
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గౌరవానికి భంగం కలిగించకుండా చూసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చేరిక విషయంలో కొంత గందరగోళం ఏర్పడిందన్నారు. మంత్రి శ్రీధర్ బాబు సమన్వయంతో సమస్య పరిష్కారమైందని చెప్పారు. 2024, జూన్ 27వ తేదీ ఢిల్లీలో సీఎం రేవంత్ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కోసం జీవన్ రెడ్డి ఎంతో కృషి చేశారని చెప్పారు. పార్టీ కోసం పనిచేసిన నేతలు, కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. పాలనలో సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. ఆయన అనుభవాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకుంటామని తెలిపారు. ఎప్పటిలాగే జీవన్ రెడ్డి రైతుల అభివృద్ధికి కృషి చేస్తారు.
Also Read:ప్రభుత్వంలో ఏ శాఖ ఖాళీగా లేదు.. అన్ని శాఖలకు మంత్రులున్నారు
జగిత్యాల నియోజకవర్గాంతోపాటు రైతుల కోసం జీవన్ రెడ్డి కొట్లాడారని సీఎం అన్నారు. రైతురుణమాఫీ, రైతుబంధు విషయంలో జీవన్ రెడ్డి సలహాలు తీసుకుంటామని తెలిపారు. జగిత్యాల అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి వచ్చారన్నారు. కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తున్నాయని... బీఆర్ఎస్ ను కాపాడేందుకు తప్పుడు వార్తలు రాస్తున్నారని సీఎం రేవంత్ మండిపడ్డారు.