
- ఎన్‌పీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్‌కు అదనంగా ఏర్పాటు చేయండి: సీఎం రేవంత్ రెడ్డి
- దీనికి ఉచిత విద్యుత్ పథకాలను అప్పగించాలి
- డిస్కమ్‌లు రుణభారాన్ని తగ్గించుకోవాలి
- 10 శాతంపైన ఉన్న వడ్డీలు 6% వరకు రీస్ట్రక్చర్‌కు చర్యలు
- అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లలో సోలార్ కరెంట్
- సెక్రటేరియెట్‌లోనూ సోలార్ రూఫ్ టాప్‌తో పార్కింగ్
- విద్యుత్‌శాఖపై డిప్యూటీ సీఎం భట్టితో కలిసి రివ్యూ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని ప్రక్షాళన చేసేందుకు అవసరమైన సంస్కరణలను తక్షణమే అమలు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందులో భాగంగా కొత్తగా మరో డిస్కమ్‌ను ఏర్పాటు చేయాలని, అందుకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సంస్కరణతో డిస్కమ్‌ల పనితీరు మెరుగుపడుతుందని, జాతీయ స్థాయిలో వాటి రేటింగ్ పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్‌పీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్‌తో పాటు కొత్తగా ఏర్పాటు చేసే డిస్కమ్‌కు అగ్రికల్చర్ ఫ్రీ కరెంట్, గృహ జ్యోతి పథకం కింద అందించే 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్, పాఠశాలలు, కళాశాలల ఉచిత కరెంట్ పథకాలను అప్పగించాలని సూచించారు.
ఈ కొత్త డిస్కమ్ పరిధి రాష్ట్రమంతా ఒకే యూనిట్‌గా ఉండాలని స్పష్టం చేశారు. ఎన్‌పీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్‌లు వాణిజ్య విద్యుత్ కార్యకలాపాలను చూసుకుంటాయని, కొత్త డిస్కమ్‌ను ప్రభుత్వం సబ్సిడీపై అందించే విద్యుత్ నిర్వహణకు వీలుగా విభజించాలని సూచించారు. విద్యుత్ శాఖపై జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. డిస్కమ్‌ల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి సంస్కరణలు తప్పనిసరి అని స్పష్టం చేశారు. డిస్కమ్‌ల పునర్‌వ్యవస్థీకరణతోపాటు విద్యుత్ సంస్థలపై ఉన్న రుణ భారాన్ని తగ్గించాలని ఆయన అధికారులకు సూచించారు. రుణాలపై వడ్డీ భారం తగ్గించేందుకు వెంటనే ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. 10 శాతం వరకు వడ్డీపై తీసుకున్న రుణాలతో డిస్కమ్‌లు ఇబ్బందులు పడుతున్నాయని, ఈ రుణాలను6 శాతం వరకు తక్కువ వడ్డీ ఉండేలా రీ-స్ట్రక్చర్ చేసుకోవాలని ఆదేశించారు.
సెక్రటేరియెట్‌లో సోలార్ రూఫ్‌టాప్ షెడ్స్
సెక్రటేరియెట్‌కు సోలార్ విద్యుత్ అందించాలని, వెంటనే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఆర్‌అండ్ బీ, విద్యుత్ శాఖ సమన్వయంతో తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఎండాకాలంలో సెక్రటేరియెట్‌లో వెహికల్స్ పార్కింగ్ ఇబ్బందిగా మారిన నేపథ్యంలో సోలార్ రూఫ్ టాప్ షెడ్స్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. వాహనాల పార్కింగ్‌కు అనువుగా ఉండేలా సోలార్ రూఫ్ టాప్‌ను డిజైన్ చేయాలని ఆదేశించారు. విద్యుత్ అవసరాలతో పాటు పార్కింగ్ ఇబ్బందులు తొలగిపోయేలా సెక్రటేరియెట్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్, సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, టీజీ జెన్కో సీఎండీ హరీశ్, టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్, టీజీ ఎన్ పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, సింగరేణి సీఎండీ బలరాం, టీజీ రెడ్కో ఎండీ అనిలా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సోలార్ విద్యుత్ వినియోగం పెంపు
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలతోపాటు ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ విద్యుత్ వినియోగాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని, జిల్లాలవారీగా అనువైన భవనాలను గుర్తించే బాధ్యతను ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించాలని ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.