మూసీ పునరుద్ధరణలో భాగంగా మూసీ నది ఒడ్డున మంచిరేవులలో శ్రీ ఓంకారేశ్వర ఆలయం నిర్మాణానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి మార్చి 28న ఉదయం శంకుస్థాపన చేశారు. ఆలయ భూమి పూజకు కుటుంబంతో కలిసి హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి . ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టితో పాటు ఎంపీ వేం నరేందర్ రెడ్డి హాజరయ్యారు.
మంచిరేవులలో 800 ఏళ్ల వీరభద్రస్వామి ఆలయ ప్రాంగణంలో ఈ ఆలయం నిర్మించనున్నారు. రూ. 700 కోట్ల అంచనా వ్యయంతో ఆలయ నిర్మాణ ప్రణాళిక రూపొందించారు. శృంగేరి శారదాపీఠం సూచనల మేరకు ఆలయ డిజైన్ ఖరారు చేసింది తెలంగాణ ప్రభుత్వం. మూసీ నదిలో 100 అడుగుల ఎత్తైన శివుడి విగ్రహం ఏర్పాటు చేయనుంది. పార్కులు, బోటింగ్‌తో టూరిజం హబ్‌గా అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. మూసీ పరీవాహక ప్రాంతాన్ని మత సామరస్యానికి ప్రతీకగా అభివృద్ధి చేయనుంది. నాలుగు మతాలకు సంబంధించిన ప్రార్థనాలయాల నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. పురానాపూల్ వద్ద మసీదు, గౌలిగూడలో గురుద్వారా, నాగోల్ లో చర్చి నిర్మించేలా ప్రణాళిక రూపొందిస్తోంది. పురాతన మచిలేశ్వర ఆలయం సమీపంలో కొత్త మందిర నిర్మాణం చేపట్టనుంది.
ఓఆర్‌ఆర్ నుంచి ఆలయానికి విస్తృత రహదారి సౌకర్యం కల్పించనున్నారు. నది మధ్యలో శివుని విగ్రహం చుట్టూ పార్కులు అభివృద్ధి చేయనున్నారు. బోటింగ్, పర్యాటక సౌకర్యాలతో ఆకర్షణీయ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.
