- నాడు పీజేఆర్ కుటుంబంపై పోటీకి నిలబెట్టింది కేసీఆర్ కాదా?
- సవాల్ విసరడం.. పారిపోవడం కేటీఆర్‌కు అలవాటే
- చర్చించాలంటే కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ దగ్గరికి వెళ్లు..5 వేల కోట్ల పనుల జీవోలు చూపిస్తడు
- కిషన్ రెడ్డి.. కేసీఆర్, కేటీఆర్‌ను ఎందుకు బొక్కలో వేయట్లేదో మోదీ, అమిత్ షాను అడుగు
- నువ్వు కేంద్రమంత్రిగా తెలంగాణకు తెచ్చిందేం లేదు
- జూబ్లీహిల్స్‌లో కింగ్ కావడం కాదు.. డిపాజిట్ తెచ్చుకో చాలు
- కిషన్‌రెడ్డి, కేటీఆర్ ఒకే నాణేనికి బొమ్మా బొరుసు లాంటి వాళ్లు అని ఫైర్
హైదరాబాద్, వెలుగు:
సెంటిమెంట్ కావాలో, డెవలప్‌మెంట్ కావాలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఆలోచించుకోవాలని.. ఒకవేళ అభివృద్ధే కావాలనుకుంటే కాంగ్రెస్‌కు ఓటు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సెంటిమెంట్ గురించే మాట్లాడాలంటే 2007లో పీజేఆర్ చనిపోయిన తర్వాత ఆయన కుటుంబాన్ని ఏకగ్రీవం చేయకుండా అడ్డుకున్నది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. ‘‘అప్పటి వరకు ఉన్న మంచి సంప్రదాయాన్ని తొంగలో తొక్కి పీజేఆర్ కుటుంబాన్ని కనీసం కలవకుండా ఇంటి బయటే మూడు గంటలు నిలబెట్టి అవమానించింది కేసీఆర్. ఇయ్యాల ఆయన కొడుకు కేటీఆర్ ఏ రకంగా బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతివ్వాలని అడుగుతున్నాడో సమాధానం చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు.
సెంటిమెంట్‌కే కేటీఆర్ కట్టుబడి ఉంటే ముందుగా ఖైరతాబాద్‌లోని పీజేఆర్ విగ్రహం వద్ద ముక్కు నేలకు రాసి, పీజేఆర్ ఆత్మకు క్షమాపణలు చెప్పి, ఆ తర్వాతే జూబ్లీహిల్స్‌లో ఓట్లు అడగాలన్నారు. బుధవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. షేక్‌పేట డివిజన్‌లో నిర్వహించిన రోడ్ షోలో, అనంతరం పారామౌంట్ కాలనీ, యూసుఫ్‌గూడలో నిర్వహించిన కార్నర్ మీటింగ్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
400 కోట్లతో అభివృద్ధి పనులు..
పదేండ్లు పాలించినోళ్లు చెత్త సమస్యను ఎందుకు పరిష్కరించలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ‘‘బిల్లారంగాలు (కేటీఆర్, హరీశ్) బెంజ్ కారును వదిలి గల్లీల్లో ఆటోల్లో తిరుగుతూ పేరుకుపోయిన చెత్త గురించి, ఇండ్లపై వేలాడుతున్న కరెంట్ వైర్ల గురించి, నిలిచిపోయిన డ్రైనేజీ మురుగు నీటి గురించి మాట్లాడుతున్నారు. పదేండ్లు సీఎంగా కేసీఆర్, మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ పని చేశారు కదా.. దీనికి వాళ్లది బాధ్యత కాదా?’’ అని ప్రశ్నించారు. ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్అభ్యర్థిని మూడుసార్లు ఎమ్మెల్యేగా, బీజేపీ అభ్యర్థిని మూడుసార్లు ఎంపీగా గెలిపించారని.. వాళ్లకు అభివృద్ధి చేసే బాధ్యత లేదా? అని మండిపడ్డారు.
‘‘మేం అధికారంలోకి వచ్చాక ఎవరూ మమ్మల్ని అభివృద్ధి గురించి అడగలేదు. కానీ మంత్రి వివేక్ వెంకటస్వామి నాయకత్వంలో కేవలం మూడు నెలల్లోనే రూ. 400 కోట్లు కేటాయించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్, రోడ్లు వంటి అభివృద్ధి పనులు ప్రారంభించాం. కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం, రూ.500కే సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణం వంటివి ఇచ్చాం. ఇవేవీ కేసీఆర్ చేయలేదు. ఆ ఆలోచన కూడా ఆయనకు రాలేదు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు వచ్చి ఓట్లు వెయ్యిమని అడిగుతున్నరు. వారికి ఆ నైతిక హక్కు ఎక్కడిది?’’ అని ప్రశ్నించారు.
తమ ప్రభుత్వం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 2 లక్షల 39 వేల కుటుంబాలకు 61 వేల రేషన్ కార్డులు ఇచ్చిందని, గృహజ్యోతి, గృహలక్ష్మి, మహాలక్ష్మి వంటి పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత ఈ నియోజకవర్గంలో 4 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. యువకుడైన నవీన్ యాదవ్ ఎప్పడూ అందుబాటులో ఉంటాడని, ఆయన్ను గెలిపించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరారు. తాను కూడా ఎక్కడో ఉండనని, చెంతనే ఉంటానని, ఎప్పుడైనా సరే, ఏ సమస్యపై అయినా సరే తన వద్దకు రావచ్చని చెప్పారు.
అభివృద్ధికి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నడు..
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్‌పై సీఎం రేవంత్ స్పందిస్తూ... ‘‘నాకు సవాల్ విసరడం కాదు.. నువ్వు నా ఇంటికి వచ్చుడు కాదు.. అవినీతి కేసుల్లో కేసీఆర్, కేటీఆర్‌ను ఎందుకు బొక్కలో వేయడం లేదని ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాను అడుగు” అని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి ఎందుకు అడ్డం పడుతున్నాడో కిషన్ రెడ్డి చెప్పాలన్నారు. ‘‘రెండో దశ మెట్రో రైలు రాకుండా, గోదావరి జలాలను రానీయకుండా, మూసీ నదిని అభివృద్ధి చేయకుండా, ట్రిపుల్ ఆర్, రేడియం రోడ్లు రాకుండా ఎందుకు అడ్డం పడుతున్నావ్.
గుజరాత్ లో సబర్మతి, యూపీలో గంగా, ఢిల్లీలో యమునా రివర్ ఫ్రంట్ లు కట్టుకోవచ్చు గానీ.. తెలంగాణలో మూసీ రివర్ ఫ్రంట్ ఎందుకు కట్టవద్దు. బీజేపీ పాలిత రాష్ట్రాలకో నీతి, తెలంగాణకు ఓ నీతా?. తెలంగాణకు అన్యాయం చేసేందుకే నిన్ను ఎంపీగా గెలిపించి కేంద్రమంత్రిని చేసిన్రా?” అని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి సవాల్ చేస్తే భయపడేందుకు తాను, తమ కార్యకర్తలు ఎవరూ చెడ్డీలు తొడుక్కొనిలేరని అన్నారు. నియంతలా నీలిగిన కేసీఆర్‌ను తమ కార్యకర్తలు బండకేసి కొడితే పోయి ఫామ్ హౌస్‌లో పడ్డాడని పేర్కొన్నారు.
‘‘ఈ ఎన్నికల్లో కింగ్ అయితమని కిషన్ రెడ్డి అంటుండు. ముందు నువ్వు ఇక్కడ డిపాజిట్ తెచ్చుకో చాలు.. గెలిచినట్లే” అని ఎద్దేవా చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌ను ఎప్పటిలోగా అరెస్టు చేస్తారో చెప్పిన తర్వాతనే జూబ్లీహిల్స్ లో ఓట్లు అడగాలని కిషన్ రెడ్డిని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి, కేటీఆర్ వేరు కాదని.. నాణేనికి బొమ్మ, బొరుసు వంటి వారని అన్నారు. సినీ కార్మికులు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కేటీఆర్ సినిమా హీరోలతో తిరిగాడు.. కానీ సినీ కార్మికుల సమస్యలను ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు.
జూబ్లీహిల్స్‌లో మంత్రి వివేక్ వెంకటస్వామి నాయకత్వంలో కేవలం మూడు నెలల్లోనే రూ. 400 కోట్లు కేటాయించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్, రోడ్లు వంటి అభివృద్ధి పనులు ప్రారంభించాం. కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం, రూ.500కే సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణం వంటివి ఇచ్చాం. ఇవేవీ కేసీఆర్ చేయలేదు. ఆ ఆలోచన కూడా ఆయనకు రాలేదు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు వచ్చి ఓట్లు వెయ్యాలని అడుగుతున్నరు. వారికి ఆ నైతిక హక్కు ఎక్కడిది? సీఎం రేవంత్ రెడ్డి
పారిపోయింది నువ్వు కాదా?
జూబ్లీహిల్స్ అభివృద్ధిపై చర్చకు రావాలన్న కేటీఆర్ సవాల్‌పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సవాల్ విసరడం.. పారిపోవడం కేటీఆర్‌కు అలవాటేనని విమర్శించారు.‘‘గంజాయి, డ్రగ్స్ పై చర్చిద్దాం రా.. అని సవాల్ విసిరితే పారిపోయింది నువ్వు కాదా.. అసెంబ్లీలో చర్చిద్దామని కోరితే నువ్వు, నీ అయ్య రాకుండా పారిపోయింది నిజం కాదా?’’ అని సీఎం ప్రశ్నించారు. రూ.4 వేల కోట్ల నిధులు విడుదల చేశానని సీఎంగా తాను చెబితే.. ఎక్కడ విడుదలయ్యాయో చెప్పు, చర్చించు రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారని.. కానీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ రూ.5 వేల కోట్ల అభివృద్ధి పనుల జీవోలు చూపగానే కేటీఆర్ పారిపోయిండన్నారు.
ఆయన లాంటి సన్నాసులు సవాల్ విసిరితే కాంగ్రెస్ వాళ్లమెవరం పట్టించుకోమన్నారు. ‘‘ఒకవేళ సవాల్ విసిరేది నిజమే అయితే.. కేటీఆర్ నువ్వు కంటోన్మెంట్‌కు వెళ్లు. అక్కడ మా శ్రీగణేశ్ రూ.5 వేల కోట్ల నిధులకు సంబంధించిన జీవోలు చూపిస్తాడు. రాజీనామాకు సిద్ధంగా ఉండు’’ అని సవాల్ విసిరారు.
