'Akhanda 2' Pre-Release: బాలయ్య 'అఖండ 2: తాండవం' ప్రీరిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి, బన్నీ?

'Akhanda 2' Pre-Release:  బాలయ్య 'అఖండ 2: తాండవం' ప్రీరిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి, బన్నీ?

నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ , దర్శకుడు బోయపాటి శ్రీను కాంబో వస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం 'అఖండ 2: తాండవం'.  వీరిద్దరి కలయికతో సినిమా అంటేనే అంచనాలు భారీగా ఉంటాయి. పాన్ ఇండియా స్థాయిలో సిద్ధమైన ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా.. సినిమా విడుదల కంటే ముందుగా అభిమానుల కోసం అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను చిత్ర యూనిట్ ఖరారు చేసింది.

'అఖండ 2' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌..

'అఖండ 2' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల నవంబర్ 28, శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని కైతలాపూర్ గ్రౌండ్స్‌లో సాయంత్రం 5 గంటల నుంచి నిర్వహించనున్నారు.  వేలాది మంది అభిమానుల మధ్య ఈ వేడుక అత్యంత వైభవంగా, కన్నులపండువగా జరగనుంది. ఇప్పటికే ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రం సనాతన ధర్మం నేపథ్యంతో తెరకెక్కడం వల్ల, ఆధ్యాత్మిక వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ పలువురు ప్రముఖ ఆధ్యాత్మిక గురువులను కూడా ఈ వేడుకకు ఆహ్వానించే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది.

ALSO READ :  ‘రాజు వెడ్స్ రాంబాయి’ భారీ సక్సెస్..

అంతే కాకుండా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారని సమాచారం.. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో విడుదల కానుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను సైతం ఈవెంట్‌కు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే, అట్లీ దర్శకత్వంలో ఆయన చేస్తున్న సినిమా షూటింగ్ షెడ్యూల్ కారణంగా బన్నీ హాజరు కావడంపై స్పష్టత రావాల్సి ఉంది. 

 

2డీ, 3డీ అనుభూతి!
ఈ భారీ చిత్రాన్ని బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మించారు. బాలయ్య తనయురాలు ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం మరింత ఆసక్తిని పెంచింది. బాలకృష్ణకు జోడీగా సంయుక్త హీరోయిన్‌గా నటించగా, శక్తివంతమైన విలన్ పాత్రలో ఆది పినిశెట్టి కనిపించనున్నారు. గతంలో 'అఖండ'కు అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన తమన్, ఈ సీక్వెల్‌కు కూడా సంగీతం అందించారు. ఆయన పాటలు, నేపథ్య సంగీతం ఇప్పటికే సినిమాపై అంచనాలను పెంచాయి.

'అఖండ 2'ను 2డీతో పాటు 3డీ ఫార్మాట్‌లో కూడా విడుదల చేయనున్నారు. అయితే, అమెరికాలోని ప్రీమియర్ షోలు తొలిరోజు 3డీలో ప్రదర్శించబడవు; ఒక రోజు తర్వాత మాత్రమే అభిమానులు 3డీ అనుభవాన్ని పొందగలుగుతారు. 'అఖండ 2: తాండవం'తో బాలకృష్ణ,బోయపాటి శ్రీను హ్యాట్రిక్ హిట్‌ను అందుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ట్రైలర్, పాటలు , నటీనటుల అనుభవాలతో సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చడం ఖాయం. డిసెంబర్ 5 కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు..