- అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక భేటీ
- ప్రాజెక్టుకు అవసరమైన నిధుల సమీకరణపై చర్చ
- మూసీ పరీవాహక ప్రాంతాల పరిస్థితిపై ఆరా
- ఇప్పటివరకూ పూర్తయిన పనులను వివరించిన ఆఫీసర్లు
- ఎలక్షన్ కోడ్ అయిపోగానే గ్లోబల్ టెండర్ల ఖరారు
హైదరాబాద్, వెలుగు: మూసీ సుందరీకరణ పనులు ఇక వేగవంతం కానున్నాయి. ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే పనులు పట్టాలెక్కనున్నాయి. ఈ మేరకు మూసీ సుందరీకరణపై శుక్రవారం అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. నానక్‌రామ్‌గూడలోని హెచ్‌జీసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మున్సిపల్ శాఖ కార్యదర్శి దాన కిశోర్, మూసీ రివర్డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ ఆమ్రపాలి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూసీ ప్రాజెక్టు పురోగతి పై అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. అత్యంత భారీ ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటున్న మూసీ సుందరీకరణకు అవసరమైన నిధులను సేకరించే విషయంలోనూ అధికారులతో చర్చించినట్టు సమాచారం. మూసీ రివర్ డెవలప్‌మెంట్ కోసం పీపీపీ పద్ధతిలో టెండర్లు పిలిచారు. దాదాపు 58 వేల కోట్లు ఖర్చయ్యే మూసీ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. ఈ మెగా ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రముఖ కంపెనీలు ముందుకు వస్తున్నట్టు సమాచారం.
ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే సర్వే పనులు పూర్తి చేసిన అధికారులు నదీ ప్రవాహ తీరుపై కూడా స్టడీ చేశారు. ముఖ్యంగా మూసీ చుట్టూ 55 కిలోమీటర్ల పరిధిలో దాదాపు 12 వేల అక్రమ కట్టడాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. డ్రోన్ సర్వే ద్వారా మూసీలో అక్రమ కట్టడాలపై అధికారులు ఒక నివేదికను సిద్ధం చేసి, దీనిపై సీఎం రేవంత్‌కు వివరించినట్టు సమాచారం. ఇప్పటికే గ్లోబల్ టెండర్లు పిలిచామని, ఎలక్షన్ కోడ్ అయిపోగానే టెండర్లను ఫైనల్ చేయనున్నట్టు వివరించారు. ఈ మొత్తం వివరాలు తెలుసుకున్న సీఎం రేవంత్.. ఆయా పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్టు సమాచారం.
మౌలిక సదుపాయాలపై స్పెషల్ ఫోకస్
మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు సంబంధించి అధికారులు పూర్తిస్థాయిలో సర్వే పూర్తి చేశారు. మూసీనదికి ఇరువైపులా అందుబాటులో ఉన్న భూమిని పూర్తిగా వినియోగంలోకి తీసుకొచ్చి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని సీఎం రేవంత్‌కు వివరించినట్టు సమాచారం. మూసీలో స్వచ్ఛమైన నీరు ప్రవహించే విధంగా చర్యలు చేపట్టడంతోపాటు మురుగును పూర్తిగా మళ్లించడం, రిపేర్లు చేయడంపై దృష్టి పెట్టారు. మూసీ వెంట వివిధ ప్రైవేట్ సంస్థల సహకారంతో రెస్టారెంట్లు, వాటర్ అమ్యూజ్‌మెంట్స్, ఎంటర్టైన్మెంట్స్ వంటి వాటి కోసం మౌలిక సదుపాయాలను కల్పించాలని సర్కారు నిర్ణయించింది. మురికికూపంగా మారిపోయిన మూసీనదిని ఉపాధి కల్పన జోన్‌గా
మార్చాలని డిసైడ్ అయింది. ఈ మేరకు మధ్యంతర బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు కేటాయించింది. ఈ మేరకు మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది.
మూసీ అభివృద్ధి ఇలా..
తూర్పున ఔటర్ రింగ్ రోడ్డు గౌరెల్లి నుంచి పశ్చిమాన ఔటర్ రింగ్ రోడ్డు నార్సింగి వరకు 55 కిలోమీటర్ల మేర మూసీని అభివృద్ధి చేయడానికి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్) ఆధ్వర్యంలో ఇప్పటికే ప్రణాళికలు రూపొందిస్తున్నా రు. మూడేండ్లలో మూసీ అభివృద్ధి పనులు పీపీపీ పద్ధతిలో పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించడంతో ఆ దిశగా అధికారులు కార్యాచరణ రూపొందిస్తు న్నారు. విదేశాల్లో పలు రివర్ ఫ్రంట్ ప్రాజె క్టులను పరిశీలించిన అధికారుల బృందం మూసీ అభివృద్ధికి రూ.58 వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేసింది. మూసీనది అభివృద్ధిలో భాగంగా పీపుల్స్ ప్లాజాలు, సైకిల్ ట్రాక్‌లు, గ్రీన్‌వేలు, హాకర్ జోన్లు, వంతెనలు, వినోద, పర్యాటక ప్రాంతాలు, క్రీడా సౌకర్యాలు, పార్కింగ్ ప్రాంతాలు, వాణిజ్య, రిటైల్ స్థలాలు, ఆతిథ్య మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ విశ్వనగరంగా మరింత అభివృద్ధి సాధిస్తుందని భావిస్తున్నారు.
