క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తాం: మంత్రి పొన్నం

క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తాం: మంత్రి పొన్నం

హైదరాబాద్: కొత్తగా సెలక్టైన 15,750మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం నియామక పత్రాలను అందజేసింది. ఫిబ్రవరి 14వ తేదీ బుధవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్ లతోపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సివిల్, ఏఆర్, ఫైర్, ఎక్సైజ్ విభాగాల్లో ఎంపికైన అభ్యర్థులకు సీఎం రేవంత్ అపాయింట్ మెంట్ లెటర్స్ అందజేశారు. ఫిబ్రవరి 15వ తేదీ బ్రిడ్జీ స్కూల్ టీచర్స్, లైబ్రేరియన్లకు నియామక పత్రాలు ఇవ్వనుంది రాష్ట్ర ప్రభుత్వం.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ..  తెలంగాణ వచ్చాక కేసీఆర్ హయాంలో అన్నీ హక్కులు కోల్పోయామన్నారు. క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తామని చెప్పారు. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం మీరంతా పనిచేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి.. రెండు నెలలు కాకముందే బీఆర్ఎస్ నేతలు.. హామీలు ఎందుకు అమలు చేస్తలేరని అడుతున్నారని మంత్రి విమర్శించారు.

అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ..గత ప్రభుత్వం మాటలు చెప్పిందే తప్ప.. ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. గతంలో ప్రగతి భవన్.. బానిస భవన్ గా ఉండేదని విమర్శించారు.దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని, పేదలు డబుల్ బెడ్ రూమ్ లు.. ఇలా  కేసీఆర్ ఎన్నో అబద్దాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మళ్లీ వస్తానంటున్నాడని.. కేసీఆర్ తీర్థ యాత్రలకు పోవాల్సిందే తప్ప ఇకేం చేయలేరని ఎద్దేవా చేశారు మంత్రి జూపల్లి.