
శుక్రవారం ( జులై 18 ) నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి కొల్లాపూర్ సెగ్మెంట్ లో యంగ్ ఇండియా స్కూల్ కు శంకుస్థాపన చేశారు. రూ. 200 కోట్లతో నిర్మించనున్న ఈ స్కూల్ కు భూమి పూజ చేశారు సీఎం రేవంత్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. కొల్లాపూర్ సెగ్మెంట్ కు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. పాలమూరు జిల్లా అంటే కేసీఆర్ ఫ్యామిలీకి చిన్న చూపు అని అన్నారు. దేశంలో ఏ మట్టి పని చేయాలన్నా పాలమూరు బిడ్డలే ఉంటారని అన్నారు సీఎం రేవంత్. 2009లో కేసీఆర్ వలస వచ్చి ఎంపీగా గెలిచారని.. కేసీఆర్ ను పాలమూరు భుజాన ఎత్తుకొని ఎంపీగా గెలిపించారని అన్నారు సీఎం రేవంత్.
శ్రీశైలం నిర్మాణంలో ఎక్కువగా ఈ ప్రాంత ప్రజలే నిర్వాసితులయ్యారని.. నడిగడ్డ ప్రజలకు తన ఇల్లు అమ్మి ఇల్లు కట్టిస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేసారని అన్నారు సీఎం రేవంత్. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేశారని మండిపడ్డారు సీఎం రేవంత్. 98 జీవో నిర్వాసితులను కేసీఆర్ పట్టించుకోలేదని అన్నారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చుతామని చెప్పి కేసీఆర్ మోసం చేశారని అన్నారు సీఎం రేవంత్.
కేసీఆర్ కరీంనగర్ నుంచి పారిపోయి వస్తే పాలమూరు ప్రజలు గెలిపించారని అన్నారు. ప్రజాపాలన చూస్తుంటే కేసీఆర్ దుఃఖం వస్తుందని అంటున్నారని.. నల్లమల అడవిబిడ్డ సీఎం అయితే కేసీఆర్ కు దుఃఖం వస్తోందని అన్నారు. అన్ని వర్గాల పిల్లలు చదువుకోవాలనే యంగ్ ఇండియా స్కూల్ కట్టిస్తున్నామని అన్నారు సీఎం రేవంత్. పాలమూరు బిడ్డలు బాగుపడుతుంటే కేసీఆర్ ఓర్వలేకపోతున్నారని అన్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ 14 సీట్లు గెలిచి ఉంటే ఇంకో మంత్రి పదవి వచ్చి ఉండేదని అన్నారు. దళిత, ఆదివాసీ బిడ్డలు చదువుకుంటుంటే కేసీఆర్ కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారని అన్నారు సీఎం రేవంత్. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరుకు ఎంతో అన్యాయం జరిగిందని.. కేసీఆర్ హయాంలో కూడా పాలమూరుకు ఒరిగింది ఏమీలేదని అన్నారు. 20 వేల కోట్లు ఖర్చు పెట్టి ఉంటే పాలమూరు పచ్చబడేదని అన్నారు. 2019 లో కాళేశ్వరం కడితే... 2023లో కూలిందని, జూరాల రిపేర్లను కూడా కేసీఆర్ పట్టించుకోలేదని అన్నారు. పదేళ్లు పడావు పడిన ప్రాజెక్టులను తమ ప్రభుత్వం పూర్తి చేస్తోందని అన్నారు సీఎం రేవంత్.