
- ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు విషం చిమ్ముతున్నరు
- వాళ్లపై సోషల్ మీడియాలోనూ యుద్ధం చేయాలి
- కాంగ్రెస్ కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
- స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించుకుంటం
- వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తం..
- అత్యధికంగా వడ్లు పండించి రైతు రాజ్యం తెచ్చినం
- తొలి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలిచ్చినం.. ఒక్కటి తగ్గినా క్షమాపణ చెప్త
- మోదీ, కేసీఆర్, కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి సవాల్
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు విషం చిమ్ముతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఆ పార్టీ చేస్తున్న దుష్ర్పచారాన్ని తిప్పికొట్టాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ‘‘బీఆర్ఎస్ నేతలు దుబాయ్‌లో రూ.లక్షల పెట్టుబడితో ఆఫీసులు పెట్టి ప్రభుత్వంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా కాంగ్రెస్‌పై విషం చిమ్ముతున్నారు. మాకు కార్యకర్తలే బ్రాండ్ అంబాసిడర్లు.. మీరే సోషల్ మీడియాలోనూ యుద్ధం చేయాలి. కల్వకుంట్ల గడీలు తునాతునకలు కావాలె” అని అన్నారు.
గొప్ప పథకాలు తెచ్చినా ప్రచారం చేసుకోలేకపోతున్నామని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ‘సామాజిక న్యాయ సమర భేరి’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
‘‘నాయకుల ఎన్నికలు ముగిశాయి. ఇక మిగిలింది మీ ఎన్నికలే. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించుకుంటాం. వాళ్లకు నూటికి నూరు శాతం న్యాయం చేసే బాధ్యత నాదే. కార్యకర్తలు కంకణం కట్టుకుని గ్రామాలు, తండాలు, గూడేలు, మారుమూల ప్రాంతాలకు బయలుదేరాలి. కష్టపడి పనిచేసినోళ్లకు పార్టీలో గుర్తింపు ఉంటుంది. కార్యకర్తలను సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగా గెలిపించుకుంటాం” అని చెప్పారు.
అపోహలను పటాపంచలు చేశాం..
తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘తెలంగాణలో మాకు తిరుగులేదని అహంకారంతో విర్రవీగుతున్న కల్వకుంట్ల గడీలను బద్దలుకొట్టాం. మూడు రంగుల జెండా, మూడు రంగుల కండువా కప్పుకుని తెలంగాణ నలుమూలల పాదయాత్ర చేసినం. ఆనాడు మొదలు పెట్టిన నడకతో మహిళలు, రైతులు, యువకులు, నిరుద్యోగులను చైతన్యం చేసి ప్రజాపాలనకు నాంది పలికాం. ప్రతి గుండెను తడుతూ ప్రజాపాలన సాగిస్తున్నాం. కాంగ్రెస్ నేతలు కలిసి ఉండలేరని, సంక్షేమ పథకాలు అమలు చేయరని చాలామంది ప్రచారం చేశారు.
ఈ పాలన మూణ్నాళ్ల ముచ్చటే అని కొందరు అన్నారు. కానీ పార్టీ నేతలంతా ఐకమత్యంతో పని చేస్తూ ఆ అపోహలను పటాపంచలు చేశారు. నవ్వినోళ్ల ముందు తలెత్తుకుని నిలబడ్డాం. సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాం. రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీ మేరకు ఏడాదిలోపే కులగణన, ఎస్సీ వర్గీకరణ చేసి చూపించాం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చట్టసభల్లో బిల్లులను ఆమోదించాం. ఎన్ని కష్టాలు, ఒడిదొడుకులు ఎదురైనా అన్నింటినీ అధిగమించుకుంటూ ముందుకెళ్తున్నాం” అని చెప్పారు.
దేశంలోనే నంబర్ వన్‌గా తెలంగాణ..
తెలంగాణను దేశంలోనే నంబర్ వన్‌గా నిలబెట్టామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేస్తూ ముందుకెళ్తున్నాం. రైతుల కోసం 18 నెలల్లో రూ.1.04 లక్షల కోట్లు ఖర్చు చేశాం. రుణమాఫీ చేయడంతో పాటు రైతు భరోసా, సన్న వడ్లకు రూ.500 బోనస్ లాంటి పథకాలు అమలు చేస్తు న్నాం. వరి వేస్తే ఉరేనని గత ప్రభుత్వం చెప్పింది. కానీ, మేం అధికారంలోకి వచ్చాక ‘వరి వేయండి.. సన్న వడ్లకు బోనస్ ఇస్తాం’ అని రైతులకు చెప్పినం. 2.80 కోట్ల టన్నుల వడ్లు పండించి తెలంగాణను దేశంలోనే నంబర్ వన్‌గా నిలబెట్టాం.
వ్యవసాయం దండుగ కాదు.. పండుగ అని చేసి చూపించినం. ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ సరఫరా, రైతు భరోసా, సన్నొడ్లకు బోనస్, రుణమాఫీ, పేదలకు సన్నబియ్యం పంపిణీతో తెలంగాణ రాష్ట్రంలో రైతు రాజ్యం తెచ్చినం. రైతు రాజ్యం ఎవరు తెచ్చారో చర్చించేందుకు సిద్ధం.. చర్చకు ఎవరొస్తారో రండి.. కేసీఆర్, మోదీ, కిషన్ రెడ్డి.. ఇలా ఎవరొచ్చినా సరే” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
ఆడబిడ్డలకు 60 ఎమ్మెల్యే సీట్లు..
రాష్ట్రంలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు, లోక్‌సభ ఎన్నికల్లో 15 సీట్లు గెలుస్తామని.. దానికి తనదే బాధ్యతని చెప్పారు. ‘‘రాబోయే రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. అసెంబ్లీ సీట్ల సంఖ్య119 నుంచి 150కి పెరుగుతుంది. ఎంపీసీట్లు కూడా పెరుగుతాయి. మహిళా రిజర్వేషన్లు కూడా రానున్నాయి. 60 మంది ఆడ బిడ్డలు ఎమ్మెల్యేలు కాబోతున్నారు. ఐదారు మంది మహిళలు మంత్రులు కూడా అవుతారు. ప్రజల్లో ఉండండి.. ప్రజల కోసం పని చేయండి. మీరు ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం లేదు. మీ టికెట్.. మీ ఇంటికే వస్తుంది. మీకు టికెట్లు ఇచ్చి గెలిపించుకునే బాధ్యత ఖర్గే, రాహుల్ గాంధీ తీసుకుంటారు” అని చెప్పారు.
తొలి ఏడాదే 60 వేల ఉద్యోగాలు..
తాము అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ‘‘తొలి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశాం. కేసీఆర్, మోదీకి సవాల్ విసురుతు న్నా.. లెక్క కావాలంటే చెప్పండి.. అందర్నీ తీసుకొచ్చి ఎల్బీ స్టేడియంలో నిలబెడ్త. 60 వేలకు ఒక్కరు తక్కువ వచ్చినా క్షమాపణ చెప్పి తప్పుకుంటా” అని సవాల్ విసిరారు. పేదల సంక్షేమానికి పాటుపడ్డ ఇందిరాగాంధీ పేరు రూ.5 భోజనం కార్యక్రమానికి పెడితే తప్పేంటని ప్రశ్నించారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని.. వివిధ వ్యాపారాల్లో మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.