంప్లాయ్స్ లేరని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘దావోస్ పర్యటనలో నేను, మంత్రి శ్రీధర్​బాబు టాటాగ్రూప్​ చైర్మన్‌‌‌‌ను కలిశాం. అప్పుడు నిరుద్యోగ సమస్య గురించి చర్చకు వచ్చింది. మార్కెట్‌‌‌‌లో చాలా ఉద్యోగా లున్నా, స్కిల్డ్​ఎంప్లాయ్స్‌‌‌‌ కొరత ఉందని ఆయన మాకు చెప్పారు. అప్పుడే ఏటీసీల ఆలోచన పుట్టిం ది. కాలం చెల్లిన ఐటీఐలను ఏటీసీలుగా మార్చి, మార్కెట్​అవసరాలకు అనుగుణంగా కోర్సులను రూపొందించి యువతకు ట్రైనింగ్​ ఇస్తున్నాం. ప్రస్తుతం ఏటీసీల్లో అత్యాధునిక టెక్నాలజీ, మెషినరీ వాడుతున్నాం. ఏటీసీల కోసం ప్రభుత్వం రూ.300 కోట్లు పెట్టుబడి పెడ్తే, టాటా గ్రూప్ రూ.2100 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఒక్కో ఏటీసీలో 170 నుంచి 200 మంది చేరారు. మా పాలనకు ఏటీసీలు మంచి ఉదాహరణ’’  అని పేర్కొన్నారు.