
దేశంలో అత్యధికులు పూజించుకునే తల్లిలాంటి గోవులను పరిరక్షించేందుకు పెద్దఎత్తున గోశాలలను నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం స్వాగతించాల్సిన అంశం. భిన్నత్వంలో ఏకత్వమైన దేశ సంస్కృతిని, సంప్రదాయాలను గౌరవిస్తూనే రాష్ట్రంలో గోశాలలను నిర్వహించేందుకు ప్రభుత్వం వేగవంతంగా చర్యలు తీసుకుంటోంది. గోశాలలను నిర్మించాలనే సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
వేములవాడ, యాదగిరిగుట్ట, ఎన్కేపల్లి ప్రాంతాలలో భారీస్థాయిలో గోశాలలను ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సకల సదుపాయాలతో మరిన్ని గోశాలలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఇందులో భాగంగా దేవాదాయ, పశుసంవర్థక, రెవెన్యూ, వ్యవసాయ శాఖలకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఆధునిక గోశాలల ఏర్పాటుతోపాటు గోసంరక్షణ కోసం పశుసంవర్థకశాఖ చీఫ్ సెక్రటరీ సబ్యసాచి ఘోష్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, వ్యవసాయ శాఖ సెక్రటరీ రఘునందన్‌తో కూడిన ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ప్రభుత్వం గోశాలల నిర్మాణానికి మార్గదర్శకాలు విడుదల చేయనుంది.
ఒక అధ్యయనం గణాంకాల ప్రకారం 2023 నాటికి దేశంలో పశువులు 53.67 కోట్లు కాగా, తెలంగాణలో 3.26 కోట్లు ఉన్నాయి. తెలంగాణ జనాభాతో దాదాపు సరిసమానంగా ఉన్న పశుసంపదను కాపాడుకోవడంలో భాగంగానే ప్రభుత్వం తొలుత గోశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుంది. భక్తి శ్రద్దలతో దేవుడికి మొక్కులుగా దేవాలయాలకు అందించే కోడెలను పరిరక్షించాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి అందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రధానంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో కొంతకాలం క్రితం వరుసగా కోడెలు మృత్యువాత పడిన ఘటనలతో కలత చెందిన సీఎం వేములవాడతో సహా ఇతర చోట్ల కూడా తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు విలువైన సూచనలు చేశారు. వేములవాడ, యాదగిరిగుట్ట, ఎన్కేపల్లిలో సుమారు వంద ఎకరాల్లో, మిగతా ప్రాంతాల్లో కనీసం 50 ఎకరాల విస్తీర్ణం తగ్గకుండా గోశాలలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆవులను బంధించినట్టు కాకుండా స్వేచ్ఛగా తిరిగేలా విస్తృతమైన స్థలంలో ఒకే నమూనాలో ఏర్పాటుచేసే గోశాలల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు.
వెబ్, క్లౌడ్ ఆధారిత వ్యవస్థ
గోశాలల నిర్వహణతోపాటు ఆవుల పరిరక్షణకు వెబ్ ఆధారిత అప్లికేషన్లు, క్లౌడ్ ఆధారిత వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. గోశాలల్లో వెటర్నరీ వైద్యుడితో తగిన సిబ్బందిని నియమించనున్నారు. ఒక్కో గోశాలకు రూ.50 కోట్ల వరకు ఖర్చు పెట్టనున్న ప్రభుత్వం ఒక్కో ఆవుకు నాణ్యమైన దాణా అందించేందుకు రోజుకు 80 నుంచి 100 రూపాయల వరకు ఖర్చు చేస్తోంది. గోశాలల్లో ఆవుల పరిరక్షణకు చర్యలు తీసుకోవడంతోపాటు ఇంధన అవసరాలకు అనుగుణంగా బయోగ్యాస్ ప్లాంటు ఏర్పాటు చేస్తున్నారు. ఆవుపేడ, మూత్రం వంటి గోవుల వ్యర్థాలతో సహజసిద్ధమైన సేంద్రీయ బయో ఎరువుల ఉత్పత్తి ప్లాంట్లను కూడా నిర్మించబోతుండడంతో ఇవన్నీ వ్యవసాయ రంగానికి తోడ్పడుతాయి. వెటర్నరీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధ కాలేజీల సహాయ సహకారాలు కూడా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రవ్యాప్తంగా 21 గోశాలల ఏర్పాటు
ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 21 గోశాలల ఏర్పాటుకు స్థలాలను ఎంపిక చేసింది. రంగారెడ్డి జిల్లా ఎన్కేపల్లిలో 98 ఎకరాలు, గండిపేటలో 40 ఎకరాలు, జోగులాంబ గద్వాల్లో 99.2, మానవపాడులో 50 ఎకరాలు, వడ్డేపల్లిలో 82, నల్గొండలోని చింతలపల్లి మండలంలో 90.6, డిండిలో 153 ఎకరాలు, చెరుకుపల్లిలో 43 ఎకరాలు, ఇదే జిల్లాలో మరోచోట 36 ఎకరాలు, అడవిదేవులపల్లిలో 43.97 ఎకరాలు, నిర్మల్ జిల్లాలో 27 ఎకరాలు, ములుగులో 20 ఎకరాలు, కరీంనగర్ కొత్తపల్లిలో 22 ఎకరాలు, కామారెడ్డిలో 74.25 ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెంలో 50 ఎకరాలు, కామారెడ్డి బొప్పనపల్లిలో189, సంగారెడ్డి జిల్లాలో 85 ఎకరాలు గోశాలల కోసం సేకరిస్తున్నారు.
వేములవాడ దేవాలయం గోశాలలో నిర్వహణ లోపం దీర్ఘకాలికంగా కొనసాగుతుండడంతో దీనికి ముగింపు పలికేందుకు ప్రభుత్వం నడుంకట్టిందని చెప్పాలి. వేములవాడ దేవాలయం గోశాలకు సంబంధించి ప్రస్తుతం తిప్పాపురంలో 6 ఎకరాల్లో 6 షెడ్లలో ఆవులున్నాయి. ఒక్కో షెడ్డులో 50 ఆవులతో అక్కడి మొత్తం 300 సామర్థ్యం కాగా ప్రస్తుతం అక్కడ 1200కు పైగా గోవులు ఉన్నాయి. గోశాలలో ఆవులు సామర్థ్యానికి మించి అధికంగా ఉండడంతో స్థలం లేమితో అనారోగ్యాలకు గురికావడమే కాకుండా, తొక్కిసలాటలో కొన్ని గాయపడి మృతి చెందిన ఘటనలున్నాయి.
గోశాలల ఏర్పాటుపై సీఎం సమీక్షలు
వేములవాడ గోశాలలో ఆవులు ఎక్కువగా ఉండడంతో టెండర్ల పద్దతిలో వాటిని పంపిణీ చేస్తే, మొక్కుగా దేవుడి సన్నిధికి వచ్చిన కోడెలు కొన్ని పక్కదారి పట్టి కబేళాలకు తరలివెళ్లడంతో భక్తులు తీవ్ర కలత చెందడమే కాకుండా పెద్ద దుమారమే రేగింది. దీంతో ఈ పద్దతిని విరమించుకున్న దేవస్థానం రైతులకు ఉచితంగా ఇచ్చే ప్రక్రియ ప్రారంభించినా, అందులోనూ లోటుపాట్లు ఉండడంతో 2024 నవంబర్లో రైతులకు పంపిణీ ఆపివేశారు. అనంతరం దీనిపై అధ్యయనం చేపట్టి కట్టుదిట్టమైన చర్యలతో 2025 జూన్ 2వ తేదీని రైతులకు తిరిగి పంపిణీ చేయడం ప్రారంభించారు.
మరోవైపు గతంలో వేములవాడ గోశాలకు ప్రత్యేకంగా పశు వైద్యులు లేరు. ఆవులకు అవసరమైనప్పుడు వైద్యసేవలు అందించేందుకు దేవస్థానం ఇప్పుడు ఆరుగురు వెటర్నరీ వైద్యులను, 8 మంది వెటర్నరీ అసిస్టెంట్లను, 40 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంది. రాష్ట్రంలో పశు, పాడి నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలనే సద్దుదేశంతో ప్రభుత్వమే గోశాలల నిర్వహణ చేపట్టాలని ఎంతో సాహసంతో ముందుకొచ్చింది. త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలో గోశాలలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.
- ఐ.వి.
మురళీకృష్ణ శర్మ