తెలంగాణ రైజింగ్​కు సహకరించండి..అన్ని రాష్ట్రాల సమగ్రాభివృద్ధితోనే వికసిత్​ భారత్​

తెలంగాణ రైజింగ్​కు సహకరించండి..అన్ని రాష్ట్రాల సమగ్రాభివృద్ధితోనే వికసిత్​ భారత్​
  • నీతి ఆయోగ్​ సమావేశంలో సీఎం రేవంత్​రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు:కేంద్రం చెప్పే ‘వికసిత్ భారత్’ లక్ష్యం అన్ని రాష్ట్రాల సమగ్ర అభివృద్ధితోనే సాధ్యమవుతుందని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. వికసిత్ భారత్​కు అనుగుణంగా ‘తెలంగాణ రైజింగ్ –2047’అనే నినాదంతో తమ ప్రభుత్వం ముందుకెళ్తున్నదని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, దృఢ సంకల్పానికి ఈ రోడ్ మ్యాప్ ప్రతిబింబంగా నిలుస్తుందని తెలిపారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం, భాగస్వామ్యం అవసరమన్నారు. ఈ విషయంలో సహకార సమాఖ్య స్ఫూర్తితో కలిసి పని చేయాలని తాము ఆకాంక్షిస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు.

శనివారం ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో నీతి ఆయోగ్ 10 గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ మీటింగ్​లో పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్​రెడ్డి పాల్గొని.. మొత్తం 20 అంశాలను ప్రస్తా వించారు. రాష్ట్రాభివృద్ధి లక్ష్యాలు, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు వివరించారు. ‘తెలంగాణ రైజింగ్​–2047’కు కేంద్ర సహకారం కావాలని విజ్ఞప్తి చేశారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు మద్దతుగా నిలవడంతో పాటు ఆయా రాష్ట్రాల సామర్థ్యాలను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని కేంద్రానికి తెలిపారు.

అదే సమయంలో వెను కబడిన రాష్ట్రాలకు అవసరమైన ప్రతి సహాయాన్ని అందించాలన్నారు. ‘ఆపరేషన్ సిందూర్’లో పాల్గొన్న సైనికులకు మద్దతు ప్రకటించారు. దేశంలో శాంతి, ఐక్యతను నిలుపుకోవాలన్న సంకల్పానికి తెలంగాణ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. 1971లో పాకిస్తాన్​తో జరిగిన యుద్ధంలో దేశాన్ని చిరస్మరణీయ విజయం దిశగా నాటి ప్రధాని ఇందిరాగాంధీ నడిపారని తెలిపారు. 

రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం

2047 నాటికి దేశాన్ని సూపర్ పవర్ గా, నంబర్ వన్ గా నిలబెట్టాలన్న ప్రధాని మోదీ సంకల్పాన్ని స్వాగతిస్తున్నట్లు సీఎం రేవంత్​ తెలిపారు. ‘వికసిత్​ భారత్’ ప్రణాళికను రూపొందించడం అభినందనీయమన్నారు. అదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రణా ళిక సిద్ధమైందని.. ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో ‘తెలంగాణ రైజింగ్ - 2047’ విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్లు ఆయన ప్రకటించారు. ఇందులో పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, వరల్డ్ క్లాస్ ఇన్​ఫ్రాడెవలప్​మెంట్, పారదర్శక సుపరిపాలన అంశాలు ఉన్నాయని వివరించారు.

2047 నాటికి ఇండస్ట్రీ, ఇన్ ఫ్రా విషయంలో అంతర్జాతీయ నగరాల సరసన హైదరాబాద్​ను నిలబెట్టే భవిష్యత్తు లక్ష్యంతో ‘తెలంగాణ రైజింగ్ – 2047’ విజన్ ఎంచుకున్నట్లు చెప్పారు. ఈ లక్ష్య సాధనలో తొలి అడుగుగా.. ఏడాదిన్నర కాలంలో రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులను సాధిం చామన్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని మూడు జోన్లుగా విభజించి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని వెల్లడించారు. ‘‘రాష్ట్రాన్ని కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ తెలంగాణగా విభజించి వృద్ధి సాధిస్తాం.

కోర్ అర్బన్‌‌‌‌, సెమీ అర్బన్‌‌‌‌, రూర‌‌‌‌ల్ విభాగాల్లో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్, మెట్రో రైల్ సెకండ్ ఫేజ్, ఫ్యూచర్ సిటీ నిర్మాణం, మ్యాన్యుఫ్యాక్చరింగ్​ హబ్, అగ్రిబేస్డ్ ప‌‌‌‌రిశ్రమలు ఏర్పాటు చేస్తాం. సబర్మతీ రివర్ ఫ్రంట్, గంగా పునరుద్ధరణ ప్రాజెక్ట్ మాదిరిగా తెలంగాణలో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉంది. మెట్రో సెకండ్ ఫేజ్, రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులు ప్రస్తుతం డీపీఆర్​ల స్టేజ్​లో ఉన్నాయి. రేడియల్ రోడ్ల నిర్మాణం. తెలంగాణ ప్రతిపాదిత డ్రై పోర్ట్ నుంచి మచిలీపట్నం పోర్టుకు ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణం తెలంగాణ అభివృద్ధిలో కీలకమవుతుంది.

గుడ్ గవర్నెన్స్​తో అత్యున్నత ప్రమాణాలతో పౌర సేవలను అందిస్తాం. ఇందులో భాగంగా బిల్డ్ నౌ యాప్ ద్వారా నిర్మాణ రంగంలో వేగం పెంచాం” అని ఆయన వివ రించారు. హైదరాబాద్‌‌‌‌ను డేటా సెంటర్ హబ్‌‌‌‌గా మార్చాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పారు. వన్ ట్రిలియన్ డాలర్ల స్థూల రాష్ట్ర దేశియోత్పత్తి(జీఎస్డీపీ) సాధించే రాష్ట్రాల జాబితాలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉండాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. జాతీయ స్థాయి అంచనాల ప్రకారం 15 ఏండ్లలో ఈ లక్ష్యం సాధ్యమవుతుందని, అయితే పదేండ్లలోపే ఈ టార్గెట్ రీచ్ కావాలనే సంకల్పంతో ఉన్నామన్నారు.  

యువతకు స్వయం ఉపాధికి రాజీవ్​ యువ వికాసం

తెలంగాణ యువతకు స్వయం ఉపాధి కోసం రాజీవ్​ యువ వికాసం స్కీమ్​ తీసుకువస్తున్నామని.. దీన్ని జూన్​ 2న ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్​రెడ్డి వెల్లడించారు. ‘తెలంగాణ రైజింగ్ –2047’ లో మహిళా సాధికారత కీలకమైందని, 2028 నాటికి రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన వివరించారు. కొడంగల్​లో పారిశ్రామిక పార్కును రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నదని.. జౌళి, వ్యవసాయ -ప్రాసెసింగ్, ఆహార పరిశ్రమలు, ఇంజినీరింగ్, తేలికపాటి తయారీ రంగాలకు సేవలు అందించేలా ఈ పార్క్ ఉంటుందని తెలిపారు.

వరంగల్​లోని కాకతీయ మెగా టెక్స్​టైల్ పార్క్ (కేఎంటీపీ)  ‘‘ఫామ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫారిన్’’ విధానంలో అభివృద్ధి అయిందని చెప్పారు. అయితే కేఎంటీపీని పీఎం మిత్ర స్కీం కింద గ్రీన్​ఫీల్డ్ పార్క్ గా తిరిగి వర్గీకరించాలని రాష్ట్రం ప్రతిపాదనలు పంపిందని ప్రధాని మోదీకి సీఎం రేవంత్​రెడ్డి గుర్తు చేశారు. ‘‘వికసిత భారత్‌‌‌‌ లక్ష్య సాధన మనందరి ఆశయం. అందులో తెలంగాణ కీలక పాత్ర పోషించాలని మా ఆకాంక్ష.  తెలంగాణ సమగ్రాభివృద్ధికి సహకరించండి. వికసిత్​ భారత్ లక్ష్య సాధనలో తెలంగాణ మొదటి వరుసలో ఉంటుందని మాట ఇస్తున్నాను’’ అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.  

మా రెండు బీసీ బిల్లులు కేంద్రం దగ్గర పెండింగ్​

దీర్ఘకాలంగా ఉన్న అసమానతలను తొలగించేందుకు సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల (సీపెక్) సర్వే విజయవంతంగా చేపట్టామని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. ఈ సర్వే తెలంగాణకు ఎక్స్-రే వంటిదని, స్వాతంత్య్ర అనంతర కాలంలో చేపట్టిన అతిపెద్ద సామాజిక గణాంక సర్వే అని చెప్పారు. కుల గణన సర్వే, బీసీలకు 42% రిజర్వేషన్లు, ఎస్సీల వర్గీకరణకు తమ ప్రజా ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయాలు అని పేర్కొన్నారు. విద్యా, ఉపాధి, రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం తమ ప్రభుత్వం తెచ్చిన రెండు బీసీ బిల్లులు కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్​లో ఉన్నాయని, వాటిని వెంటనే క్లియర్​ చేయాలని ప్రధాని మోదీని ఆయన కోరారు.

పాలమూరు– రంగారెడ్డి లిఫ్ట్ స్కీంకు సీడబ్ల్యూసీ పర్మిషన్, ఆర్థిక సాయం అందించాలన్నారు. కుల గణన చేపట్టి దేశానికి తెలంగాణ నమూనాగా నిలిచిందని అన్నారు. దేశవ్యాప్తంగా జన గణనతోపాటు కుల గణన చేపట్టాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సాగతిస్తున్నామని చెప్పారు. తెలంగాణ అనుసరించిన విధానం, అనుభవాన్ని దేశవ్యాప్తంగా చేపట్టే కులగణన విషయంలో కేంద్రంతో పంచుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.