ఆడబిడ్డలకు సర్కారు సారె... కోటి మంది మహిళలను ‘కోటీశ్వరులను’ చేయడమే లక్ష్యం: సీఎం రేవంత్ 

ఆడబిడ్డలకు సర్కారు సారె... కోటి మంది మహిళలను ‘కోటీశ్వరులను’ చేయడమే లక్ష్యం: సీఎం రేవంత్ 
  • ఆత్మగౌరవంతో కూడిన నాణ్యమైన చీరలు అందిస్తున్నం
  • డిసెంబర్ ​9 కల్లాపల్లెల్లో ప్రతి ఆడబిడ్డఇంటికీ చీరలు 
  • మార్చి 1 నుంచి 8 మధ్య పట్టణాల్లో పంపిణీ
  • మహిళా అధికారులు, మహిళా ప్రజాప్రతినిధులు కూడా ఇందిరమ్మ చీరలు వాడాలి.. వాళ్లే బ్రాండ్ అంబాసిడర్లు
  • అదానీ, అంబానీ చేసేసోలార్ వ్యాపారాన్ని మహిళా సంఘాలకు అప్పగిస్తున్నట్లు వెల్లడి
  • ఘనంగా ఇందిరా గాంధీ 108వ జయంతి.. ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం

హైదరాబాద్ , వెలుగు: తెలంగాణ ఆడబిడ్డలకు ‘పుట్టింటి సారె’ మాదిరిగా ఆత్మ గౌరవంతో కూడిన నాణ్యమైన చీరలు అందిస్తున్నామని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. ‘‘గత పదేండ్లలో పాలకులు ఇచ్చిన చీరలు కట్టుకుంటే పొలాల్లో పిట్టలు బెదిరిపోయే పరిస్థితి ఉండేది. ఆ చీరల నాణ్యత అంత దారుణంగా ఉండేది. అది మా అక్కాచెల్లెళ్లకు అవమానం. కానీ, ఇందిరమ్మ రాజ్యంలో.. కాంగ్రెస్ ప్రజా పాలనలో మా ఆడబిడ్డలకు పుట్టింటి నుంచి అన్నదమ్ములు పెట్టే ‘సారె’ లాగా.. ఎంతో ఆత్మగౌరవంతో కూడిన నాణ్యమైన చీరలను అందిస్తున్నాం” అని ఆయన పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్​లోని నెక్లెస్ రోడ్‌‌‌‌‌‌‌‌లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 108వ జయంతి వేడుకలు జరిగాయి. ఇందులో సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా తమ ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని చెప్పారు. ‘‘దేశానికి మహిళా రాష్ట్రపతిని, మహిళా ప్రధానిని, మహిళా లోక్‌సభ స్పీకర్‌ను అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. 

సోనియా గాంధీ నేతృత్వంలో  మన రాష్ట్రంలో సీతక్క, సురేఖమ్మను మంత్రులను చేశాం. రేణుక చౌదరిని రాజ్యసభకు పంపాం. ఇప్పుడు మహిళల ఆత్మగౌరవం పెంచే దిశగా.. 2034 నాటికి తెలంగాణలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే సంకల్పంగా పెట్టుకున్నాం. ఈ ప్రయత్నాన్ని నిండు మనసుతో ఆశీర్వదించండి’’ అని సీఎం రేవంత్​ రెడ్డి కోరారు.

మహిళా అధికారులూ.. మీరే బ్రాండ్ అంబాసిడర్లు

‘‘మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు, మహిళా మేయర్లు, మహిళా కార్పొరేషన్ చైర్‌పర్సన్లు మాత్రమే కాదు.. మహిళా ఐఏఎస్, మహిళా ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఇందిరమ్మ చీరలు వాడాలి. ప్రభుత్వం ఇచ్చిన చీరను ఆత్మగౌరవంతో కట్టుకుని మీరే బ్రాండ్ అంబా సిడర్లుగా నిలవాలి. సీతక్క ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేస్తున్నారు. అందరూ చీర కట్టుకుని ఫొటోలు పోస్ట్ చేయాలి. మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలకు చీరలు పంపించి, ఆ డబ్బులను వారి నెల జీతాల నుంచి కట్ చేయాలని రెవెన్యూ మంత్రి సలహా ఇచ్చారు. అది బాగుంది. శిల్పారామంలో స్టాల్ పెట్టి, మనం ప్యాకింగ్ చేసి పంపిద్దాం. బిల్లులు వసూలు చేద్దాం’’ అని సీఎం చమత్కరించారు. 

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని.. అందుకే ఆర్టీసీలో ఉచిత ప్రయాణమే కాదు, 1000 బస్సులకు మహిళలను ఓనర్లుగా చేశామని తెలిపారు. ‘‘గతంలో సోలార్ పవర్ ప్లాంట్ల వ్యాపారం కేవలం అదానీ, అంబానీలే చేసేవారు. కానీ, ఇప్పుడు ఆ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశాన్ని మహిళా సంఘాలకు కల్పిస్తున్నాం. దీని ద్వారా వ్యాపారంలో ఆడబిడ్డలు రాణించాలి. డిప్యూటీ సీఎం భట్టి దీనిపై ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. మహిళా సంఘాలకు రూ. 27 వేల కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాల తో పాటు జీరో వడ్డీ రుణాలు, పెట్రోల్ బంకుల నిర్వహణ బాధ్యతలు ఇచ్చాం’’ అని  ఆయన వివరించారు.  

పాకిస్తాన్‌ను గడగడలాడించిన ఉక్కు మహిళ ఇందిరమ్మ

‘‘లాల్ బహదూర్ శాస్త్రి అకాల మరణంతో దేశంలో నాయకత్వ శూన్యత ఏర్పడినప్పుడు.. ఆ బాధ్యతను భుజాన వేసుకుని దేశ గతిని మార్చిన గొప్ప నాయకురాలు ఇందిరా గాంధీ. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలను కేవలం పాలితులుగానే కాకుండా పాలకులుగా మార్చిన ఘనత ఆమెదే. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కలలను నిజం చేస్తూ చివరి రక్తపు బొట్టు వరకు దేశం కోసం పోరాడారు. నాడు మన దాయాది దేశం పాకిస్తాన్ కాలు దువ్వితే.. ఆ దేశాన్ని యుద్ధంలో ఓడించడమే కాదు, నిట్టనిలువునా చీల్చి బంగ్లాదేశ్‌ను ఏర్పాటు చేసిన ఉక్కు మహిళ ఇందిరమ్మ. 

90 వేల మంది పాక్ సైనికులను భారతమాత కాళ్ల దగ్గర తలవంచేలా చేసి లొంగదీసుకున్న గొప్ప నాయకురాలు ఆమె.  అటు చైనా గానీ, ఇటు అమెరికా గానీ దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నిస్తే సహించేది లేదని ప్రపంచానికి చాటిచెప్పిన ధీరవనిత ఆమె’’ అని సీఎం కొనియాడారు. నాడు రాజభరణాలను రద్దు చేసి, బ్యాంకులను జాతీయం చేసి పేదలకు చేరువ చేశారని తెలిపారు. ‘‘అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తెచ్చి భూస్వాముల నుంచి భూములను దళితులకు, గిరిజనులకు పంచి వారిని భూ యజమానులను చేశారు. ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు కట్టించి ఇచ్చారు. 

అలాంటి గొప్ప నాయకురాలు ఇందిరమ్మ స్ఫూర్తితోనే సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. వైఎస్సార్​ హయాంలో ఆకాశమే హద్దుగా 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టించాం. కానీ, దురదృష్టవశాత్తు గత పదేండ్లు కాంగ్రెస్ లేని పాలనలో డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని ఆశచూపి పేదలను మోసం చేశారు. ఆ ఆశలు అడియాశలయ్యాయి. కానీ, మా ప్రభుత్వం రాగానే మొదటి విడతగా రూ. 22,500 కోట్లతో 4.5 లక్షల ఇండ్లను మంజూరు చేశాం. ఒక్కో ఇంటికి రూ. 5 లక్షలు ఇస్తున్నాం’’ అని సీఎం రేవంత్​ పేర్కొన్నారు. 

ఆడబిడ్డల ఇంటికి చీరలు

‘‘కోటి మంది మహిళలకు చీరలు ఇవ్వాలని ఆరు నెలల కిందట్నే ఆర్డర్ ఇచ్చాం. ఉత్పత్తికి సమయం పట్టింది కాబట్టి ఇప్పటి వరకు 65 లక్షల చీరలు వచ్చాయి. అందుకే రెండు విడతలుగా పంపిణీ చేస్తున్నాం’’ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నవంబర్ 19 నుంచి డిసెంబర్ 9 (సోనియా గాంధీ జన్మదినం) లోపు తండాలు, గూడేలు, పల్లెల్లోని ప్రతి ఆడబిడ్డ ఇంటికి 65 లక్షల చీరలు చేరుతాయి. 

ఈ బాధ్యత సీతక్క, కలెక్టర్లు తీసుకుంటారని పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్, మున్సిపాలిటీల్లోని మహిళలకు మిగిలిన 35 లక్షల చీరలను మార్చి 1 నుంచి మార్చి 8 (అంతర్జాతీయ మహిళా దినోత్సవం) మధ్య పంపిణీ చేస్తామని తెలిపారు. ‘‘గ్రామంలో ఇచ్చారు, పట్నంలో ఇవ్వలేదని బాధపడొద్దు. సీతక్క ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి చీర చేర్చే బాధ్యత మాది’’ అని ఆయన చెప్పారు.