
ప్రగతిభవన్.. సారీ సారీ ప్రజాభవన్ వేదికగా వేలాది మంది బాధితులు.. ప్రజాదర్బార్ కు తరలి వచ్చారు. డిసెంబర్ 8వ తేదీ ఉదయం ఆరు గంటల నుంచే బాధితులు క్యూలో ఉన్నారు. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు సీఎం రేవంత్ రెడ్డి.. ప్రజా దర్బార్ కు వచ్చారు. బాధితులను సమస్యలను స్వయంగా వింటూ.. వారి సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించారు. ఓపిగ్గా బాధితుల బాధలు వింటూ.. వాళ్లు ఇచ్చిన పత్రాలను అధికారులకు అందజేశారు.
ఇదే సమయంలో ప్రజాభవన్ కు వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యను.. డిజిటల్ చేస్తున్నారు. వారి డేటాను కలెక్ట్ చేసి.. సమస్యను నమోదు చేస్తున్నారు. వారి ఫోన్ నెంబర్ తీసుకుంటున్నారు. సమస్య ఏంటీ అనేది తెలుసుకుంటూ.. మొత్తం వివరాలను డేటా ఎంట్రీ చేస్తున్నారు. అన్ని సమస్యలు ఒకే రోజు పరిష్కరించటం సాధ్యం కాదు కదా.. అందుకే మొత్తం సమస్యలను డేటా ఎంట్రీ చేసి.. ఆ తర్వాత ఆయా శాఖల ద్వారా పరిష్కరించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మాట్లాడటం.. వారి సమస్యలను వినటం ద్వారా.. బాధితుల్లో ఆనందం వ్యక్తం అవుతుంది. సీఎం వరకు మన సమస్యను తీసుకెళ్లగలిగాం.. పరిష్కారం వస్తుందనే ఆశతో ప్రజా దర్బార్ కు హాజరైన బాధితుల్లో కనిపిస్తుంది.
గతంలో కేసీఆర్ ఎప్పుడూ ప్రజా దర్బార్ నిర్వహించకపోగా.. ప్రజలతో సమస్యలు వినే అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు అందుకు భిన్నంగా ప్రజా దర్బార్ ద్వారా.. ప్రజలతో నేరుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం అనేది.. వారి సమస్యలు వినటం అనేది.. బాధితులకు ఊరటగా ఉంది.