మోదీని రాహుల్ దారిలోకి తెచ్చినం... కులగణనను చూసి దేశమంతా చేస్తామంటున్నారు: సీఎం రేవంత్ రెడ్డి

మోదీని రాహుల్ దారిలోకి తెచ్చినం... కులగణనను చూసి దేశమంతా చేస్తామంటున్నారు: సీఎం రేవంత్ రెడ్డి
  • నల్ల వ్యవసాయ చట్టాలపై పోరాడితే.. రద్దు చేసి క్షమాపణ చెప్పారు
  • కులగణన సర్వేపై మా దగ్గర 88 కోట్ల పేజీల డేటా ఉంది
  • సోనియా రాసిన ప్రశంస లేఖ నాకు నోబెల్​తో సమానం
  • న‌‌‌‌రేంద్ర మోదీ లీగ‌‌‌‌ల్లీ క‌‌‌‌న్వర్టెడ్ బీసీ అని వ్యాఖ్య

న్యూఢిల్లీ, వెలుగు: అగ్రి న‌‌‌‌ల్ల చ‌‌‌‌ట్టాల విష‌‌‌‌యంలో రాహుల్ గాంధీ గ‌‌‌‌ళం విప్పడంతో ప్రధాని నరేంద్ర మోదీ దిగొచ్చి వాటిని ర‌‌‌‌ద్దు చేసి క్షమాప‌‌‌‌ణ చెప్పారని..ఇప్పుడు తమ ప్రభుత్వం కుల‌‌‌‌గ‌‌‌‌ణ‌‌‌‌న చేప‌‌‌‌ట్టడంతో దేశమంతా కులగ‌‌‌‌ణ‌‌‌‌న‌‌‌‌కు కేంద్రం అంగీక‌‌‌‌రించిందని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. రాహుల్​గాంధీ దారిలోకి మోదీని తీసుకొచ్చామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం  ప్రజ‌ల స్వీయ ధ్రువీక‌ర‌ణ ప‌త్రంతో సేక‌రించిన సామాజిక, ఆర్థిక‌, విద్య, ఉపాధి, రాజ‌కీయ కుల స‌ర్వే దేశానికి రోల్‌మోడ‌ల్ అని ఆయన అన్నారు. 

స‌మ‌గ్ర వివ‌రాల‌తో, క్షుణ్నంగా చేప‌ట్టిన స‌ర్వేకు సంబంధించి 88 కోట్ల పేజీల డేటా త‌మ వ‌ద్ద ఉంద‌ని వెల్లడించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లుల ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు గాను కాంగ్రెస్ పార్టీ ఎంపీల‌కు ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీసులో గురువారం పవ‌ర్ పాయింట్ ప్రజంటేష‌న్ ఇచ్చారు. ఇందులో  సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. 

రాహుల్​ హామీ మేరకు..

భార‌త్ జోడో యాత్రలో కులగ‌ణ‌న‌కు రాహుల్ గాంధీ హామీ ఇచ్చార‌ని సీఎం రేవంత్​ గుర్తుచేశారు. తాము అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత 2024 ఫిబ్రవ‌రి 4వ తేదీతో స‌ర్వేను ప్రారంభించి 2025 ఫిబ్రవ‌రి 5 నాటికి ఏడాది కాలంలో ఆ మొత్తాన్ని పూర్తి చేశామ‌ని తెలిపారు.  అందుకే ఫిబ్రవ‌రి 4ను తెలంగాణ‌లో సామాజిక న్యాయ దినోత్సవంగా జ‌రుపుకుంటున్నామ‌ని చెప్పారు. కుల‌గ‌ణ‌న చేప‌ట్టే స‌మ‌యంలో అనేక మంది అగ్రకులాల నాయ‌కులు త‌న వ‌ద్దకు వ‌చ్చి అభ్యంత‌రాలు, సందేహాలు వ్యక్తం చేశార‌ని.. కాల‌నుగుణంగా మార్పుల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని వారికి సూచించిన‌ట్లు సీఎం పేర్కొన్నారు.  

తెలంగాణ రాష్ట్రం కోసం 60 ఏండ్ల పాటు పోరాటాలు జ‌రిగాయ‌ని, అనేక మంది అమ‌రులయ్యార‌ని.. 2009 డిసెంబ‌ర్​ 9న ప్రక‌ట‌న చేయ‌డంతో పాటు తెలంగాణ ఇచ్చి తెలంగాణ ప్రజ‌ల క‌ల‌ను సోనియాగాంధీ నెర‌వేర్చార‌ని ఆయన అన్నారు. అదే తెలంగాణ‌లో కులగ‌ణ‌న‌పై రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని త‌మ ప్రభుత్వం నెర‌వేర్చింద‌ని పేర్కొన్నారు. ‘‘బీజేపీ నాయ‌కులు చెప్పినవి ఏవీ చేయ‌రు. గాంధీ కుటుంబం మాత్రం చెప్పిన ప్రతి మాట‌ను నిలుపుకుంటుంది. కులగ‌ణ‌నకు సంబంధించి మా ప్రభుత్వం 56 ప్రశ్నల‌తో ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తి వ‌ద్దకు వెళ్లి స‌మాచారం సేక‌రించింది. స‌ర్వే స‌మ‌యంలో అందుబాటులో లేనివారికి ఆన్‌లైన్ ద్వారా, టోల్ ఫ్రీ ద్వారా న‌మోదు చేసుకునే అవ‌కాశం క‌ల్పించింది” అని ఆయన తెలిపారు. 

3.9% మంది తమది ఏ కులమూ కాదన్నరు

కులగణన స‌ర్వే ప్రకారం తెలంగాణ‌లో బీసీలు 56.36 శాతం ఉన్నార‌ని సీఎం రేవంత్​ చెప్పారు. స‌ర్వేలో 3.9 శాతం మంది త‌మ‌ది ఏ కులం కాద‌ని ప్రక‌టించుకున్నార‌ని.. ఇది తెలంగాణ‌లో స‌రికొత్త ప‌రిణామ‌మ‌ని తెలిపారు. అదే స‌మ‌యంలో వీరం తా ఎవ‌ర‌ని స‌ర్వే చేసిన వాళ్లు, స్వతంత్ర నిపుణుల బృందం ప‌రిశీలించ‌గా.. వాళ్లంతా ఇంగ్లిష్ విద్యను అభ్యసించిన ఉన్నత విద్యావంతుల‌ని తేలిందని 
పేర్కొన్నారు. స‌ర్వే ప్రకారం తాము స్థానిక సంస్థల్లో బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తూ ఒక బిల్లు, విద్యా, ఉపాధి అవ‌కాశాల్లో 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తూ మ‌రో బిల్లు ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించామ‌ని ఆయన గుర్తుచేశారు. 

బీజేపీ తొలి నుంచి బీసీల‌కు వ్యతిరేకంగా వ్యవ‌హ‌రిస్తున్నదని మండిపడ్డారు. కులగణన చేపట్టబోమని పార్ల మెంట్​లో రాజ్​నాథ్​ సింగ్​ చెప్పారని అన్నారు. ‘‘రాహుల్ గాంధీ హామీ మేర‌కు మా ప్రభుత్వం కులగ‌ణ‌న చేసి బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించే బిల్లుల‌ను అసెంబ్లీలో  ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ఇక వాటిని లోక్‌స‌భ‌, రాజ్యస‌భ‌లో ఆమోదింప‌జేసేందుకు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖ‌ర్గే నాయ‌క‌త్వంలో ఎంపీలు పోరాడాలి. నేను, మా మంత్రులు, శాస‌న‌స‌భ్యుల‌తో జంత‌ర్‌మంత‌ర్​లో పోరాడ్తం. మీరు పార్లమెంట్‌లో పోరాడండి” అని ఆయన సూచించారు.  

ఇది రేర్​ మోడల్​.. త్వరలో వివరిస్త

ప్రధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ లీగ‌ల్లీ క‌న్వర్టెడ్ బీసీ అని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘రైతు న‌ల్ల చ‌ట్టాల విష‌యంలో రాహుల్ గాంధీ గ‌ళం విప్పిన త‌ర్వాత మోదీ వాటిని ర‌ద్దు చేసి క్షమాప‌ణ చెప్పారు. ఇప్పుడు రాహుల్ గాంధీ మాట మేర‌కు తెలంగాణ ప్రభుత్వం కుల‌గ‌ణ‌న చేప‌ట్టిన త‌ర్వాత కేంద్రం కుల గ‌ణ‌న‌కు అంగీక‌రించింది. ఇదంతా రాహుల్ గాంధీ ఘ‌న‌తే” అని పేర్కొన్నారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం చేప‌ట్టిన స‌ర్వే దేశానికి రోల్ మోడ‌ల్​. దీన్ని  రేర్ (ఆర్ ఏఆర్ఈ) మోడ‌ల్ అంటున్నాను. రేర్ అంటే ఏమిటో త్వర‌లో వివ‌రిస్త” అని ఆయన చెప్పారు.

సోనియా లేఖ..నాకు నోబెల్, ఆస్కార్ 

కుల స‌ర్వే, బీసీ బిల్లుల ఆమోదంపై హ‌ర్షం వ్యక్తం చేస్తూ సోనియా గాంధీ స్వహ‌స్తాల‌తో లేఖ రాశార‌ని.. ఆ లేఖ త‌న‌కు నోబెల్‌, ఆస్కార్‌, లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్‌ అవార్డులాంటివని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.  ఈ స్థానంలో ఉన్నా లేకున్నా ఆ లేఖ త‌న‌కు ప్రత్యేకంగా మిగిలిపోతుంద‌ని ఆయన పేర్కొన్నారు.