రుణమాఫీ గైడ్​లైన్స్ ఖరారు చేయండి

రుణమాఫీ గైడ్​లైన్స్ ఖరారు చేయండి
  • పూర్తి డేటా సేకరించి ప్రణాళికలతో రండి.. వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించిన రేవంత్
  • కటాఫ్ డేట్​లో ఇబ్బందులు రాకుండా చూడాలన్న సీఎం

హైదరాబాద్, వెలుగు: పంట రుణమాఫీకి సంబంధించిన గైడ్​లైన్స్ రూపొందించి స్పష్టమైన ప్రణాళికతో రావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆ శాఖ అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15లోపు పంట రుణమాఫీ చేసి తీరాలని తేల్చి చెప్పారు. ఎలక్షన్ టైమ్​లో ఇచ్చిన హామీ మేరకు క్రాప్ లోన్ల మాఫీ అమలుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. సోమవారం పంట రుణమాఫీ, ఇతర అంశాలపై వ్యవసాయ, సహకార శాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘రుణమాఫీకి సంబంధించిన విధి విధానాలు రూపొందించాలి. రూ.2లక్షల వరకు రుణాలు ఉన్న రైతుల జాబితాను సిద్ధం చేయాలి. పూర్తి స్థాయిలో బ్యాంకర్ల నుంచి రైతుల వివరాలు సేకరించి అర్హులను గుర్తించాలి. రుణమాఫీకి సంబంధించిన కటాఫ్ డేట్ విషయంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కేవలం బ్యాంకుల నుంచే కాకుండా.. సహకార బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలను అందుబాటులో ఉండేలా చూడాలి’’అని అన్నారు.

రూ.2లక్షల రుణమాఫీ చేసేందుకు పూర్తి స్థాయి వివరాలతో పాటు క్రాప్ లోన్ల మాఫీకి అవసరమైన అంచనా వ్యయాన్ని కూడా రూపొందించాలని అధికారులను రేవంత్ ఆదేశించారు. రివ్యూ మీటింగ్​లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వర్ రావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, అగ్రికల్చర్, కో ఆపరేటివ్ డిపార్ట్​మెంట్ ఆఫీసర్లు పాల్గొన్నారు.