సమర్థులైన అభ్యర్థులను ఎంపిక చేయండి : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్, మంత్రుల మీటింగ్

సమర్థులైన అభ్యర్థులను ఎంపిక చేయండి : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్, మంత్రుల మీటింగ్

స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్  ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావటం.. మొదటి విడత నామినేషన్ల దాఖలు ప్రారంభం అయిన క్రమంలో.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు రివ్యూ మీటింగ్ పెట్టారు. జిల్లా అధ్యక్షులు, కీలక నేతలు, కార్యకర్తలతో జూం మీటింగ్ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్.

స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సమర్థులైన అభ్యర్థులను ఎంపిక చేయాలని.. అన్ని జిల్లాల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు లక్ష్యంగా వ్యూహాలు ఉండాలని.. కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలను ఇంటింటికీ వివరించాలన్నారాయన. రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం.. రైతుల అప్పులు మాఫీ, ఉచిత బస్సు వంటి అనేక సంక్షేమ పథకాలను అందజేస్తున్నామన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో గెలుపు అనేది చాలా ముఖ్యం అని.. క్లీన్ స్వీప్ చేసే దిశగా అభ్యర్థుల ఎంపిక ఉండాలని సూచించారాయన. 

ఇంచార్జ్ మంత్రులు వాళ్ల వాళ్ల జిల్లాల నాయకులతో అత్యవసరం గా మాట్లాడి.. అభ్యర్థులను ఫైనల్ చేసి బీ ఫారం ఇవ్వాలని.. నో డ్యూ సర్టిపికేట్ లు ఇప్పించాలని ఆదేశించారాయన. లీగల్ సెల్ ను యాక్టివ్ చేయాలని.. పార్టీ ఆఫీసు అయిన గాంధీ భవన్ లో లీగల్ టీమ్ నిరంతరం అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పార్టీ నేతలతో సమన్వయం కోసం గాంధీభవన్ లో ఒక టీమ్ ఏర్పాటు చేయాలన్నారు. హైకోర్టులో బీసీ రిజర్వేషన్ విచారణపైన పీసీసీ అధ్యక్షుడు పర్యవేక్షణ చేస్తూ.. కోర్ట్ తీర్పు తర్వాత తదుపరి కార్యాచరణ కోసం మరో సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని.. తొలి విడత కోసం ఈ రాత్రికే అభ్యర్థుల జాబితా సిద్ధం కావాలని ఆయా జిల్లా ఇంచార్జి మంత్రులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. 

ఇదే జూం మీటింగ్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. లోకల్ బాడీ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలని.. కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని నేతలను కోరారాయన. ఈ 15 రోజులు కష్టపడి పని చేస్తే విజయం ఖాయం అని.. అన్ని స్థానాల్లో గెలుపు కోసం ప్రయత్నించాలని నేతలకు సూచించారు మంత్రి ఉత్తమ్. 

మంత్రి పొంగులేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. మన సుదీర్ఘ పోరాటంలో మరో అడుగు పడిందని.. గెలుపు కోసం అందరం కలిసి పని చేయాలని నేతలు, కార్యకర్తలకు సూచించారాయన. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించుకుని.. లోకల్ లీడర్లు, కార్యకర్తల సమన్వయంతో ముందుకు సాగితే గెలుపు ఖాయం అన్నారు మంత్రి పొంగులేటి. 

మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలకు ఉమ్మడి నల్గొండ జిల్లా సిద్ధంగా ఉందని.. అభ్యర్థుల ఎంపికలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని భరోసా ఇచ్చారాయన. 

స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక ఆన్ లైన్ మీటింగ్ లో ఏఐసీసీ ప్రతినిధులు, మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.