నీ ఇంట్లో, ఒంట్లో.. నీ రక్తంలోనే డ్రామా ఉంది.. కేటీఆర్‎పై CM రేవంత్ రెడ్డి ఫైర్

నీ ఇంట్లో, ఒంట్లో.. నీ రక్తంలోనే డ్రామా ఉంది.. కేటీఆర్‎పై CM రేవంత్ రెడ్డి ఫైర్

న్యూఢిల్లీ: బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ డ్రామాలేస్తుందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల బిల్లులకు కేంద్రం ఆమోదం తెలపాలని ఢిల్లీలో కాంగ్రెస్ చేస్తోన్న ధర్నాను కేటీఆర్ డ్రామా అంటున్నాడు. కానీ కేటీఆర్ పేరే డ్రామా రావు. నీ ఇంట్లో, ఒంట్లో, నీ రక్తంలోనే డ్రామా ఉందని డ్రామాలు వేసుకుంటునే నీ కుటుంబం బతుకుతోందని కేటీఆర్‎కు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ఇంట్లోనే ఒకరు బీసీ రిజర్వేషన్లకు అనుకూలం.. మరొకరు వ్యతిరేకమని.. అటు ఇటు గానీ వాళ్లు నా గురించి మాట్లాతారా అని నిప్పులు చెరిగారు. 

బీసీ రిజర్వేషన్ల బిల్లులకు అసెంబ్లీలో మద్దతు తెలిపినా బీఆర్ఎస్.. ఆ బిల్లులకు కేంద్రం ఆమోదం తెలపాలని ఢిల్లీలో కాంగ్రెస్ చేపట్టిన మహాధర్నాకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు.బీసీల ఓట్లు మీకు అవసరం లేదా.. బలహీనవర్గాల పట్ల ఇదేనా మీ చిత్తశుద్ధి అని నిలదీశారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎందుకు నిలదీయట్లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కేసీఆర్ బీసీలపై కక్ష్య గట్టి తెలంగాణలో బలహీనవర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు మించకుండా చట్టం చేశారని విమర్శించారు. 

బలహీన వర్గాలకు అన్యాయం చేసే ఆ చట్టాన్ని తొలగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని.. ఆ ఆర్డినెన్స్‎ను కూడా కేంద్ర ప్రభుత్వం తొక్కిపెట్టిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై మరోసారి విరుచుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పిస్తే.. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు మోకాలడ్డేస్తున్నాయని ఫైర్ అయ్యారు. తెలంగాణ బీజేపీ నేతలంటే ప్రధాని మోడీ మోచేతి నీళ్లు తాగుతూ బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నారు.. మరీ బీఆర్ఎస్‎కు ఏమైంది..? మీరు కూడా మోడీ చెప్పులు మోస్తున్నారా అని విమర్శించారు.