2034 నాటికల్లా నయా హైదరాబాద్ : సీఎం రేవంత్

2034 నాటికల్లా నయా  హైదరాబాద్ : సీఎం రేవంత్
  • ప్రపంచమంతా నగరం వైపు చూసేలా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్​
  • గోదావరి జలాలతో 365 రోజులూ మూసీలో నీరుండేలా రివర్ ఫ్రంట్ 
  • మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ నిర్మాణం కొంతమందికి ఇష్టం లేదు
  • హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకునే దొంగలకు ప్రజలే అడ్డుకట్ట వేయాలి
  • మధ్యతరగతి ప్రజల కోసం నగరంలో రాజీవ్ స్వగృహ ఇండ్లు ఇస్తామని ప్రకటన
  • గచ్చిబౌలిలో ఇంటిగ్రేటెడ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు శంకుస్థాపన

హైదరాబాద్, వెలుగు: ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా నగరాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ఈ అభివృద్ధిని అడ్డుకునే దొంగలకు ప్రజలే అడ్డుకట్ట వేయాలని పేర్కొన్నారు. మధ్యతరగతి ప్రజల కోసం నగరంలో రాజీవ్ స్వగృహ భవనాల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. బుధవారం గచ్చిబౌలిలో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కార్యాలయం, ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సీఎం రేవంత్​రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ ‘‘ప్రపంచానికే ఆదర్శంగా నిలబడిన హైదరాబాద్ నగరాన్ని ఒక విశ్వ నగరంగా తీర్చిదిద్దుకుందామా? ఇప్పుడు మూసీ ప్రక్షాళన కొంతమందికి ఇష్టం లేదు.. ఫ్యూచర్ సిటీ నిర్మాణం వాళ్లకు పసందు కావట్లేదు. ఆనాడు హైటెక్ సిటీ కట్టినప్పుడు, ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం చేపట్టినప్పుడు ఇట్లనే అవహేళన చేసిన్రు. సబర్మతి, గంగా, యమునా నదులను ప్రక్షాళన చేయొచ్చు కానీ, హైదరాబాద్ గౌరవాన్ని పెంచే మూసీ నదిని ఎందుకు ప్రక్షాళన చేయకూడదు? మూసీ నది మురికిలో బతకాలని ఎవరైనా పేదవాడు కోరుకుంటడా? వాళ్లందరికీ ఇండ్లు కట్టిద్దాం.. వాళ్ల పిల్లలకు మంచి చదువులు ఇద్దాం.. మంచి అవకాశాలు కల్పిద్దాం” అని తెలిపారు. తెలంగాణ రైజింగ్ –2047 అనే విధానపరమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ‘‘2034 నాటికి ప్రపంచమంతా హైదరాబాద్ నగరాన్ని చూడడానికి రావాలి. ఎవరైనా ఈ అభివృద్ధిని అడ్డుకుంటే.. అడ్డుకునేవాళ్లకు అడ్డుకట్టేయాల్సిన బాధ్యత మీరే తీసుకోవాలి. ఎందుకంటే నేను పనిలో నిమగ్నమై ఉంటా.. అట్లాంటి దొంగల్ని పట్టుకోవాలంటే నాకు కొంత సమయం సరిపోతలేదు. ఆ దొంగల్ని పట్టుకునే పని మీరే చేయాలి” అని ప్రజలకు సీఎం రేవంత్​రెడ్డి సూచించారు. 

నగరంలో రాజీవ్​ స్వగృహ ఇండ్లు ఇస్తం

ఆనాడు రాజీవ్ స్వగృహ ద్వారా మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇంటి కలను నిజం చేశామని.. కానీ మధ్యలో 15 ఏండ్లు ఆగిపోయిందని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆకాశంలో కనిపించింది తప్ప, ఎవరికీ అందుబాటులోకి రాలేదు. అందుకే ప్రక్షాళనతో పాటు మధ్యతరగతి సగటు జీవికి మళ్లీ రాజీవ్ స్వగృహ ద్వారా ఇండ్లు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నం. మా మంత్రులు శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబుకు నేను సూచన చేస్తున్న.. పేదల కోసం స్థలాలు వెతకండి. వాళ్లకు అందుబాటు ధరలకు ఇంటి స్థలాలు ఇవ్వడమే కాదు.. ఇల్లు కట్టుకోవడానికి అవసరమైన సహాయాన్ని అందించాలి’’ అని పేర్కొన్నారు. 

‘‘అమెరికాలోని సిలికాన్​ వ్యాలీని కూడా మన ఐటీ నిపుణులు శాసిస్తున్నారు. ప్రపంచ దిగ్గజ కంపెనీలకు సీఈఓలుగా సత్య నాదెళ్ల లాంటి మన యువకులు మారారు. ఇది మనందరికీ గర్వకారణం. మన ఐటీ నిపుణులు ఒకవేళ పని చేయడం ఆపేస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థనే దెబ్బతినే స్థాయికి ఈరోజు మనం ఎదిగాం” అని ఆయన తెలిపారు.  ‘‘గోదావరి జలాలను 20 టీఎంసీలు తీసుకొచ్చి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌‌లో ప్రవహింపజేసి, 365 రోజులు మూసీలో నీళ్లు ఉండేటట్టుగా రివర్ ఫ్రంట్ డెవలప్ చేస్తం. ఆ ప్రాంతంలో నైట్ ఎకానమీని ప్రారంభిస్తం. నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు ఇస్తం” అని సీఎం రేవంత్​ వెల్లడించారు.  

సబ్​ రిజిస్ట్రార్​ ఆఫీసుల్లో మెరుగైన సేవలు అందాలి

ప్రభుత్వ కార్యాలయాల తీరు మారాలని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. ‘‘కోర్ అర్బన్ రీజియన్‌‌లో 39 సబ్- రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. కానీ కూర్చోవడానికి, నిలబడడానికి జాగ ఉండదు. ఇది మార్చాలి. అందుకే ఇక్కడ అంతర్జాతీయ ప్రమాణ స్థాయిలో ఒక ఫైవ్ స్టార్ హోటల్, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్‌‌పోర్ట్ స్థాయిలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాన్ని నిర్మిస్తున్నం” అని తెలిపారు. 2026  జూన్ 2 నాటికి ఈ ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలను కంప్లీట్ చేసి రాష్ట్ర అవతరణ దినోత్సవం లోపల డెడికేట్​ చేయాలని అధికారులను ఆదేశించారు. సబ్‌‌ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు సాంకేతికతను ఉపయోగిస్తూ కొత్త విధానాలను తీసుకువస్తున్నట్లు తెలిపారు. పాస్‌‌పోర్ట్  ఆఫీసులు, తిరుపతి దేవస్థానం మాదిరిగానే ఆన్‌‌లైన్ స్లాట్ బుకింగ్ విధానాన్ని ఎనిమిది నెలల్లో అందుబాటులోకి తీసుకొస్తామని  వెల్లడించారు. 

ఈ మార్పులు ప్రజల గౌరవాన్ని పెంచుతాయని, ప్రభుత్వ ఆదాయాన్ని కూడా వృద్ధి చేస్తాయని సీఎం పేర్కొన్నారు. నూతన దంపతులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చినప్పుడు, అత్తగారి ఇంటికి వచ్చినట్టుగా ఒక మంచి వాతావరణం ఉండాలని, కుటుంబంతో కలిసి ఫొటో దిగి రిజిస్ట్రేషన్ చేసుకొని వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. మంచి వసతులు కల్పిస్తే, డాక్యుమెంట్లు వేగంగా రిజిస్టర్ చేస్తే సంవత్సరానికి  19 లక్షల డాక్యుమెంట్ల కన్నా ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరుగుతాయని, విదేశాల నుంచి వచ్చే కొంతమంది సమయం దొరక్క రిజిస్ట్రేషన్లు చేసుకోకుండానే తిరిగి వెళ్తున్నారని తెలిపారు. హైదరాబాద్ నగరం విదేశాలలో మంచి పేరు తెచ్చుకుందని, కానీ సబ్‌‌ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్తే మాత్రం కండ్లు తిరిగి కిందపడే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పేదల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మార్పులు రావాలన్నారు.  ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం మాత్రమే కాకుండా, చెరువుల్లో నీళ్లు నిలిచి ఉండేలా, నాలాల ఆక్రమణలు తొలగించేలా చర్యలు తీసుకుంటామని, అన్నీ ప్రక్షాళన చేసుకొని ముందుకు వెళ్దామని సీఎం తెలిపారు. 

సాంకేతిక పరిజ్ఞానంతో రిజిస్ట్రేషన్ సేవలు:  శ్రీధర్​బాబు

ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇందుకోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రిజిస్ట్రేషన్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్ నగరాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, గతంలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్‌‌లో రూ.10 వేల కోట్లు కేటాయించి చిత్తశుద్ధిని నిరూపించుకున్నామని తెలిపారు. నగరవాసులకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నామని చెప్పారు.

దశలవారీగా నిర్మాణం: పొంగులేటి

రాష్ట్ర ఆర్థిక ప‌‌రిస్థితి బాగోలేకున్నా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమం రెండు క‌‌ండ్లుగా ముందుకు సాగుతున్నామ‌‌ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి అన్నారు.  ఒక్కొక్కటిగా అభివృద్ధి కార్యక్రమాలు అమ‌‌లు జ‌‌రుగుతున్నాయ‌‌ని, దానిలో భాగంగానే ఈ ఇంటిగ్రేటెడ్ స‌‌బ్ రిజిస్ట్రార్ భ‌‌వ‌‌నాల శంకుస్థాప‌‌న అని వివ‌‌రించారు. ప్రస్తుతం జిహెచ్ఎంసీ, ఓఆర్ ఆర్ ప‌‌రిధిలోగ‌‌ల 39  స‌‌బ్ రిజిస్ట్రార్ ఆఫీసుల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రిజిస్ట్రేష‌‌న్ల రూపేణా సుమారు 62- నుంచి 63 శాతం ఆదాయం ల‌‌భిస్తున్నదన్నారు. వీటిని 11 ఇంటిగ్రేటెడ్ భ‌‌వ‌‌నాల ప‌‌రిధిలోకి తీసుకువ‌‌స్తామన్నారు. సుమారు మూడు ఎక‌‌రాలలోని  దాదాపు 50 వేల చ‌‌ద‌‌ర‌‌పు అడుగుల విస్తీర్ణంలో , 300 కార్లు పార్కింగ్ సౌక‌‌ర్యం త‌‌దిత‌‌రాల‌‌తో ఇంటిగ్రేటెడ్ స‌‌బ్ రిజిస్ట్రార్ భ‌‌వ‌‌నాలు ఉంటాయని ఆయన చెప్పారు.