స్వచ్ఛందంగా కూల్చేసుకోండి.. లేదంటే మేమే కూల్చేస్తం: సీఎం రేవంత్ రెడ్డి

స్వచ్ఛందంగా కూల్చేసుకోండి.. లేదంటే మేమే కూల్చేస్తం: సీఎం రేవంత్ రెడ్డి
  • ఆ బాధ్యత నాదే
  • తాగే నీళ్లలో డ్రైనేజీ వదిలితే ఊకుందామా?
  • చెరువులను చెరబడితే చెరసాలే!
  • కోర్టు నుంచి స్టే తెచ్చుకుంటే వెకెట్ చేయిస్తం
  • మీరు చేసేది ఉద్యోగం కాదు.. భావోద్వేగం
  • గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపండి
  • ఆ మాట ఎత్తాలంటే వెన్నులో వణుకు పుట్టాలె
  • పోలీసుల పాసింగ్ అవుట్ పరేడ్ లో సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: చెరువులను చెరబట్టి ఫాంహౌస్ లను నిర్మించుకున్న వారు స్వచ్ఛందంగా తమ నిర్మాణాలను కూల్చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. లేదంటే  వారికి చెరసాలే గతి అని హెచ్చరించారు.  నగర ప్రజలు తాగే నీటిలో డ్రైనేజీ వదిలితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ఇవాళ పోలీసుల పాసింగ్ అవుట్ పరేడ్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తాగు నీటి అవసరాల కోసం ఆ నాడు నిజాంనవాబు కట్టించిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చుట్టూ ఎఫ్టీఎల్ లో బఫర్ జోన్ లో ఆగర్భ శ్రీమంతులు విల్లాలు, ఫాంహౌస్ లు కట్టుకున్నారని, వాటికి డ్రైనేజీలు లేవని, ఆ డ్రైనేజీని తాగే నీళ్లలో వదులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి నీళ్లను ప్రజలకు అందిస్తే తాను సీఎంగా ఫెయిలైనట్టేనని సీఎం అన్నారు. 

ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో కట్టుకున్న వాళ్లు స్వచ్ఛందంగా కూల్చేసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. లేని పక్షంలో తాము కూల్చివేస్తామని, కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ తెచ్చుకుంటే వెకెట్ చేయిస్తామని చెప్పారు. చెరువులను చెరబట్టిన వాళ్లను చెరసాలకు పంపడ మే తమ ప్రభుత్వ విధానమని చెప్పారు. ఆక్రమణల వల్ల వరదలు వచ్చినప్పుడు పేదలు నివసించే ఇండ్లలోకి, బస్తీల్లోకి  మురికి నీరు వెళ్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మున్నేరు వాగైనా.. వరంగల్ అయినా.. కృష్ణా తీరమైనా ఆక్రమణల వల్లే నివాస ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని అన్నారు. 
 
ఉద్యోగం కాదు భావోద్వేగం
పోలీసు శాఖలో పనిచేయడమంటే ఉద్యోగం కాదని, నాలుగుకోట్ల మంది తెలంగాణ  ప్రజల భావోద్వేగమని అన్నారు. త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ రాష్ట్రం నుంచి గంజాయి, డ్రగ్స్, సైబర్ నేరాలను పారదోలేందుకు ప్రతి పోలీసూ కంకణబద్ధులు కావాలని సీఎం  రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పోలీసు ఉద్యోగమంటే సమయం, సందర్భం ఉండవని, వరదలొచ్చినా.. భూకంపమైనా.. ఆర్థిక నేరాలు జరిగినా ముందుండి పోరాటం చేయడమేనని అన్నారు. భవిష్యత్ తరాలకు బాటలు వేసేలా విధులు నిర్వర్తించాలని ఆకాంక్షించారు. గంజాయి, డ్రగ్స్ మాట ఎత్తాలంటేనే వెన్నుల్లో వణుకు పుట్టాలని అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది నేరస్తుల విషయంలో కాదని, బాధితుల పట్ల స్నేహపూర్వకంగా మెదులుకోవాలని కోరారు. కాస్మొటిక్ పోలిసింగ్ .. కాంక్రీట్ పోలిసింగ్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.  

టీజీపీఎస్సీపై ఎలాంటి అనుమానాలు లేవు
గత ప్రభుత్వ హయాంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని  సీఎం అన్నారు. కాంగ్రెస్‌ వచ్చాక 30 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. మరో 35 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామని వివరించారు.  టీజీపీఎస్సీపై నిరుద్యోగులకు ఎలాంటి అనుమానాలు లేవని సీఎం పునరుద్ఘాటించారు. గతంలో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసే పరిస్థితి ఉండేదని, ప్రస్తుత ప్రభుత్వం నోటిఫికేషన్లు వరుసగా ఇస్తోందని చెప్పారు.

మూసీ బాధితులకు 11 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు

హైదరాబాద్ విడుదల చేసిన కాలుష్య జలాలతో నల్లగొండ జిల్లా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, అందుకే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ పనులు చేపడుతున్నామని సీఎం చెప్పారు. మూసీ పరీవాహక  ప్రాంతంలో నివాసం ఉంటున్న 11వేల కుటుంబాలను గుర్తించామని, వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని అన్నారు. పేదల కష్టాలు తనకు తెలుసునని, ఏండ్ల తరబడి అక్కడే ఉంటున్న వాళ్లకు పునరావాసం కల్పిస్తామని సీఎం వివరించారు.