కేసీఆర్ చచ్చినపాము.. త్వరలో ఆ చొక్కా, అంగీ ఊడపీకుతాం : సీఎం రేవంత్

కేసీఆర్ చచ్చినపాము.. త్వరలో ఆ చొక్కా, అంగీ ఊడపీకుతాం : సీఎం రేవంత్

నల్గొండ సభలో మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని ఏం పీకనీకిపోయినావ్ అని కేసీఆర్ ఎలా అంటారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భాష గురించి తెగ బాధపడుతున్నారని.. సీఎంగా.. ఎంపీగా.. ఎమ్మెల్యేగా సుదీర్ఘ అనుభవం ఉన్న కేసీఆర్ కు.. ఒక సీఎం గురించి ఎలా మాట్లాడాలో తెలియదా అని నిలదీశారు. మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ ప్యాంట్ ఊడబీకారని.. ఇప్పుడు చొక్కా, అంగీ ఊడబీకితాం అంటూ ఘాటుగా రిప్లయ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. 

నాలుగు కోట్ల మంది ఓట్లు వేస్తే సీఎం అయ్యానని.. అలాంటి సీఎంను పట్టుకుని ఏం పీకనీకిపోయినావ్ అంటూ కేసీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నాడంటూ విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డి. మేడిగడ్డ ప్రాజెక్టు మేడిపండుగా కూలిపోతే.. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా.. బాధ్యత లేదా అని ప్రశ్నించారు. హరీశ్ రావు, కేటీఆర్ లకు బాధ్యత అప్పగిస్తాం అని.. మేడిగడ్డలో నీళ్లు నింపుతారా అని సవాల్ చేశారు. 

కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్ల రూపాయలు అవినీతి చేశారని.. అలాంటి ప్రాజెక్టు కూలిపోతే ఎందుకు చూడటానికి రాలేదని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి.. కాళేశ్వరంలో అవినీతికి కేసీఆర్ మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు. మేడిగడ్డ ప్రాజెక్టు కూలిపోతే చూడటానికి రాకుండా.. పారిపోయి ఫాంహౌస్ లో దాక్కున్నాడంటూ కేసీఆర్ ను ఉద్దేశించి మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీకి ఎందుకు రావటం లేదని.. సభకు వస్తే ఎన్ని రోజులు అయినా చర్చించటానికి సిద్ధం అని ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, గోదావరి జలాలపై చర్చకు సిద్ధం అని.. కేసీఆర్ ను సభకు తీసుకురావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కోరారు. 

కేసీఆర్ చచ్చిన పాము.. ఇంకా ఎవరైనా చంపుతారా.. సానుభూతి కోసం వీల్ చైర్, వీధి నాటకాలు ఆడుతున్నాడని.. పారిపోయి ఫాంహౌస్ లో దాక్కుని ప్రగల్బాలు ఎందుకని.. ఆ మాటలు ఏవో అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సవాల్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.