ఇద్దరు చిన్నారుల చికిత్సకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా...

ఇద్దరు చిన్నారుల చికిత్సకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా...
  • రూ. కోట్లలో ట్రీట్ మెంట్ ఖర్చులు భరించేందుకు ప్రభుత్వం హామీ 

బెల్లంపల్లి, వెలుగు: అరుదైన, ప్రాణాంతకమైన వ్యాధితో పోరాడుతున్న ఇద్దరు చిన్నారుల చికిత్సకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ట్రీట్ మెంట్ కు అవసరమైన ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి టౌన్ లోని టేకులబస్తీకి చెందిన దేవిని కల్యాణ్ దాస్, కృష్ణవేణి దంపతుల పిల్లలు సహస్ర(7), మహావీర్(4) అరుదైన స్పైన ల్ మస్క్యులర్ అట్రోఫీ (ఎస్ఎమ్ఏ) వ్యాధితో బాధపడుతున్నారు.  

చికిత్స చేయించాలంటే మెడిసిన్ కు ఒక్కో చిన్నారికి రూ.16 కోట్లు ఖర్చు అవుతుంది. దేశంలో అత్యంత ఖరీదైన చికిత్సల్లో ఇదొకటి. దీంతో కుటుంబం ఆర్థిక స్థోమత లేక దాతల సాయం కోసం ప్రయత్నాలు చేస్తున్నా మద్దతు లభించలేదు. చిన్నారుల ఆరోగ్యస్థితిపై బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. 

శుక్రవారం రాత్రి బాధిత కుటుంబంతో కలిసి ఆయన  సీఎం ఇంటికి వెళ్లి పరిస్థితిని వివరించారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చిన్నారుల చికిత్సకు అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు అందించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.