
- సీనియర్ల అభిప్రాయాలు తీసుకొని ముందుకెళ్లాలని సీఎం రేవంత్ నిర్ణయం
- పీసీసీ చీఫ్ మహేశ్‌తో గంటన్నరపాటు భేటీ
- బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలపై సమాలోచనలు
- జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, నామినేటెడ్ పోస్టులపైనా చర్చ
- పీసీసీ చీఫ్ రెండో విడత పాదయాత్రపైనా డిస్కషన్
హైదరాబాద్, వెలుగు: బీసీ బిల్లులను కేంద్రం ఆమోదించకపోవడంతో 42 % బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ సీనియర్ల అభిప్రాయం తీసుకొని ముందుకువెళ్లాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ నెల 16 లేదా17న పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం నిర్వహించాలని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌కు సూచించారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేశ్ సమావేశమయ్యారు. గంటన్నరపాటు ఇద్దరూ భేటీ అయి.. పలు అంశాలపై సమాలోచనలు చేశారు. బీసీ రిజర్వేషన్లు, లోకల్‌బాడీ ఎలక్షన్స్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక, నామినేటెడ్‌పోస్టులు, పీసీసీ చీఫ్ రెండో విడత పాదయాత్ర సహా పలు కీలక అంశాలపై చర్చ సాగింది.
బీసీ బిల్లులు, పంచాయతీ రాజ్చట్టసవరణ ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి ఆమోదించకపోవడంతో స్థానిక ఎన్నికలకు ఎలా ముందుకెళ్లాలనేదానిపై సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్మహేశ్గౌడ్ చర్చించారు. ఇటీవల ఢిల్లీలో రాష్ట్ర సర్కారు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించినప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాని విషయం ప్రస్తావనకు వచ్చింది. బీసీ బిల్లులను రాష్ట్రపతి ఆమోదించకుంటే కనీసం ఆర్డినెన్స్ద్వారా పంచాయతీరాజ్చట్టంలో రిజర్వేషన్లపై ఉన్న 50శాతం సీలింగ్ఎత్తివేసి.. జీవో ద్వారా ఎన్నికలకు వెళ్లాలని భావించామని, కానీ ఆర్డినెన్స్‌ను కూడా పెండింగ్ పెట్టడంతో ఇప్పుడు పార్టీపరంగా 42 రిజర్వేషన్లు ఇవ్వడమే ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నదని సీఎం పేర్కొన్నట్లు తెలిసింది.
దీనికి పార్టీపరంగా తమకేమీ ఇబ్బంది లేదని మహేశ్‌గౌడ్ అన్నట్లు సమాచారం. కీలకమైన నిర్ణయం కావడంతో పీఏసీ సమావేశంలో సీనియర్లతో చర్చించి, వారి సలహాతో ముందుకు వెళ్లాలని ఇద్దరూ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. హైకోర్టు ఇచ్చిన గడువులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, తాము పార్టీపరంగా 42శాతం రిజర్వేషన్లు ఇస్తే మిగిలిన పార్టీలు కూడా ఇవ్వక తప్పదని ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.
సర్వే రిపోర్ట్ ఆధారంగానే అభ్యర్థి ఎంపిక
త్వరలో జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల అంశంపై సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్ చర్చించినట్టు తెలిసింది. ప్రస్తుతం సర్వే కొనసాగుతున్నందున.. ఆ రిపోర్టు వచ్చిన తర్వాతే అభ్యర్థిని ఎంపిక చేయాలని, ఆలోగా కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలను జనంలోకి తీసుకెళ్లే కార్యక్రమాలను కొనసాగించాలని నిర్ణయించారు. ఇప్పటికే ముగ్గురు మంత్రులు వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వర్‌రావు, పొన్నం ప్రభాకర్ కు బాధ్యతలు అప్పగించామని, వారు నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలను కలుస్తున్నారని, పార్టీ పరంగా సమావేశాలు నిర్వహిస్తున్నారని పీసీసీ చీఫ్ గుర్తుచేసినట్లు తెలిసింది. జూబ్లీహిల్స్‌లోనూ కంటోన్మెంట్ తరహా ఫలితాలు రిపీట్ చేసేందుకు అనుసరించాల్సిన ఇతరత్రా వ్యూహాలపై సీఎం, పీసీసీ చీఫ్ చర్చించినట్లు పార్టీవర్గాలు చెప్తున్నాయి.
రెండో విడత పాదయాత్రపై..
రెండో విడత పాదయాత్రను ఈ నెల 23 నుంచి నిర్వహించబోతున్నామని, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఎన్ని రోజులు కొనసాగించాలనే దానిపై త్వరలో పార్టీ నేతలతో నిర్వహించే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని రేవంత్‌రెడ్డికి మహేశ్‌గౌడ్ తెలిపారు. మొదటి విడత ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని, వివిధ సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయని వివరించారు. మంత్రులు, అధికారులతో మాట్లాడి వాటిని వెంటనే పరిష్కరించాలని, అప్పుడే రెండో విడత యాత్రపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని సీఎం రేవంత్ సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సన్న బియ్యం, రేషన్ కార్డుల పంపిణీ, ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్స్ పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని, ముఖ్యంగా సన్నబియ్యం స్కీమ్ ప్రభుత్వానికి గేమ్‌చేంజర్‌లా మారిందని మహేశ్‌గౌడ్ వివరించారు. రెండో విడత పాదయాత్రలో ప్రభుత్వ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలని, లోకల్ బాడీ ఎన్నికలకు ఈ యాత్ర బూస్టింగ్ఇచ్చేలా ఉండాలని సీఎం సూచించారు.
వారం, పదిరోజుల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీ
లోకల్‌బాడీ ఎన్నికల నేపథ్యంలో కేడర్‌లో ఉత్సాహం నింపేందుకు మిగిలిన నామినేటెడ్పోస్టులను మరోవారం, పది రోజుల్లో భర్తీ చేయాలని రేవంత్‌రెడ్డి, మహేశ్‌కుమార్ గౌడ్ నిర్ణయించారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉన్న పలు కార్పొరేషన్, ఫెడరేషన్, కమిషన్‌కు సభ్యులను నియమించే కసరత్తు ఇప్పటికే తుది దశకు చేరినట్లు చర్చకు వచ్చింది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 2 నుంచి 3 డైరెక్టర్ పదవులు దక్కాలని, అందులో మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేసి సామాజిక న్యాయం పాటించాలని నిర్ణయించినట్లు తెలిసింది.