
- ఆసియాలోనే అతిపెద్దగిరిజన జాతరపై చిన్నచూపా?
- జాతీయ పండుగగా గుర్తింపుతోపాటు నిధులివ్వాలి
- కిషన్‍రెడ్డి, బండి సంజయ్‍కి అమ్మల ఆశీర్వాదంతోనే ఆ హోదా
- నిధులు ఇవ్వకుంటే నేనేమనను.. ఆ తల్లులే చూసుకుంటరు
- మేడారం అభివృద్ధిని గత బీఆర్‍ఎస్ పాలకులు పట్టించుకోలే
- నిధులడిగితే దానం, ధర్మం చేసినట్లు వ్యవహరించిన్రు
- 100 రోజుల్లో మేడారం జాతర అభివృద్ధి పనులు పూర్తి చేస్తం
- వెయ్యేండ్లు నిలిచేలా రాతితోనే మేడారం పునర్నిర్మాణ పనులు
- మంత్రులు సీతక్క, సురేఖ, పొంగులేటి, అడ్లూరితో కలిసి
- మేడారంలో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న సీఎం
- జాతర అభివృద్ధి పనులపై రివ్యూ
ములుగు / వరంగల్, వెలుగు: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా గుర్తింపు ఇవ్వాలని, కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. కుంభమేళాకు రూ.వేల కోట్లు ఇస్తున్న కేంద్రం.. ఆదివాసీల కుంభమేళా ‘మేడారం జాతర’కు మాత్రం ఎందుకు నిధులు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరపై చిన్నచూపా? అని అడిగారు. కుంభమేళా, యూపీలోని అయోధ్య మాత్రమే దేవాలయాలు కాదనే విషయాన్ని మోదీ సర్కారు మరువొద్దన్నారు. మంగళవారం మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో కలిసి ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క–-సారలమ్మ అమ్మవార్ల గద్దెలను సీఎం దర్శించుకుని, తులాభారంతో మొక్కులు తీర్చుకున్నారు. 2026 సమ్మక్క–సారక్క జాతరకు సంబంధించి రూ.150 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం తల్లుల గద్దెలు, ఆలయ పరిసరాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. తర్వాత ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులపై ఆలయ పూజారులు, ఆదివాసీ సంఘాలు, అధికారులతో కలిసి రివ్యూ నిర్వహించారు. పూజారులు, ఆదివాసీ సంఘాల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, జాతర విజయవంతానికి అవసరమైన అంశాలపై అధికారులకు ఆదేశాలిచ్చారు. అనంతరం మేడా రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వట్లే..
ఆదివాసీ కుంభమేళాగా భావించే మేడారం జాతరకు కేంద్ర సర్కారు ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదని.. జాతీయ పండుగ హోదా ఇచ్చే మనసు రావట్లేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రులు కిషన్‍రెడ్డి, బండి సంజయ్‌కి తల్లుల ఆశీర్వాదంతోనే ఆ హోదా వచ్చిందని, నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారన్నారు. ‘‘తెలంగాణలోని ములుగు అడవుల్లో సమ్మక్క–సారక్కలది ఓ గొప్ప దేవాలయం. వారికి గొప్ప చరిత్ర ఉంది. పోరాట పటిమతో పౌరుషానికి మారుపేరుగా రాచరికంపై తిరుగుబాటుచేసి జెండా ఎగురవేశారు. అలాంటి సమ్మక్క–సారక్కల జాతరకు జాతీయహోదాతో పాటు కోట్లాది రూపాయల నిధులు ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే మీ ఇష్టం. నేను ఏం అనను.. కానీ సమ్మక్కసారక్క అన్ని గమనిస్తున్నారనే విషయం మరవొద్దు” అని వ్యాఖ్యానించారు.
సిమెంట్‍తో పనులు వద్దని చెప్పినం..
రాబోయే వెయ్యేండ్లపాటు చెక్కుచెదరకుండా ఉండేలా రాతితోనే మేడారం పునర్నిర్మాణ పనులు చేయనున్నట్లు సీఎం రేవంత్‍రెడ్డి తెలిపారు. అధికారులు మొదట్లో సిమెంట్‍తో పనులుచేసే ప్రతిపాదనలు తీసుకొచ్చారని, కానీ సిమెంట్ కట్టడాలు మహా అయితే వందేండ్లు ఉంటాయనే ఉద్దేశంతో రాతి పనులకే శ్రీకారం చుట్టామన్నారు. ఇదే ములుగు జిల్లానుంచి యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయమే దీనికి నిదర్శనమన్నారు. వేలాది ఏండ్లు గడిచినా నాటి దర్పం నిటారుగా నిలబడిందని చెప్పారు. సమ్మక్క–సారక్కల గద్దెలు, ఆలయ కట్టడాల నిర్మాణం సైతం ఆదర్శంగా నిలిచేలా ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు.
100 రోజులు రాత్రింబవళ్లు పనిచేయాలి
వచ్చే జనవరిలో జాతర నేపథ్యంలో అభివృద్ధి పను లను రాబోయే 100 రోజుల్లో పూర్తి చేసేలా ప్రభుత్వం టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కేవలం పొద్దటి సమయాల్లోనే కాకుండా రాత్రింబవళ్లు నిర్విరామంగా పని చేయాల్సిందేనని అధికారులను ఆదేశించారు. పనులు సకాలంలో పూర్తిచేయడానికి ఆదివాసీ పూజారులు, వారి కుటుంబ సభ్యులు, స్థానికులు భాగస్వాములు కావాలని సూచించారు. జంపన్నవాగులో నీటి నిల్వ ఉండేలా చెక్ డ్యామ్‍ల నిర్మాణం, అభివృద్ధికి ఆ శాఖ అధికారులు ప్లాన్ చేసుకోవాలని ఆదేశించారు. మహా జాతరకు లక్షలాది మంది భక్తుల రాకపోకలకు అవసరమైన రహదారుల నిర్మాణం త్వరగా చేపట్టాలని సూచించారు. నెలకు 4 సార్లు ఇక్కడ పర్యటించి, పనులను పర్యవేక్షించాలని ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‍రెడ్డికి చెప్పినట్లు సీఎం పేర్కొన్నారు.
అయ్యప్ప మాల మాదిరి.. అధికారులు, సాంకేతిక నిపుణులు సమ్మక్క–సారక్క మాల వేసుకున్నట్లు భావించి పనులను సకాలంలో దీక్షగా పూర్తి చేయాలని సూచించారు. అభివృద్ధికి ప్రత్యేకంగా ఓ డెడికేటెడ్ టీంను ఏర్పాటు చేయాలని ఆధికారులను ఆదేశించామన్నారు. మేడారం జాతరకు తాను మళ్లీ వస్తానని, జాతరను గొప్పగా చేసుకుందామని చెప్పారు. ఈ సభలో ఎంపీలు బలరాం నాయక్, కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందరరెడ్డి, కేఆర్. నాగరాజు, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‍రెడ్డి, గండ్ర సత్యనారాయణ, ఆయిల్, సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
గత బీఆర్‍ఎస్ పాలకులు పట్టించుకోలే
గత బీఆర్‍ఎస్ పాలకులు మేడారం జాతర అభివృద్ధిని పట్టించుకోలేదని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. పనుల కోసం కావాల్సిన నిధులు అడిగితే.. దానం, ధర్మం చేసినట్లు వ్యవహరించారన్నారు. మేడారం అభివృద్ధి చేసుకోవడమంటే కేవలం బాధ్యత కాదని, బాధ్యతతో కూడిన భావోద్వేగమని చెప్పారు. తాను 17,18 ఏండ్లుగా వరుసగా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నానని, అభివృద్ధిపై ప్రతిసారి అప్పటి పాలకులను నిధులు అడగడమే సరిపోయిందన్నారు. రాష్ట్రానికి పట్టిన చీడ, పీడను వదిలించేందుకు 2023 ఫిబ్రవరి 6న మేడారం సమ్మక్క –సారక్క తల్లుల ఆశీర్వదంతో పాదయాత్ర మొదలుపెట్టినట్లు తెలిపారు. సంకల్ప బలం ఉంటే ఏనాడూ ఓడిపోలేదని చెబుతూ తల్లుల దీవెనలతో ప్రజాపాలన నిర్వహిస్తున్నామన్నారు.
ఆదివాసీలు ఈ దేశానికి మూలవాసులని, తమ ప్రభుత్వం ఏ సంక్షేమ కార్యక్రమం తీసుకున్నా ఆదివాసీ, గిరిజనుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొనే ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 4 లక్షల 50 వేల మంది పేదలకు ఇండ్లు అందించాక.. ఐటీడీఏ పరిధిలో ఆదివాసీలకు అదనంగా 22 వేల ఇండ్లిచ్చినట్లు తెలిపారు. ఆదివాసీలు, గిరిజనులకు దశాబ్దాలుగా అన్యాయం జరిగిందనే ఉద్దేశంతోనే తాము ప్రత్యేక వాటా, కోటా ఇవ్వాలని భావించినట్లు వెల్లడించారు. తమ ప్రభుత్వ కేబినెట్‌లో వారికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ప్రతి మనిషికి జననం, మరణం సహజమని అన్నారు. తనతోపాటు సీతక్కకు సమ్మక్క తల్లుల గద్దెలు, ప్రాంగణ పునర్నిర్మాణం చేసుకునే అదృష్టం రావడం ఈ జన్మలో దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల సమస్యలున్నా.. మేడారం జాతర అభివృద్ధికి మాత్రం ఏదోవిధంగా నిధులు తప్పకుండా ఇస్తామని మాటిచ్చారు.