ప్రభుత్వంలో ఏ శాఖ ఖాళీగా లేదు.. అన్ని శాఖలకు మంత్రులున్నారు: సీఎం రేవంత్ రెడ్డి

ప్రభుత్వంలో ఏ శాఖ ఖాళీగా లేదు.. అన్ని శాఖలకు మంత్రులున్నారు: సీఎం రేవంత్ రెడ్డి

మంత్రివర్గం విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్.. కాంగ్రెస్ పెద్దలతో రాష్ట్ర మంత్రివర్గంపై ఎలాంటి చర్చలు జరగలేదని చెప్పారు.  2024, జూన్ 27వ తేదీ ఢిల్లీలో సీఎం మీడియాతో మాట్లాడుతూ..  ప్రభుత్వంలో ఏ శాఖ ఖాళీగా లేదు.. అన్ని శాఖలకు మంత్రులున్నారన్నారు.  ప్రస్తుతం విద్యాశాఖను తాను ఫుల్ టైమ్ చూస్తున్నానని. విద్యాశాఖ మీద ఎన్నో సమీక్షలు నిర్వహించానని..  తన ఆధ్వర్యంలో విద్యాశాఖ సక్సెస్ గా పరీక్షలు నిర్వహించిందని చెప్పారు. 

మీడియాలో ఇష్టారాజ్యంగా కథనాలు వస్తున్నాయని.. మీ పాటికి మీరే శాఖలు కూడా కేటాయిస్తున్నారని అన్నారు. రాజకీయ పార్టీలు నిర్వహించే టీవీలు, పత్రికలు మాత్రమే శాఖలకు మంత్రులు లేరని రాస్తున్నారని చెప్పారు. గతంలో కేసీఆర్ ఒక సందర్భంలో ఏ శాఖకూ మంత్రి లేకుండా ఉన్నప్పుడు ఎవరైనా ప్రశ్నించారా? అని అడిగారు.

 ఏ రాష్ట్రంతో పోల్చి చూసినా మన రాష్ట్రంలో శాఖల మంత్రుల పనితీరు చాలా మెరుగ్గా ఉందన్నారు. నిరంతరం కేంద్రం చుట్టూ తిరుగుతూ తమ తమ శాఖల పనులు చూసుకుంటున్నాని తెలిపారు.  బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వ అవసరాలను కేంద్రానికి తెలియజేయడం కోసం మేమంతా ఢిల్లీకి వచ్చామన్నారు. ఇందులో భాగంగా కొత్త ప్రభుత్వానికి రాష్ట్ర వినతులు ఇచ్చామన్నారు. ఎలాంటి భేషజాలకు వెళ్లకుండా కేంద్ర పెద్దలను కలుస్తున్నామని... త్వరలో ప్రధానమంత్రిని, హోం మంత్రిని కూడా కలుస్తామని చెప్పారు. 

Also Read:జీవన్ రెడ్డి గౌరవానికి భంగం లేకుండా చూసుకుంటాం

బీజేపీ వాళ్ళ కంటే ఎక్కువగా మేమే కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ తీసుకుని నిధులు, ప్రాజెక్టులు రాబట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. రూ.31 వేల కోట్ల రైతుల రుణమాఫీ ఏకకాలంలో అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం తెలిపారు.