అరుదైన వ్యాధితో చిన్నారి పోరాటం ..అండగా ఉంటామని సీఎం భరోసా

అరుదైన వ్యాధితో చిన్నారి పోరాటం ..అండగా ఉంటామని సీఎం భరోసా
  • రూ.1.5 కోట్ల ఇంజెక్షన్ ​కోసం ప్రభుత్వ సాయం   

హైదరాబాద్, వెలుగు : అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్‌‌కు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. చిన్నారి చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆర్యాన్ష్ ఎస్‌‌ఎంఏ స్టేజ్-2 వ్యాధితో బాధపడుతున్నాడు. వ్యాధి నయం కావడానికి రూ.1.5 కోట్ల విలువైన ఇంజెక్షన్ అవసరం ఉంది. ఇప్పటికే దాతలు సగం వరకు సహాయం చేయగా, మిగిలిన మొత్తానికి సోషల్ మీడియాలో విజ్ఞప్తులు వెల్లువెత్తాయి.

ఈ విషయాన్ని బిగ్‌‌బాస్ ఫేమ్, సోషల్ మీడియా ఇన్‌‌ఫ్లూయెన్సర్ ఆదిరెడ్డి ఎక్స్‌‌లో పోస్టు చేయగా, అది సీఎం దృష్టికి వెళ్లింది. వెంటనే స్పందించిన రేవంత్ రెడ్డి చిన్నారికి అత్యుత్తమ వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా అవసరమైన సహాయం అందిస్తామన్నారు. అనంతరం సీఎం ఓఎస్డీ శ్రీనివాసులు చర్యలు ప్రారంభించారు. ఆర్యాన్ష్ పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా జీవించాలని సీఎం ఆకాంక్షించారు. చిన్నారికి మంచి భవిష్యత్​ కలగాలని ప్రార్థిస్తున్నామని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.