
న్యూఢిల్లీ: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై మరోసారి విరుచుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పిస్తే.. ఆ రెండు పార్టీలు మోకాలడ్డేస్తున్నాయని ఫైర్ అయ్యారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో బుధవారం (ఆగస్ట్ 6) ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇస్తామంటే.. గుజరాత్ వాళ్లకు వచ్చిన కడుపునొప్పేంటని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో మేం బిల్లులు ఆమోదిస్తే.. మా బిల్లును తుంగలో తొక్కే హక్కు మీకు ఎవరిచ్చారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో మోడీకి ఆలోచన లేదు సరే.. ఆయన మోచేతి నీళ్లు తాగే తెలంగాణ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాం చందర్ రావులకు ఏమైందని ప్రశ్నించారు. బీజేపీ వాళ్లు మోడీ మోచేతి నీళ్లు తాగొచ్చు. మరీ బీఆర్ఎస్కు ఏమైంది.. మీరు కూడా మోడీ చెప్పులు మోస్తారా..? అని ప్రశ్నించారు.
బీసీ పేరుతో కాంగ్రెస్ డ్రామాలేస్తుందని డ్రామారావు (కేటీఆర్) అంటుండు. కానీ డ్రామాలు ఆడేదే కల్వకుంట్ల ఫ్యామిలీ అని తెలంగాణ రాష్ట్రమంతా తెలుసని కౌంటర్ ఇచ్చారు. డ్రామా మీ కుటుంబంలో ఉంటే.. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే చిత్తశుద్ధి మాకుందన్నారు. మీ ఇంట్లనే పరిస్థితి సక్కగ లేదు. ఒకరు బీసీలకు మద్ధతు అంటారు.. ఇంకొకాయన అసలు మాట్లాడరు.. మరొకరు మధ్యరకం అంటారు.. అటు ఇటు గానీ వాళ్లు నా గురించి మాట్లాతారా అని ఫైర్ అయ్యారు.
వంద మీటర్ల గోతి తొవ్వి పాతిపెట్టినా మీకు బుద్ధి రాలేదని బీఆర్ఎస్ను కడిగిపారేశారు. తెలంగాణలో రిజర్వేషన్లకు అడ్డుపడే కేసీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాం చందర్ రావుతో కాదు మా పోటీ.. మన పోటీ ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వంతో అని పునరుద్ఘాటించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపకపోతే.. ప్రధాని మోడీని గద్దె దించి.. రాహల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకుని బీసీ రిజర్వేషన్లు సాధించుకుంటామన్నారు. తెలంగాణ ప్రజల శక్తిని తక్కువ అంచనా వేస్తున్నారని హెచ్చరించారు.