నేను రేసుగుర్రం.. శాతనైతే వెంట్రుక పీక్కో: కేసీఆర్ కు సీఎం రేవంత్ సవాల్

నేను రేసుగుర్రం.. శాతనైతే వెంట్రుక పీక్కో: కేసీఆర్ కు సీఎం రేవంత్ సవాల్

కోర్టుల్లో కేసులను పరిష్కరించి ఉద్యోగాల నియామకాలను చేపడుతున్నామని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.యువతకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం ఆనందంగా ఉందన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని పట్టించుకోలేదని విమర్శించారు. ఫిబ్రవరి 14వ తేదీ బుధవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన 15,750మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు.

పాలిచ్చే బర్రెను అమ్మేసి.. దున్నపోతు తెచ్చుకున్నారని కేసీఆర్ అంటున్నారని..కానీ, తెలంగాణ ప్రజలు మాత్రం, గత ప్రభుత్వంలో ఉన్న కంచెరగాడిదను ఇంటికి పంపించి.. ఈ ప్రభుత్వంలో రేసుగుర్రాన్ని తెచ్చుకున్నామని మీరు చెప్పండి సార్ తాను వింటానని శాసనసభలో ఉన్న ఒక అటెండర్ తనకు చెప్పారని రేవంత్ రెడ్డి అన్నారు.  ఏ రేసుకు పోయిన ఆ గుర్రానిదే గెలుపు.. ఆ కంచరగాడిదకు మళ్లీ అధికారం కలలో మాటేనని తీవ్రంగా విమర్శించారు. ఈ పదేళ్లు మన ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని.. మీరు అండగా ఉంటే మరో పదేళ్లు అధికారం మనదేనని చెప్పారు. కేసీఆర్ మళ్లీ వస్తానంటున్నాడు..రా బిడ్డా ఎట్లా వస్తవో చూస్తా.. పదేళ్లు తానే ఉంటా.. శాతనైతే ఈ పదేళ్లలో వెంట్రక పీక్కోని చూడు తెలుస్తది అంటూ రేవంత్ రెడ్డి.. కేసీఆర్ కు సవాల్ విసిరారు. 

యువకుల ఉద్యమం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు.ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం.. ప్రజల సమస్యలను పరిష్కరిస్తుందని.. బీఆర్ఎస్ పాలనలో యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని సీఎం చెప్పారు.  ఏప్రిల్ 2022లో నోటిఫికేషన్ వస్తే.. 22 నెలలుగా ఉద్యోగ నియామకాలు చేపట్టలేదన్నారు. మేము ఇచ్చిన మాట ప్రకారం.. కొత్త ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామన్నారు.

 యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తుంటే.. హరీష్ రావుకు ఎందుకు కడుపు మండుతుందని సీఎం రేవంత్ మండిపడ్డారు. మీ సంతోషంలో భాగస్వామ్యం కావాలనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఇదే ఎల్బీ స్టేడియంలో మేము ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు.. మీరు ఎంత సంతోష పడ్డారో.. ఇవాళ మీరు ఉద్యోగ నియామక పత్రాలు అందుకుంటుంటే.. మీ కుటుంబాలు, బందుమిత్రులు కూడా అంతే సంతోష పడుతారని ఆయన చెప్పారు.

కేసీఆర్..తన బంధువులకు అనేక పదువులను కట్టబెట్టారని.. కానీ తెలంగాణ కోసం కొట్లాడిన నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శించారు. మా ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కాకమందే.. మాపై కల్వకుంట్ల కుటుంబం దాడి చేసే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ సమాజం తిరస్కరించిందన్నారు. కేసీఆర్.. ఏ పరీక్షను సక్కగా నిర్వహించలేదని.. ఏదైనా పరీక్ష చేపట్టినా పేపర్లు లీకు చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నాడని ఫైర్ అయ్యారు సీఎం సీఎం రేవంత్ రెడ్డి.