
హైదరాబాద్, వెలుగు: వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే లోపు సభలో కీలకంగా వ్యవహరించనున్న చీఫ్ విప్, విప్ పదవులు భర్తీ చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చీఫ్ విప్ పదవి ఖాళీగానే ఉండడం, పలు సామాజిక సమీకరణలతో మంత్రి పదవులకు దూరమైన ఎమ్మెల్యేలకు ఈ పదవి ఇవ్వాలనే ఆలోచనలో సీఎం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతున్నది. కాగా, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాకు మంత్రి మండలిలో ప్రాతినిధ్యం లేకపోవడం, కేబినెట్ హోదా కలిగిన చీఫ్ విప్ తో ఆ లోటును భర్తీ చేసే ఆలోచనలో ఇటు సీఎం అటు పీసీసీ నాయకత్వం కూడా ఉన్నట్లు సమాచారం. ఈ జిల్లా నుంచి మంత్రి పదవి ఆశించిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పేరు ఈ పదవికి ప్రధానంగా ప్రచారంలో ఉంది. అయితే రంగారెడ్డి ఈ పదవి చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదని ఆయన వర్గం చెప్తున్నది. కానీ సీఎం రేవంత్ రెడ్డి.. మల్ రెడ్డి రంగారెడ్డిని ఒప్పించి ఈ పదవిని అప్పగిస్తారని పీసీసీ వర్గాలు చెప్తున్నాయి.
ఒకవేళ ఈ పదవి ఆయన తిరస్కరించినట్లయితే అదే జిల్లాకు చెందిన పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి. ఇక విప్ గా ఉన్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు మంత్రిగా పదొన్నతి రావడం, అలాగే మరో విప్ గా ఉన్న రాంచంద్రు నాయక్ ను డిప్యూటీ స్పీకర్ గా ప్రకటించడంతో రెండు విప్ పదవులు ఖాళీ అయ్యాయి. ఈ రెండింటిలో కూడా ఆ ఇద్దరి సామాజిక వర్గాల వారినే నియమించే ఆలోచనలో సీఎం ఉన్నట్లు సమాచారం. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్థానంలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మికాంతారావు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇక రాంచంద్రు నాయక్ స్థానంలో దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ లలో ఒకరిని విప్ గా నియమించే అవకాశం ఉన్నట్లు పార్టీలో చర్చ సాగుతున్నది.