
- పదేండ్లలో దోపిడీ, అవినీతిని వాళ్ల కుటుంబ సభ్యులే బయటపెడుతున్నరు: సీఎం రేవంత్
- మళ్లీ సెంటిమెంట్ రగిల్చిబతకాలని చూస్తున్నరు
- ఎకరాకు కోటి ఆదాయం అన్నోళ్లు..రాష్ట్ర రైతాంగానికి ఎందుకు నేర్పలే?
- పదేండ్లలో ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ నినాదం నెరవేరలే
- ఏడాదిలోనే మేం 60 వేల ఉద్యోగాలు భర్తీ చేసినం
- తెలంగాణ సాధనకు కొట్లాడినోళ్లకు పదవులిచ్చామని వెల్లడి
- గ్రూప్–2కు ఎంపికైనోళ్లకునియామక పత్రాలు అందజేత
హైదరాబాద్, వెలుగు : గత పాలకుల పాపాల పుట్ట పగులుతున్నదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ సర్కారు చేసిన దోపిడీ, అవినీతిని తాము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, ఆ కుటుంబ సభ్యులే స్వయంగా మీడియా ద్వారా బయటపెడుతున్నారని పేర్కొన్నారు. గ్రూప్-–-2 ఉద్యోగాలకు ఎంపికైన 783 మందికి శనివారం హైదరాబాద్ శిల్పా కళావేదికలో సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందజేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్ రామకృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడారు. మాజీ పాలకులు మళ్లీ సెంటిమెంట్‌ను రగిల్చి బతకాలని చూస్తున్నారని, జూబ్లీహిల్స్‌లో అలాగే చేస్తున్నారని అన్నారు. వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని, వాటిలో పైశాచిక ఆనందం కనిపిస్తున్నదని విమర్శించారు. ‘‘రెసిడెన్షియల్ స్కూల్స్‌లో పిల్లలకు ఫుడ్ పాయిజన్ కావొచ్చు.. అది శ్రీశైలం టన్నెల్ ప్రమాదం కావొచ్చు.. ఎలాంటి దురదృష్టకర సంఘటన జరిగినా వెంటనే ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తున్నారు. ప్రమాదాలు జరిగితే డ్యాన్స్‌లు చేస్తున్నారు. మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. వారి హయాంలో భారీ ప్రమాదాలు జరిగి పిల్లలు, మహిళలు చనిపోయినా చూసేందుకు రాని కనికరం లేని మనుషులు.. పాఠశాలల్లో పేదోళ్ల పిల్లలకు ఇబ్బంది వస్తే మాత్రం పైశాచిక ఆనందాన్ని ప్రదర్శిస్తున్నారు” అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
మట్టిలో మాణిక్యాలను వెలికితీసిన టీజీపీఎస్సీ
నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. టీజీపీఎస్సీ మట్టిలో మాణిక్యాలను వెలికి తీసినట్టుగా.. 5 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చిన గ్రూప్ –2లో 783 మందిని ఎంపిక చేసిందని ప్రశంసించారు. గ్రూప్ –1లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా నియామక పత్రాలు అందజేశామని, దీంతో మిగిలిన వారికి అవకాశాలు కోల్పోకుండా చూశామన్నారు. ఈ నియామకాల తర్వాత గ్రూప్– 3 పోస్టింగ్‌లు ఇస్తామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే తాము 60వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. తెలంగాణ ఉద్యమ అమరులు కన్న కలలను సాకారం చేసే బాధ్యతను కొత్తగా నియమితులైన అధికారుల చేతుల్లో పెడుతున్నామని తెలిపారు. ఉద్యోగం పొందిన తర్వాత తల్లిదండ్రులను చూసుకోని ఉద్యోగుల జీతంలో నుంచి 10 నుంచి 15 శాతం కోత విధించి, ఆ మొత్తాన్ని వారి తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసేందుకు చట్టం తీసుకొస్తామన్నారు. ఈ చట్టాన్ని కొత్తగా సెక్రటేరియెట్‌కు వచ్చే అధికారుల కమిటీతోనే రూపొందిస్తామని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సీఎస్‌కు సూచించారు.
ఇది తెలంగాణ భావోద్వేగం
ఈ నియామక పత్రం కేవలం ప్రభుత్వ ఉద్యోగం కాదని.. ఇది తెలంగాణ భావోద్వేగం అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్‌ను ముందుకు నడిపించేందుకు, 2047 నాటికి రాష్ట్రాన్ని ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా తీర్చిదిద్దే బాధ్యతను కొత్త ఉద్యోగులకు అప్పగిస్తున్నామన్నారు. ఈ బాధ్యత గాజు అద్దం లాంటిదని, జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. శ్రీకాంతాచారి, వేణుగోపాల్‌రెడ్డి, ఈషాన్ రెడ్డి, యాదయ్య, కానిస్టేబుల్ కిష్టయ్యలాంటి అమరులు.. లక్షలాది మంది నిరుద్యోగు కలలు పండాలని ఆత్మబలిదానాలు చేసుకున్నారని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. అయితే, గత పదేండ్ల పాలనలో ‘‘నీళ్లు, నిధులు, నియామకాలు’’ అనే నినాదం నెరవేరలేదన్నారు. నాటి పాలకులు, కుటుంబ సభ్యులు అదానీ, అంబానీలతో పోటీ పడ్డారని, అల్లుడిని అంబానీ, బిడ్డను బిర్లాను చేయాలనే కలలు కంటూ, ఒక్క క్షణం కూడా నిద్రపోయే ముందు శ్రీకాంతాచారి లాంటి అమరుల లక్ష్యం గురించి ఆలోచించలేదన్నారు. చిత్తశుద్ధి లోపించడం వల్లే లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం కూలేశ్వరం అయిందని, ఇది చరిత్రలో ఎప్పుడూ జరగని దుర్ఘటన అని పేర్కొన్నారు. నిధుల విషయానికి వస్తే ఫామ్‌హౌస్‌లో ఎకరానికి కోటి రూపాయల ఆదాయం వస్తుందని చెప్పిన నాయకుడు (కేసీఆర్), ఆ విద్యను రాష్ట్ర రైతాంగానికి ఎందుకు నేర్పలేదని ప్రశ్నించారు. వ్యవసాయంలో కోటి రూపాయల ఆదాయం అనేది 64 కళల్లోని ‘చోరకళ’లో పరోక్షంగా వచ్చిన కళనేమో అని పరోక్షంగా కేసీఆర్‌కు చురకలంటించారు.
తెలంగాణ ఉద్యమకారులకు ప్రాధాన్యమిచ్చినం..
గత పాలకులు తమ కుటుంబంలో ఏ ఒక్కరిని ఖాళీగా ఉంచకుండా.. అర్హత ఉన్నా లేకపోయినా, పార్లమెంట్‌లో ఓడిపోయిన వారిని సైతం (ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్, ఎమ్మెల్సీ పదవులు) ప్రభుత్వంలోని అన్ని హోదాల్లో భర్తీ చేసుకున్నదని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. కానీ, తాము తెలంగాణ ఉద్యమకారులకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు. ఇయ్యాల ప్రభుత్వంలో ఉన్న భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి, గడ్డం ప్రసాద్ కుమార్, సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ విద్యార్థి నాయకత్వం నుంచి వచ్చినవారని, తెలంగాణ సాధనకు కృషి చేసినవారని చెప్పారు. 2015లో గ్రూప్2 నోటిఫికేషన్ తర్వాత 2025 వరకు భర్తీ జరగలేదంటే ఆనాటి ప్రభుత్వ ప్రాధాన్యత ఏంటో యువకులు ఆలోచించాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో 2011లో గ్రూప్ –1 నోటిఫికేషన్ ఇస్తే, మళ్లీ 15 ఏండ్ల తర్వాత 20 రోజుల క్రితం 562 మంది గ్రూప్ –1 విజేతలకు నియామక పత్రాలు ఇచ్చామని గుర్తు చేశారు. తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలీ చేసి రూపాయి రూపాయి కూడబెట్టి పంపిస్తే.. పరీక్షలు నిర్వహించకపోవడం, నిర్వహించినా ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లీ బఠానీల్లాగా అమ్ముడవుతుంటే విద్యార్థులు గుండె పగిలి రోదించారని గుర్తు చేశారు. 30 ఏండ్ల పోరాటమైన ఎస్సీ వర్గీకరణకు తాము శాశ్వత పరిష్కారం చూపించామని, 100 ఏండ్ల సమస్య అయిన కులగణనను 16 నెలల్లో పూర్తి చేసి, ఫిబ్రవరి 4న ‘సోషల్ జస్టిస్’ డేగా జరుపుకుంటున్నామని చెప్పారు. దేశంలోనే జనాభా, కుల లెక్కలు సేకరించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని, 2026 జనగణనలో కులగణనను చేర్చాల్సిన పరిస్థితిని కేంద్ర ప్రభుత్వంపై కల్పించి దేశానికే ఆదర్శంగా మారామని వెల్లడించారు.